– జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పతనం ఖాయం
– రేవంత్ నకిలీ వాగ్దానాలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఓటమితోనే అంతమవుతాయి
– జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కోల్పోతే, 500 రోజుల్లో కేసీఆర్ తిరిగి సీఎం అవుతారు- కేటీఆర్
– గతంలో ఎంతో మంది నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే
– జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలవబోతోంది
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి బెదిరింపులకు ఎవరూ భయపడరని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్ డివిజన్లో నిర్వహించిన భారీ రోడ్‌షోలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ బెదిరింపులకు తెలంగాణ ప్రజలు తలవంచరని ఆయన స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు రద్దు చేయాలని చూస్తే, ఇదే జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారని హెచ్చరించారు. రేవంత్‌లాగా ఎగిరిపడుతున్న ఎంతో మంది నియంతలు పతనమయ్యారని.. దీనికి రేవంత్ రెడ్డి కూడా మినహాయింపు కాదని తేల్చిచెప్పారు. ఓటమి భయంతో సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లో ఎవరైనా కాంగ్రెస్ నేతలు ప్రజలను భయపెడితే.. తెలంగాణ భవన్ ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని హామీ ఇచ్చిన కేటీఆర్.. వారి సంగతి తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందని అన్నారు కేటీఆర్. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. గత ఎన్నికల్లో వచ్చిన దానికంటే రెట్టింపు మెజార్టీ రాబోతోందని వెల్లడించారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం గోపినాథ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొన్ని కోట్ల విలువైన భూమిని కాపాడటంలో గోపినాథ్ కృషి మరువలేనిదని చెప్పారు. అయితే.. గోపినాథ్ అకాల మరణంతో ఈ ఎన్నిక వచ్చిందన్న ఆయన.. తన భర్తను తలుచుకొని సునీత కన్నీరు పెట్టుకుంటే కూడా కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఫైరయ్యారు. సిగ్గులేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా విఫలమైందని కేటీఆర్ ఫైరయ్యారు. మహిళలకు, వృద్ధులకు నెలకు రూ.4వేలు పెన్షన్.. యువతులకు స్కూటీలు, యువతకు రూ.2,500 ఇస్తామని చెప్పి మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ.. పురుషులపై రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పైగా కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు లేవు, రంజాన్, క్రిస్మస్ కానుకలను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసిందని మండిపడ్డారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. నిరుద్యోగ భృతి నెలకు రూ.4 వేలు ఇస్తామని వాగ్దానం చేసి.. నెరవేర్చలేకపోయిందని ఫైర్ అయ్యారు. అటు.. రేవంత్ రెడ్డిది కాంగ్రెస్‌తో ఫేక్ బంధం.. బీజేపీతో పేగు బంధం ఉందని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారని చెప్పారు.
తప్పుల మీద తప్పులు చేస్తున్న రేవంత్ సర్కార్‌కు.. జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ది చెప్పబోతున్నారని స్పష్టం చేశారు కేటీఆర్. బీఆర్ఎస్కు భారీ విజయం దక్కబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతే, 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా తిరిగి వస్తారని చెప్పారు.