Suryaa.co.in

Andhra Pradesh

యుపిఐ విధానంలో గదులు పొందిన భక్తులకు ఒక గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌

– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి

తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసి యుపిఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేయడం జరుగుతోంద‌ని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 7 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం జమ చేస్త‌న్నామ‌ని తెలిపారు. ఈ సమాచారం ధ్రువీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్‌ సెంటర్లకు ఫోన్లు చేసి, అధికారులకు మెయిళ్లు పంపుతున్నార‌ని, భక్తులు తమ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించుకుని కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ కాకపోతేనే సంప్రదించాలని కోరారు.

రీఫండ్‌ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తప్పుగా సరిచూసుకుంటున్నార‌ని, ఎస్ఎంఎస్‌లో సూచించిన విధంగా 3 నుండి 7 రోజులు వేచి ఉండడం లేదని వివ‌రించారు. మ‌రికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్‌ కోడ్‌ సబ్‌మిట్‌ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్‌ జనరేట్‌ కావడం లేదని వివ‌రించారు.

LEAVE A RESPONSE