బద్వేల్ ఉప ఎన్నిక నిర్వహణపై సమీక్షా సమావేశం

– తెదేపా నుంచి పాల్గొన్న పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ఆంధ్రప్రదేశ్ సచివాలయం 5 వ బ్లాక్ లో బద్వేల్ ఉప ఎన్నిక నిర్వాహణ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెందిన ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయానంద్ అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.తెలుగుదేశం తరపున ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పాల్గొన్నారు.ఎన్నికల నిర్వహణ గురించి ఎన్నికల కమిషన్ సి.ఈ.ఓ రాజకీయ పార్టీలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ సూచనలను పాలనాయంత్రాంగం తూ.చ తప్పకుండా పాటించే విధంగా ఆదేశాలు జారీచేయాలని ఎలక్టోరల్ ఆఫీసర్ ను కోరినట్లు తెలిపారు.ఇటీవల జరిగిన తిరుపతి ఉపఎన్నికల్లో పలు చోట్ల ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను అధికారులు పాటించలేదని ఉదాహరణలతో సహా కమిషన్ ముందుంచారు. షెడ్యూల్ విడుదల రోజు నుంచి ఎన్నిక పూర్తయ్యే వరకు అధికారం యంత్రాంగ మొత్తం ఎన్నికల కమిషన్ నియంత్రణలోకి వచ్చేటట్లు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
గతంలో ఒక మంత్రి ఎన్నికలు జరిగే రోజున తనకు తిరుపతిలో కూడా మరో ఇల్లు ఉందని, తిరుపతి నుంచి ఖాళీ చేయనని మొరాయిస్తే ఎన్నికల కమిషన్ కూడా మౌనం వహించిందని తెలియజేశారు. సెంట్రల్ అబ్జర్వర్స్ కూడా ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున ఉండాలని సూచించారు. వాలంటీర్ వ్యవస్థ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ వ్యవస్థ అధికార పార్టీ ఎన్నికల విజయం కోసమే నియమించిన వ్యవస్థ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు ఎట్టి పరిస్థితులలో వేలు పెట్టకుండా చూడాలని తెలియజేశారు.
నకిలీ ఓటర్ కార్డులు అరికట్టాలని, బయట ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు గుంపులు గుంపులుగా వచ్చే వారిని అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. చెక్ పోస్టు నిర్వహణ అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని తెలియజేశారు. తిరుపతి ఉప ఎన్నికలా కాకుండా పారదర్శకంగా నిర్వహించాలని, ప్రభుత్వ యంత్రాగం ఎన్నికల కమిషన్ నియంత్రణలో పనిచేయాలని మరీమరీ కోరారు. అధికార పార్టీ ఆగడాలను అరికట్టాలని, పాలనా యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించేటట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలా తీసుకోని పక్షంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయడం హాస్యాస్పదంగా ఉంటుందని తెలియజేశారు.

Leave a Reply