Suryaa.co.in

Andhra Pradesh

కృష్ణా జిల్లాలో పాఠశాలలను సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

• నేతృత్వం వహించిన సమగ్రశిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
• మెచ్చుకున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని శ్రీ అన్నే సీతారామయ్య జడ్పీ హైస్కూల్ (పీఎం శ్రీ ), దావాజీగూడెంలో మోడల్ ఫౌండేషన్ స్కూళ్లను మంగళవారం వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది.

ఈ సందర్శనకు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వం వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో విద్యా విధానాలు, విద్యార్థుల అభ్యాస పద్ధతులు, సృజనాత్మకత, విద్యా ప్రమాణాలను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను సమీక్షించారు. అనంతరం విద్యార్థులతో మమేకమయ్యారు. ప్రతినిధులు అడిగి ప్రశ్నలకు చక్కని సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. తరగతి గదులను సందర్శించి, ఉపాధ్యాయుల బోధన పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యాభివృద్ధికి విద్యాశాఖా చేస్తున్న కృషి అభినందనీయమని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు.

ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వీరే:

ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు క్రిస్టెల్ (ఆర్ధికవేత్త, టాస్క్ టీమ్ లీడర్), కీకో ఇనొయు (దక్షిణ ఆసియా ప్రతినిధి), జుంకో ఒనిషి (లీడ్ సోషియల్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్, హ్యూమన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ లీడర్, ఇండియా), డి. హెచ్. సి. అటూరుపనే (లీడ్ ఆర్ధికవేత్త), కార్తీక్ పెంటల్ (సీనియర్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్), ట్రేసీ విలిచ్కోవ్స్కీ, దీపా బాలకృష్ణన్ (సీనియర్ పర్యావరణ స్పెషలిస్ట్), తనుజ్ మథూర్ (సీనియర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్), ప్రియాంకా సాహూ (కన్సల్టెంట్), విద్యాశాఖా, సమగ్ర శిక్షా తరఫున మన బడి మన భవిష్యత్తు జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం గారు, శామో అడిషనల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ దివాన్ రెడ్డి , కృష్ణా జిల్లా డీఈవో రామారావు , సత్త్వా కైవల్య, టీచ్ టూల్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మోడల్ ఫౌండేషన్ స్కూల్లో చిన్నారులతో కాసేపు

అనంతరం గన్నవరం మండలం దావాజీగూడెంలో మోడల్ ఫౌండేషన్ స్కూల్ సందర్శించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు విద్యార్థులతో ఆత్మీయ చర్చ నిర్వహించి, విద్యార్థుల దృష్టిని, అభిరుచులను అర్థం చేసుకోవడానికి ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. అందులో కూరగాయల పేర్లు, ఆహార అలవాట్లు, వారి చదువులపై అభిప్రాయాలు చర్చించారు. విద్యార్థులు కూడా తన్మయంతో పాల్గొని సరైన సమాధానాలు ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం 1, 2 తరగతుల బోధనా విధానాన్ని, బోధన సామగ్రిని పరిశీలించారు.

LEAVE A RESPONSE