– జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను అజారుద్దీన్ గెలిపిస్తారా?
– నియోజకవర్గంలో లక్షా 20 వేల ముస్లిం ఓటర్లు
– అజారుద్దీన్ కాంగ్రెస్‌ను గెలిపిస్తారా?
– ముస్లిం మైనారిటీ ఓట్లలో భారీ చీలిక?
– ముస్లిం ఓటర్లలో మాగంటి ఇమేజ్
– జీవించిన సమయంలో ముస్లింలకు దన్నుగా నిలిచిన మాగంటి గోపీనాధ్
– అజార్‌ను ఇంకా సెలబ్రిటీగా చూస్తున్న మైనారిటీలు
– కొన్ని డివిజన్లలో బీఆర్ఎస్ వైపే మైనారిటీలు
– ముస్లిం ఆధిపత్య షేక్పేట్లోనూ కారు జోరు
– కాంగ్రెస్‌కు దన్నుగా నిలిచే షే్ పేటలో మారిన సీన్
– మెజారిటీ యాదవులు-క్రైస్తవుల ఓట్లు కాంగ్రెస్‌కే
– మాగంటికే కమ్మవర్గం మద్దతు
– ఆంధ్రా సెటిలర్ల ఓట్లూ బీఆర్ఎస్కే
– సునీత వైపే మహిళా ఓటర్లు
– ఉప ఎన్నికలో ఉధృతంగా సునీత సానుభూతి పవనాలు
– ఆమెపై విమర్శలతో సానుభూతి పెంచిన కాంగ్రెస్
– సునీతకు ముస్లిం, కమ్మ, బీసీ వర్గాల దన్ను
– హామీల అమలు ఏవంటూ మంత్రులపై జనం ప్రశ్నల వర్షం
– కాంగ్రెస్ పెన్షన్, తులం బంగారం, స్కూటీ హామీలు ఏవంటూ మంత్రులపై మహిళల ప్రశ్నల వర్షం
– పెన్షన్ ఎప్పుడు పెంచుతారని మంత్రి జూపల్లిని నిలదీసిన ఓ వృద్ధురాలు
– సోఏల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యనే
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గ్రౌండ్ రిపోర్ట్
( మార్తి సుబ్రహ్మణ్యం)
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతితో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. పోటీలో అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ భార్య సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచార సరళి పరిశీలిస్తే.. పోటీ అంతా బీఆర్ఎస్-కాంగ్రెస్ అభ్యర్ధులకే పరిమితం అయినట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో లక్షా 20 వేల ఓట్లు ఉన్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు.. హటాత్తుగా మంత్రి పదవి ఇచ్చిన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ఏ మేరకు కాంగ్రెస్‌ను గెలిపిస్తారు? ముస్లిం ఓటర్లను ఏవిధంగా గంపగుత్తగా కాంగ్రెస్ వైపు నడిపిస్తారు? అజారుద్దీన్ గ్లామర్- ఇమేజ్ జమిలిగా కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ ఎంతవరకూ గట్టెక్కిస్తుంది? బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత పక్షాన బలంగా వీస్తున్న సానుభూతి పవనాలను అధిగమించి అజారుద్దీన్, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్‌ను ఏవిధంగా గ ట్టెక్కిస్తారు? నియోజకవర్గంలోని కమ్మ, సెటిలర్ల ఓట్లు ఎటువైపు అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. దానికి సంబంధించి గ్రౌండ్రిపోర్టు ఇదీ..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్‌కు సారథ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌కు ప్రాణప్రతిష్ఠగా పరిణమించింది. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, రాజధాని నగరంలో రెండోసారి జరుగుతున్న ఈ ఉప ఎన్నిక, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠ-పలుకుబడికి పెను సవాలుగా పరిణమించింది. అంతకుముందు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే రెండేళ్ల అనంతరం.. కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు మొదలయిన తర్వాత జరుగుతున్న ఈ ఉప ఎన్నిక ఫలితం, కాంగ్రెస్ స్వరూపాన్ని మార్చే అవకాశం లేకపోలేదన్నది ఆ పార్టీ సీనియర్ల ఉవాచ.
