– “ప్రాధాన్యత లేని ఖర్చు ఖజానాకు చేటు”
“ప్రజలకు, పాలకులకు సంక్షేమ పథకాలే సర్వస్వం అయినప్పుడు ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే మిగితా అన్ని విషయాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. తమకు విద్య, వైద్యం, ఉపాధి నైపుణ్యాలు అవసరం అనే స్పృహ ప్రజలు విస్మరిస్తే… పాలకులు తాత్కాలిక తాయిలాలతో ప్రజలను ఏమర్చి, తమ పబ్బం గడుపుకుంటార”నే విషయం తెలంగాణ రాష్ట్రంలో రుజువయ్యింది.
“నీళ్లు, నిధులు, నియామకాల” ఎజెండాతో ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ తెలంగాణ ఉద్యమం విజయవంతమైనా-ఉద్యమ ఫలాలను అందుకోవడంలో తెలంగాణ సమాజం మాత్రం దారుణమైన పరాభవాన్ని రుచి చూసింది. “తెలంగాణ రాష్ట్రం సాకారమైతే ప్రజల జీవితాలు గణనీయంగా పురోభివృద్ధి సాధిస్తాయని” నమ్మబలికిన నాయకత్వమే గత ఐదు సంవత్సరాలుగా పాలక పక్షంలో కూర్చొని తెలంగాణను ఏలుతున్నది. అపారమైన సహజ వనరులు, బహుళ ఆదాయ మార్గాలు,మిగులు బడ్జెట్ తో తులతూగిన తెలంగాణ ఖజానా నేడు లోటుతో కూనరిల్లుతున్నది.
‘2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం తెలంగాణ అప్పులు ఒక లక్షా ఎనభై వేల కోట్లు’ అని ఆర్థిక శాఖ మాత్యులు ఈటల రాజేందర్ గారు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ మొత్తానికి ప్రతి సంవత్సరం 11 వేల కోట్ల రూపాయలను వడ్డీ రూపంలో చెల్లిస్తున్నట్లు కూడా తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అప్పులు ఒక లక్షా 30 వేల 54 కోట్ల రూపాయలుగా ఉండగా అందులో తెలంగాణ వాటా కేవలం 69 వేల 515 కోట్లుగా ఉండింది. అయితే ఈ అప్పు మొత్తం 2017-18 బడ్జెట్ ప్రకారము క్రమక్రమంగా రెండు లక్షల 16 వేల 26 కోట్లకు పెరిగింది. అయితే 2018-19 బడ్జెట్ అంచనా ప్రకారం 2 లక్షల 50 వేల కోట్లు దాటే అవకాశం ఉంది. అంటే తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ నుండి జూన్ 2,2014 నుండి వేరే రాష్ట్రంగా మనుగడలోకి వచ్చిన సమయంలో రెవెన్యూ మిగులు అనేది 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూపాయలు 7,500 కోట్లుగా ఉండింది.
అదే 2018-19 బడ్జెట్లో ద్రవ్యలోటు అంచనా రూపాయలు 29 వేల 77 కోట్లు గా చూపబడింది. అంటే ఇది కేంద్ర వాటా రూపాయలు 29 వేల 41 కోట్ల కంటే ఎక్కువ. ఈ అంకెలను గమనిస్తే “మిగులు బడ్జెట్” తో ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ “లోటు బడ్జెట్ ” లోకి వచ్చిందనే విషయం తెలుస్తుతున్నది. ఇలా ఒక వైపు మిగులు బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్ గా మారడంతోపాటు, మరోవైపు ప్రభుత్వం చేసిన అప్పులు కూడా గణనీయంగా పెరిగాయి.2014-15 లో 9,410 కోట్ల అప్పుతో మొదలైన ప్రయాణం 2016 -17 సంవత్సరానికి గరిష్టంగా 35,280 కోట్లకు చేరుకున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 23,470 కోట్ల అప్పులు చేసి ప్రభుత్వం తెలంగాణ అప్పులను దాదాపు 2 లక్షల 50 వేల కోట్లకు చేర్చింది.
చిన్న చిన్న బిల్లులు మొదలు ఉద్యోగుల వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితులు దాపురించినట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం కనిపిస్తున్నది.ప్రతి నెల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వము చెల్లిస్తున్న సొమ్ములో సింహ భాగము అంటే రెండు వేల కోట్ల రూపాయలు అప్పుల పై వడ్డీ చెల్లింపులకే పోతున్నది.ఈ వడ్డీలు తాజా అప్పులతో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత పన్నెండు వందల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు పోగా, ఆసరా పెన్షన్ లకు 420 కోట్లు, కల్యాణ లక్ష్మి ,కెసిఆర్ కిట్ లకు 200 కోట్లు ఖర్చు అవుతున్నది. సబ్సిడీ బియ్యం 168 కోట్ల రూపాయలను కలుపుకుంటే మొత్తం “రాష్ట్ర ప్రభుత్వ నెలవారీ వ్యయము నాలుగు వేల కోట్ల పై మాటే!”
