Suryaa.co.in

Andhra Pradesh

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

– జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

తాడేపల్లిలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం నాడు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… దేశ స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన, త్యాగాలు చేసిన మహనీయులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఇవాళ దేశమంతా 73 వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్య్ర ఫలితాలు ప్రజలందరూ సమానంగా అనుభవించాలనే దిశగా ప్రతి చిన్నవిషయాన్ని విపులంగా రాజ్యాంగంలో తెలియచేశారని అన్నారు. కులం,మతం,ప్రాంతం,పార్టీలకతీతంగా మనుషులందరూ సమానమే. స్వాతంత్య్ర దేశంలో అందరికి పుట్టే హక్కు ఎలా ఉందో.. జీవించే హక్కు అలాగే ఉంటుంది అన్నారు. అందరూ సమానంగా జీవించే హక్కును రాజ్యాంగం ద్వారా కల్పించారని తెలియచేశారు. ప్రతి 17 మందిలో ఒకరు ఈరోజుకు కూడా సంపూర్ణంగా తినలేని పరిస్ధితిలో ఉన్నారు.

ఇది వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ పరిస్ధితి అధిగమించాలి. అందుకనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిపాలనా పగ్గాలు చేపట్టిన రోజునుంచి సమానత్వం ఏ విధంగా తీసుకుని రావాలి అనే దిశగా ఆలోచన చేస్తూ పరిపాలన చేస్తున్నారన్నారు. పేదలకు అవసరమైన ఉపాది,చదువు,ఆరోగ్యం సమకూర్చాలనే దిశగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఎవరూ ఎవరికి బానిసలు కాదు, అందరూ సమానులేనన్నారు.పేదరికానికి స్వస్తి చెప్పాలని అనేక సంక్షేమ పధకాలను జగన్ గారు తీసుకువచ్చారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలు ఇప్పటికే అమలు చేయడంతోపాటు, మేనిఫెస్టోలో లేకపోయినా, ఓబిసిలు కూడా నష్టపోతున్నారనే ఉద్దేశంతో వారికోసం ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేశారని తెలిపారు.
ప్రపంచదేశాలలో చూస్తే అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అత్యంత ఉన్నతమైనది, శక్తివంతమైనదన్నారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని అమలు చేసుకుని ఉంటే భారతదేశంలోని పరిస్ధితులు ఇంకా మెరుగ్గా ఉండి ఉండేవి అని ఉమ్మారెడ్డి అన్నారు.

మన దేశ జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు కృష్ణాజిల్లా వాసి. ఆయన పతాకాన్ని రూపొందించి, దానిని జాతిపిత మహాత్మాగాంధీ గారికి ఇచ్చారు. పింగళి కుటుంబ సభ్యులు చాలా దయనీయపరిస్ధితుల్లో ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆయన మనవరాలిని మాచర్లలో కలసి ఆర్ధికంగా సహాయం అందించారన్నారు. జగన్‌ ఆలోచనా విధానం ఎంత గొప్పగా ఉంటుందో ఈ సంఘటన తెలియచేస్తోందన్నారు.

లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, అంబేద్కర్‌ చూపిన బాటలో నడుస్తూ కులం,మతం,ప్రాంతం,పార్టీ అనే వాటికి తావులేకుండా అందరికీ సమానత్వం కల్పిస్తూ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. పేదరికం నిర్మూలన దిశగా సంక్షేమం, అభివృధ్ది రెండుకళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. పరిపాలనను ప్రజలకు చేరువుగా తీసుకువెళ్తున్నారని అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు కూడా ఇందులో భాగమేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ శాసనసభ్యులు కిలారి రోశయ్య, విజయవాడ సిటి అధ్యక్షులు బొప్పన భవకుమార్,ఎస్సి కార్పోరేషన్‌ ఛైర్మన్‌ లు అమ్మాజి, కనకారావు మాదిగ,నవరత్నాల అమలు ప్రోగ్రామ్‌ వైస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి,రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరి రావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE