Suryaa.co.in

Andhra Pradesh

రైతు ఖాతాల్లోకి రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు జమ

– కూటమి పాలనలో అన్నదాత ఇంట ఆనందం
– వైసీపీ హయాంలో పాతాళంలోకి వ్యవ’సాయం’
– విలేఖర్ల సమావేశంలో మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి

మంగళగిరి: గత ఐదేళ్ల పాలనలో వ్యవసాయరంగాన్ని జగన్ రెడ్డి నట్టేట ముంచితే… ఏడాదిపాలనలోనే వ్యవసాయంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి, కూటమి ప్రభుత్వం విజయాలను సాధించిందని పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జూలై 2 నుంచి బూత్, డివిజన్, క్లస్టర్ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఈ విజయాలను వివరించాలని కూటమి నాయకులు సంకల్పించారని తెలిపారు.

వైసీపీ పాలనలో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఖరీఫ్, రబీ సీజన్లలో కేవలం 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి, రైతులకు మూడు నెలల వరకు చెల్లింపులు ఆలస్యం చేశారు. రూ.1,674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకుండా రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే.. ఖరీఫ్, రబీ సీజన్ లో కలిపి 68 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి, 24 గంటల్లోనే డబ్బులను ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటివరకు రూ.18,000 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి వెళ్లాయి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ధాన్యం బకాయిలను రూ.1674 కోట్లను రైతు ఖాతాల్లో జమచేసి, రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది. అలాగే మిరప రైతులు సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం ఎదుర్కొన్నప్పటికీ, జగన్ రెడ్డి ప్రభుత్వం పరిహారం అందించడంలో విఫలమై, రైతుల ఆత్మహత్యలకు కారణమైందని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని వైసీపీ పూర్తిగా నిలిపివేసింది, దీనివల్ల 2018-19లో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2019-20 నాటికి నాలుగో స్థానానికి పడిపోయింది. రాయలసీమలోని నీటి ప్రాజెక్టులను విస్మరించి, ఉద్యాన రంగ వృద్ధిని సింగిల్ డిజిట్‌కు పరిమితం చేశారు. డ్రిప్ ఇరిగేషన్‌ను పునరుద్ధరించి, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, ఇతర రైతులకు 50-90% రాయితీతో సూక్ష్మ సేద్య పరికరాలను అందిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో మొదటి స్థానంలో నిలిపింది. హంద్రీ-నీవా ప్రాజెక్టును రూ.3,850 కోట్లతో పూర్తి చేసి, ఈ సంవత్సరంలోనే చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని సంకల్పించింది.

వ్యవసాయ రంగంతో పాటు, కూటమి ప్రభుత్వం సంక్షేమంలో కూడా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్‌ను రూ.4,000కు పెంచింది. “తల్లికి వందనం” పథకం కింద 65 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000 అందించి, రూ.9,000 కోట్లు ఖర్చు చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తోంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ పాలనలో శాంతి భద్రతల సమస్యలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారని, కానీ కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా, సురక్షితంగా ఉన్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో విజయం, సంపద సృష్టి, ఉద్యోగ కల్పనలో ప్రగతి సాధించడమే లక్ష్యమని సీఎం సూచించినట్టు ఆయన తెలిపారు.

 

LEAVE A RESPONSE