ఇదిలా ఉండగా రోజురోజుకు అన్ని రంగాలలో ప్రభుత్వం చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు పేరుకుపోతున్నాయి. కెసిఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులు 20 వేల కోట్ల పైమాటే! రోడ్లు,భవనాల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు చెల్లించవలసినది 1000 కోట్లుగా ఉంది. పంచాయతీ రాజ్, కార్పొరేషన్లు, మిషన్ కాకతీయ, మున్సిపాలిటీలు – కార్పొరేషన్లలో…1400 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, ఇతర సంస్థలకు చెల్లించవలసి ఉన్నది. ఈ మొత్తం 22,400 కోట్లకు చేరుకున్నది. ఎన్నికలు వరుసగా రావడం తో ఎవరూ ఏమీ చేసే పరిస్థితి లేదని మిన్నకుండి పోయారు-చాలా మంది కాంట్రాక్టర్లు, ఇతరులు.
ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి?
మిగులు బడ్జెట్ తో అలరారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కేవలం ఐదు సంవత్సరాలలో కనీస చెల్లింపులు చేయలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? బుద్ధి జీవుల మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న ఇది. కొన్ని ప్రధానమైన కారణాలను గుర్తించవచ్చు. అప్రధాన, అనుత్పాదక వ్యయాలకు గానూ విపరీతమైన నిధులు కేటాయించడం ఒక ముఖ్యమైన తప్పిదంగా చెప్పవచ్చు. కుల మతాల వారీగా కేటాయింపులు జరిపి, గుళ్లకు గోపురాలకు, యజ్ఞయాగాదులకు అనాలోచితంగా ఖర్చులు చేయడం, అనవసర హంగులు, ఆర్భాటాలకు పోయి ప్రచారాలు నిర్వహించడం, “ప్రజలు కోరుకున్న వాటి కంటే కూడా కోరని వాటిని ముందుగా నెరవేర్చడం” వల్ల ప్రత్యేకత చాటుకునే ప్రయత్నాలు చేయడం జరిగింది. అంతటితో ఆగకుండా ఉద్యోగులు అడిగిన దానికంటే కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకొని “ఒక శాతం ఎక్కువ” ఇచ్చే “ఆధిక్యత,ఆదిపత్య భావం” కూడా ఈ పరిస్థితులకు కారణంగా చెప్పవచ్చు.
ప్రణాళిక లేకుండా పనులను చేపట్టి వాటిని మధ్యలోనే ఆపి, కొత్త పనులను మొదలు పెట్టడం వల్ల అనేకమైన వనరులు వృధా కావడం జరిగింది. అవసరం ఉన్న దానికంటే పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం తద్వారా రాష్ట్రం మొత్తంలో జరగవలసిన నిర్మాణాలను, అభివృద్ధిని, నిధులను కేవలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న, తనకు నచ్చిన ప్రాంతాల వైపే మళ్లించడం వల్ల అభివృద్ధి కేంద్రీకృతం అయ్యింది.
ఉదాహరణకు గజ్వేల్ నియోజకవర్గాన్నే తీసుకుందాం! స్వయానా సీ.ఎం.నియోజకవర్గం కావడం అనే ఒకే ఒక్క అర్హత వల్ల విశృంఖల,విధ్వంసక అభివృద్ధి ప్రణాళికలు రచించారు. ప్రజల ప్రత్యక్ష పరిపాలన, ప్రణాళికా భాగస్వామ్యం లేకుండా – అవసరమా?,అనవసరమా? అనే విచక్షణ లేకుండా అమాంతం నిధులను కేటాయించారు. దాదాపు 500 కోట్ల వ్యయంతో ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ విద్యాలయాలు, కాలేజీలు కనీస అవసరాలకు దూరంగా మౌనంగా రోదిస్తుంటే “పరిమిత వనరులను పరిమితమైన ప్రదేశాలకు పరిమితం చేయడం” విజ్ఞత అనిపించదు.
అదే గజ్వేల్లో పాత బస్టాండ్ ను 50 లక్షలతో అధునాతనంగా మార్చి వారం రోజులు తిరగకముందే కూల్చివేయడం, అదే స్థలంలో మార్కెట్ యార్డును నిర్మించడం – స్థానికులకు బాగా తెలుసు. ప్రభుత్వ స్థలంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించిన “వైట్ హౌస్” MLA బంగ్లా వీధి పోటు తో “ఆధునిక బూత్ బంగ్లా”గా మారుతున్నది.
మిషన్ భగీరథ పథకంలో మంచి మంచి కాంక్రీట్ రోడ్లను తవ్వి ఇంటింటికీ నల్లాలు బిగించారు. కానీ మెజారిటీ రోడ్లు నాశనమయ్యాయి.వేసిన రోడ్ లని ఒకవైపు కూలగొడుతూ,మరలా మరమ్మతు చేయించడం, లేదా కొత్తగా నిర్మించడానికి టెండర్లు పిలవాల్సి వస్తున్నది. దీనివల్ల విలువైన ప్రజాధనం వృధా అయిపోతున్నది.
“చిన్న రంధ్రమైనా పెద్ద పడవను ముంచిన” చందంగా తెలంగాణ విషయంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చాలా జరిగాయి. దాని ఫలితంగా ఆర్థిక పరిస్థితి దుర్లభంగా మారింది.
“ఆర్థిక మాంథ్యాలన్నీ మానసిక మాంథ్యాలే” అనే విషయం కీలకమైనది. మానసికమైన అనేకమైన అంశాలు ఆర్థిక వ్యవస్థను శాసిస్తాయి. అది కుటుంబ స్థాయి కావచ్చు, రాష్ట్ర, జాతీయ స్థాయి కావచ్చు. అహంకారం, ఆధిపత్య ధోరణి, కేంద్రీకృత పాలన, నియంతృత్వ ధోరణులు ఉన్నతస్థాయి నాయకత్వ మానసిక అంశాలు అయినప్పుడు ఆర్థిక వ్యవస్థ అథోగతి పాలుకావడం సహజమైన ప్రతిచర్య. “ఏక వ్యక్తి పరిపాలన అంతా చివరికి అనేక రకాలైన సంక్షోభాలను సృష్టిస్తుంది”. తాత్కాలిక తాయిలాలతో లొంగిపోయిన ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోయిన ఫలితంగా, అదే ప్రజలు “ప్రశ్నించే గొంతులను నొక్కేశాక” పాలకులకు అడ్డంకులు లేకపోవడం వలన జవాబుదారీతనం మసకబారిపోతుంది. అంతులేని అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి… ముందు ప్రజలు, వారి సమస్యలు కనిపించవు.
“అవినీతి అంతం” అంటూ వ్యవస్థ ప్రక్షాళన మొదలుపెట్టి ఆదిలోనే హంస పాదు చేయడం విడ్డూరం. అవినీతి విషయంలో దేశంలో ప్రథమ స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం అధిరోహించింది.” ప్రక్షాళన కేవలం ఏ ఒక్క శాఖ ప్రక్షాళన తో పూర్తి కాదు. అది పూర్తిగా రాజకీయ అవినీతి తో పేను కొని ఉన్నది. రాజకీయ అవినీతి పోనిదే అధికార, సామాజిక అవినీతి పోదు”. అసెంబ్లీ లో కూర్చున్న 90 శాతం మంది ఎమ్మెల్యేలు, అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు ప్రతి సంవత్సరం తమ, తమ కుటుంబ అప్పులు, ఆస్తులు తప్పనిసరిగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టుల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో జగమెరిగిన సత్యం.ఈ కీలకమైన విషయాలను వదిలిపెట్టి కేవలం “అవినీతి అంతం మా పంతం” అని ఎంతగా వల్లెవేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వ పనుల్లో, కార్యకలాపాల్లో అవినీతిని అంతమొందించకుండా ఖజానా ఖాళీ కాకుండా ఎవరు ఆపలేరు.
హేతుబద్ధమైన లాభాలను తీసుకోవద్దని చెప్పడం ఉద్దేశం కాదు. ప్రజలకు ఎంత చేరుతుందనేది, ఎంత నాణ్యమైన పనులు జరుగుతున్నాయనేది ముఖ్యం. పూర్తి చేసిన పనుల నుండి ఆదాయ సృష్టి జరుగుతున్నదా? లేదా ?అనే విషయం కీలకమైనది. ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నదా?లేదా? అనేది గుర్తించవలసిన విషయం. అనుత్పాదక విషయాలపై ఎంత పెట్టుబడి పెట్టిన, ప్రోత్సహించిన ఫలితం శూన్యం.
