Suryaa.co.in

Telangana

రేవంతూ.. ఆ భూముల్ని వదిలేయకూడదూ!

– తెలంగాణ సమాజం కుల పిచ్చితో కూడుకున్న సమాజం కాదు
– చైతన్యం ఉండే సమాజం
– తేడా వస్తే కింద గోడ కుర్చీ వేయించేస్తారు

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తీసుకుని వేలం వేసే పనిని మానుకోవాలి. ఆ భూములు యూనివర్సిటీవి కావు, ప్రభుత్వానివే అనే వాదన అప్రస్తుతం. ప్రభుత్వానివే అయినప్పటికీ కూడా అలాంటి ప్రయత్నం మానుకోవాలి.

ఎందుకంటే అవి ఏ ఖాయిలా పడ్డ పరిశ్రమకు చెందిన భూములో అయితే ఇలాంటి సెంటిమెంటు ఉండదు. అవి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న భూములు. అక్కడ ధరలు పెరిగాయి కాబట్టి వాటిని అమ్ముకుంటే ప్రభుత్వ పథకాలకు నిధులు చేకూరతాయి కాబట్టి వాటిని అమ్మబోవటం సరికాదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పోతే పరిస్థితులు తారుమారవుతాయి.

తెలంగాణ సమాజం మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కుల పిచ్చితో కూడుకున్న సమాజం కాదు. చైతన్యం ఉండే సమాజం. 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉండి దాదాపుగా మూడు నాలుగు లక్షల కోట్ల కిమ్మత్తు కలిగిన మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఏదో చిన్న రాగి చెంబు సంచిలో పెట్టేసుకున్నట్టుగా, మోడీ ప్రభుత్వం పెట్టేసుకోబోతే ఇక్కడ మా తెలుగు వీరులు ముగ్గురిలోనూ ప్రతి ఒక్కడు, మిగతా ఇద్దరిని ఆడిపోసుకుంటారే తప్ప, సరుకు ఎత్తుకుపోయే మోడీని మటుకు మాట అంటే ఒట్టు.

అలాంటి మహావీరులని నాయకులుగా కలిగిన మహోన్నత నేల మాది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్లతోనే మేము ముడిపడి ఉంటాం. కానీ మీ తెలంగాణలో అలా కుదరదుసుమీ. తేడా వస్తే కింద గోడ కుర్చీ వేయించేస్తారు. అందుచేత అలా అంటే జనం సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దుందుడుకుతనం కూడదు. ఈగోలకు అసలే పోకూడదు.

మనలో మన మాట, నిజంగా డబ్బే అవసరమైతే గనక అక్కడే మీరు కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్తే ఒక టీ ఇచ్చి అప్పు తెచ్చే పథకాలు అనేకం చెబుతాడు. ఒకవేళ అతను మీకు చెప్పకపోతే ఓ కారేసుకుని(ప్రత్యేక విమానాలవీ అనవసరం సుమీ)మా ఆంధ్ర వచ్చేస్తే ఇక్కడ మా జగను, చంద్రబాబు కూడా అలాంటి విషయాల్లో ఆరితేరిన వాళ్ళు. ఎన్ని లక్షల కోట్ల అప్పయినా ఇట్టే పుట్టించగలరు. అలాంటి వాళ్ళ సేవల్ని వాడుకొని హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్ని వదిలేయటం మీకు మంచిది. మీ పార్టీ సానుభూతిపరుడిగా ఇది నా అభిప్రాయం.

– పేపకాయల రామకృష్ణ

LEAVE A RESPONSE