జూబ్లీహిల్స్‌లో మూడుసార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని మెజారిటీతో గెలిచిన దివంగత మాగంటి గోపీనాధ్‌కు ప్రజల్లో అందరికీ అందుబాటులో ఉంటారన్న మంచి పేరుంది. ప్రధానంగా కమ్మ-ముస్లిం వర్గాల్లో ఆయనకు తిరుగులేని ఇమేజ్ ఉంది. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, తర్వాత మిగిలిన వారి దారిలోనే టీఆర్ఎస్లో చేరారు. తర్వాత రెండుసార్లు ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ముస్లింలలో క్రేజ్ సంపాదించుకున్నారు. ముస్లింల సమస్యలకు వెంటనే పరిష్కరించేవారు. వారికి అందుబాటులో ఉండేవారు. మతపరమైన కార్యక్రమాలకు ఆర్ధిక సాయం చేసేవారు.
మాగంటి కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావటంతో.. నియోజకవర్గంలోని 36 వేల మంది కమ్మ ఓటర్లు, సహజంగా ఆయన వైపే మొగ్గు చూపారు.పైగా ఆయన తొలి నుంచే ఎన్టీఆర్ వెన్నంటి ఉండటం కమ్మ-సెటిలర్లలో ఆయనంటే అభిమానానికి కారణమయింది. టీడీపీలో కొన్ని కారణాలతో ఆయనంటే పడని కమ్మవర్గం ఉన్నప్పటికీ, ఎన్నికల సమయంలో మాత్రం కులాభిమానంతో ఆయనకే ఓటు వేసిన పరిస్థితి.
జూబ్లీహిల్స్, వెంగళరావునగర్ వంటి ప్రాంతాల్లో బలంగా ఉన్న కమ్మ వర్గానికి మాగంటితో అనుబంధం ఎక్కువ. ఇప్పుడు ఆయన మరణంతో వారంతా గోపీనాధ్ భార్య సునీత.. ఏ పార్టీలో ఉన్నారన్నది చూడకుండా, కేవలం కులాభిమానం-గోపీనాథ్‌పై సానుభూతితో బీఆర్ఎస్ వైపు చూస్తున్న పరిస్థితి. నిజానికి గత రెండు ఎన్నికల్లోనూ కమ్మవర్గంతో పాటు, సెటిర్లంతా మాగంటికే జైకొట్టారు. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోంది.
మాగంటి మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికలో తొలుత సానుభూతి పెద్దగా ఏమీ కనిపించలేదు. కానీ మంత్రులు, కాంగ్రెస్ నేతలు.. సునీత ఓట్ల కోసం ఏడుస్తోందంటూ చేసిన ఆరోపణలు ఆమెకు సానుభూతి తెచ్చిపెట్టేందుకు కారణమయ్యాయి. ఇది మహిళల ఆగ్రహానికీ కారణమయింది. భర్తను కోల్పోయి ఒక మహిళకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ చేస్తున్న అనాగరిక ప్రచారాన్ని మహిళలు జీర్ణించుకోలేపోతున్నారు.
దానితో సునీత పక్షాన పెరుగుతున్న సానుభూతి ప్రమాదం గ్రహించిన సీఎం రేవంత్.. హ టాత్తుగా పీజేఆర్ మృతి సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారు. అయితే కొత్త తరం ఓటర్లు ఎక్కువ ఉండటం.. వారికి పీజేఆర్ గురించి అంతగా తెలియకపోవడంతో, రేవంత్ సంధిస్తున్న పీజేఆర్ సానుభూతి కార్డు అంతగా జనంలోకి వెళ్లనట్లు కనిపిస్తోంది. పీజేఆర్ మృతి తర్వాత ఏకగ్రీవానికి టీడీపీ-బీజేపీ అంగీకరించినా కేసీఆర్ అంగీకరించలేదని రేవంత్ గుర్తు చేస్తున్నారు.
అది నిజమే అయినప్పటికీ.. మరి మాగంటి చనిపోతే కాంగ్రెస్ పార్టీ, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టిందన్న కొత్త చర్చ తెరపైకి వచ్చింది. గతంలో కేసీఆర్ తప్పు చేశారని విమర్శిస్తున్న రేవంత్.. ఇప్పుడు తాను కూడా అదే తప్పు ఎందుకు చేస్తున్నారన్న చర్చ మొదలయింది.