“ఓట్లను రాల్చే, ప్రజాకర్షక పథకాలు ప్రజలను తాత్కాలికంగా సంతోష పరుస్తాయి, కానీ దీర్ఘకాలికంగా చూస్తే అవన్నీ పరిపాలకుడి మెడకు గుదిబండలా మారుతాయి”. కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ, ఎకరాకు 4,000… ఇలాంటి పథకాలు ప్రజలకు తాత్కాలికంగా బాగున్నట్లు కనిపించిన, వాటి ఫలితంగా ఏర్పడుతున్న ఆర్థిక భారాన్ని వారితో పాటు, వారి పిల్లలు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసుకున్నాక ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటారు.
నిజానికి తెలంగాణ ప్రజానీకం ఏమి కోరుకుంటున్నారు?:
పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత నిర్బంధ విద్య, కేజీ టు పీజీ పథకం అమలు తమ పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో , కాలేజీల్లో చదువుకోవాలని ఆశిస్తున్నారు. ఆరోగ్య రంగానికి వచ్చినట్టయితే తమ దగ్గర్లో ఆసుపత్రి అన్ని వసతులతో, సిబ్బందితో ఉండి తమ ఆరోగ్య రక్షణ చూడాలని కోరుకుంటున్నారు. జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడుగుతున్నారు. అన్ని పరీక్షలు ఉచితంగా చేసే యంత్రాంగం ఉండాలని కోరుకుంటున్నారు- గ్రామానికో స్మశాన వాటిక, ఒక్క రూపాయి తో అంత్యక్రియలు కోరుకోవడం లేదు.
తెలంగాణ ఉద్యమ ముఖ్య అంశం – నియామకాలు. కనీసం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను ఐదు సంవత్సరాల్లో కల్పిస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలంగాణ నిరుద్యోగులు, విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగాలను కోరుతున్నారు-నిరుద్యోగ భృతిని కాదు. ఉద్యోగాలు ఉత్పాదక శక్తిని పెంచుతాయి. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి ఒకవైపు పెరుగుతూ, మరోవైపు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి వేగాన్ని కొత్త పుంతలు తొక్కి స్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశను చాలించు కోవాలని, ప్రైవేటు రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవాలని ఉద్యోగ సంఘాల మాజీ కార్యకర్త, ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించడం గర్హనీయం. తెలంగాణ ఉద్యమ పోరాటమంతా నీళ్ళు,నిధులు,నియామకాల కోసమే కదా! తెలంగాణ ఉద్యమానికి నీళ్లు,నిధులు చక్రాలు అయితే నియామకాలు “ఇరుసు” తో పోల్చవచ్చు. కానీ కనీసం ఒక్క డిఎస్సి ని కూడా ప్రభుత్వం వెయ్య లేదంటే ఏ రకంగా ప్రాధాన్యత క్రమాలను మర్చిపోయా రో తెలుసుకోవచ్చు.
ఇప్పుడేం చేయాలి?
“చేతులు కాలాకనైనా ఆకులు పట్టుకోవడం విజ్ఞత” అనిపించుకుంటుంది. యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడ్డది. అది ముందుగా రాష్ట్రంలో అత్యున్నత ప్రజాప్రతినిధులుగా ఉన్న వారితోనే మొదలు కావాలి. ఎమ్మెల్యేల, మంత్రుల జీతభత్యాలు హేతుబద్దీకరించాలి. కాంట్రాక్టు లలో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతిని అరికట్టే శాశ్వత ఏర్పాట్లు చేయాలి.సంక్షేమ పథకాల పేరిట జరుగుతున్న ఖర్చులను, ఎన్నికల గెలుపు కోసమే ప్రవేశపెట్టిన పథకాలను వీలైనంత తొందరగా నిర్మొహమాటంగా వెనక్కు తీసుకోవాలి, వీలుకాని పక్షంలో కచ్చితంగా హేతుబద్ధీకరణ చేయాలి. ప్రజలు తమ స్వంత కాళ్ల మీద తాము నిలబడే అవకాశాలను కల్పించాలి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం లో జరుగుతున్న విపరీతమైన ఖర్చు స్థానంలో “దక్షిణ కొరియా మార్గం” లో వివిధ రకాలుగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. రాష్ట్రంలో “ఆర్థిక అత్యయిక పరిస్థితి రాకముందే ఈ చర్యలు చేపట్టడం అనివార్యం”. పొరపాట్లు చేయడం కంటే వాటిని దిద్దుకునే ధైర్యం,నిజాయితీ గొప్పవి.మరి ఆ సత్తా మన ప్రభుత్వానికి ఉందా? అనేది అంతిమమైన ప్రశ్న.
– ఆరేపల్లి వినోద్
బీఎస్పీ