Suryaa.co.in

Telangana

బీసీలందరికీ రేవంత్ క్షమాపణలు చెప్పాలి

– బీసీ కులగణన తప్పులతడక అని ఒప్పుకున్నందుకు సంతోషం
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.

అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తంచేసినా వినకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాలి.

రెండోసారి సర్వేనైనా సమగ్రంగా చేయడంతోపాటు.. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.కేవలం తూతూమంత్రంగా తీర్మానం చేసి.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుందామంటే మాత్రం బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నిలబెట్టుకునే వరకూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని బీసీలెవరూ నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుంటే మంచిది.

LEAVE A RESPONSE