ఇదీ లెక్క!
కాగా జూబ్లీహిల్స్ నియోజకవ ర్గంలో లక్షా 20 వేల మంది ముస్లిం ఓటర్లు ఉండగా, దాదాపు 60 మంది యాదవులు, 36 వేల మంది కమ్మ ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న షేక్‌పేట డివిజన్, తొలి నుంచీ కాంగ్రెస్‌కు బలమైన స్థావరం. అలాంటి డివిజన్లో ఇప్పుడు దాదాపు 60 శాతం ముస్లింలు, మాగంటి భార్య వైపు నిలబడటం ఆసక్తికరంగా మారింది.
ప్రచారానికి వెళుతున్న బీఆర్ఎస్ బృందాలతో.. మీరు ప్రచారానికి రావలసిన పనిలేదు. గోపీనాధ్ మాకు చాలా సాయం చేశారు. ఆయన భార్యను గెలిపించి రుణం తీర్చుకుంటామన్న ముస్లింల మాటల బట్టి.. ముస్లిం ఓటర్లలో భారీ చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
‘‘ ఇక్కడి ముస్లింల అభిమానం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది. గోపీనాధ్‌కు ముస్లింలలో ఎంత అభిమానం ఉందో షేక్‌పేట్‌లో మేం కళ్లారా చూశాం. సహజంగా ఓటర్లు ఒక నాయకుడికి ఈ స్థాయిలో మద్దతుగా ఉండటం అరుదు’’ అని షే్ పేట్లో ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్న, బీఆర్ఎస్ మహిళా నేత భవనం షకీలారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన షకీలారెడ్డి, కొంతకాలం క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
అజారుద్దీన్‌తో లాభమెంత?
ఈ పరిస్థితిలో అజారుద్దీన్‌కు ఆగమేఘాలపై మంత్రి పదవి ఇవ్వడం వల్ల కాంగ్రెస్‌కు వచ్చే ప్రయోజనం ఏమిటి? ముస్లిం ఓటర్లను గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్లిస్తారన్న అంచనాతో, ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టినా.. వారు ఎన్నికలో పార్టీకి ఓటు వేయకపోతే, ఇక అజారుద్దీన్ వల్ల ఏం ఉపయోగం అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలయింది. నిజానికి అజారుద్దీన్‌ను ముస్లిం ఓటర్లతోపాటు, మిగిలిన వర్గాలు కూడా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, సెలబ్రిటీగానే చూస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పైగా రెండేళ్లు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వకుండా, ఉప ఎన్నిక సమయంలో కేవలం ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారన్న బీఆర్ఎస్ విమర్శలు, ముస్లిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాము ఎప్పటినుంచో మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, ఉప ఎన్నిక సమయంలో మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెసుకు ముస్లింలపై కంటే, వారి ఓట్లపైనే ప్రేమ ఎక్కువన్న బీఆర్ఎస్ ప్రచార ప్రభావం.. ముస్లిం యువకులు, విద్యాధికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్‌ను కూడా అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదంటున్నారు. గతంలో మజ్లిస్ అభ్యర్ధిగా రెండోస్థానంలో నిలిచిన నవీన్‌కు, ముస్లిం- యాదవుల్లో ఆదరణ ఉందంటున్నారు. క్రైస్తవులు కూడా కాంగ్రెస్ వైపు ఉండటం ఆయనకు ప్లస్ పాయింటేనంటున్నారు. అది కాకుండా యువతలో కొంత క్రేజ్, సినిమా కార్మికుల దన్ను కూడా ఉందంటున్నారు.
ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌పై వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలున్నప్పటికీ, ఆ కుటుంబం చేసే సామాజిక సేవా కార్యక్రమాలు కొంత కలసిరావచ్చంటున్నారు. కాగా నవీన్ చేసే ప్రకటనలు, ఆయన వెంట తిరిగే జనం, చేస్తున్న హడావిడి తటస్తులు, విద్యావంతుల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నాయంటున్నారు. పోలింగ్ వరకూ నవీన్ ఎంత మౌనంగా ఉంటే, అంత మంచిదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కమలానికి కలసి రాని హిందుత్వ కార్డు
ఇక బీజేపీ కంటే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఈ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. కిషన్‌రెడ్డి పట్టుపట్టి మరీ దీపక్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. గతంలో 25 వేల ఓట్లు తెచ్చుకున్న దీపక్‌రెడ్డి, ఓడిన తర్వాత నియోజకవర్గంపై దృష్టి సారించలేదన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. మరోవైపు గత పార్లమెంటు ఎన్నికల్లో.. తనకు సాయం చేసిన బీఆర్ఎస్ రుణం తీర్చుకునేందుకే, బలహీనమైన అభ్యర్ధిని బీజేపీ నిలబెట్టిందన్న సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
అయితే దీపక్‌రెడ్డి విజయం కోసం రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎంపి ఈటల రాజేందర్, డికె అరుణ, మాజీ ఎంపి గరికపాటి మోహన్రావుతోపాటు యావత్ నగర పార్టీ యంత్రాంగం జూబ్లీహిల్స్‌లో తిష్ఠవేసి, దీపక్‌రెడ్డి విజయం కోసం అవిశ్రాంగంగా ప్రచారం చేస్తోంది.
కాగా ఎన్నికలో విజయం కోసం బీజేపీ నేతలు హిందుత్వ కార్డు, ప్రభుత్వ భూములను ముస్లిం శ్మశానవాటికలకు కేటాయిచడం, కాంగ్రెస్ ముస్లిం సంతుష్టీకరణ విధానాలను ప్రచారం చేస్తున్నప్పటికీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లలో అలాంటి మతపరమైన భావన పెద్దగా కనిపించడంలేదు. అయితే పోటీ మాత్రం బీఆర్ఎస్-కాంగ్రె స్ మధ్యనే కనిపిస్తోంది.
కారెక్కుతున్న తెలంగాణ తమ్ముళ్లు
ఇక టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా మాగంటి సునీతకే మద్దతునిస్తున్న పరిస్థితి. బహుశా బీజేపీ నాయకత్వానికి, స్థానిక టీడీపీ నాయకత్వంతో సమన్వయం లేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఎన్నిక తర్వాత తెలుగుయువత నేత ప్రదీప్ చౌదరి, మైనారిటీ నేత మస్కతి, తెలుగుమహిళా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. తాజాగా టీడీపీ స్థానిక నేత శ్రీనివాస్, ఆయన భార్య కూడా కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఎవరి బలమెంత?
కాగా ఇప్పటి ప్రచార సరళి ప్రకారం.. విజయం బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీతకే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. యూసఫ్‌గూడ, బోరబండ, శ్రీనగర్‌కాలనీ, ఎర్రగడ్డ, షేక్‌పేట డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్ధి సునీతకే మొగ్గు ఉన్నట్లు సర్వేలు కూడా చెప్పడం విశేషం. ఇప్పటి ప్రచార సరళి ప్రకారం.. బీఆర్ఎస్కు 55.2, కాంగ్రెస్‌కు 37.8, బీజేపీకి 7 శాతం సానుకూలత ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత, మిగిలిన ఇద్దరికంటే 7 శాతం ఆధిక్యంతో ముందంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల మ్మ వర్గ ప్రముఖులు కొందరు.. సీఎం రేవంత్‌రెడ్డిని కలసి మద్దతు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మెజారిటీ కమ్మ ఓటర్లు మాత్రం, మాగంటి సునీత వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
కమ్మ ఓట్ల సాధనకు సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియమించినా, ఆ ప్రయోగం పెద్దగా ఫలించే అవకాశం కనిపించడం లేదని కాంగ్రెస్ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. పెద్దమనిషి-కులం కోసం పరితపించే నేతగా తుమ్మలపై కమ్మ వర్గంలో గౌరవాభిమానాలు ఉన్నప్పటికీ, అభ్యర్ధి కూడా అదే కులానికి చెందిన మహిళ కావడంతో, ఈ ఉప ఎన్నిక వరకూ ఆయన ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చంటున్నారు.
ఏతావతా కాంగ్రెస్ ఎంత అధికార దుర్వినియోగం చేసినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా మాగంటి సునీత 10 నుంచి 15 వేల మెజారిటీతో గెలవడం ఖాయమన్న ధీమా బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముస్లిం-కమ్మ-సెటిలర్లే తమను గెలిపిస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.