Suryaa.co.in

Andhra Pradesh

సజ్జలని సలహాదారు పదవి నుంచి వెంటనే తొలగించాలి

– ప్రజాసొమ్మును జీతంగా తీసుకుంటూ సజ్జల వైకాపా కార్యకర్తలా మాట్లాడుతున్నారు
– రాష్ట్ర సంచిత నిధి నుంచి జీతాలు తీసుకుంటూ జగన్ తాబేదారుల్లా వ్యవహరిస్తున్న ప్రతీ ఒక్కరిపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలి
– ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్

రాష్ట్ర సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి జీతాలు తీసుకుంటూ.. ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న ఎవరికైనా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ తెలిపారు. సలహాదారు వేషంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర సంచిత నిధి నుంచి జీతం తీసుకుంటూ సిగ్గు, యగ్గూ లేకుండా వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

సజ్జల ప్రతిపక్షనేతలపై రాజకీయ విమర్శలు చేస్తూ ఎన్నికల నియమావళిని యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ప్రతీ ఒక్కరిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘తాడేపల్లిలో గురువారం నాడు అధికార భాషా కమీషన్ చైర్మన్ విజయ్ బాబు రాసిన ‘మహాదోపిడీ’ పుస్తకం ఆవిష్కరణ సభలో సజ్జల పాల్గొని.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అభ్యంతకర పదజాలంతో, ఆధార రహిత అసత్య ఆరోపణల చేశారు.

సజ్జల ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ విమర్శలు చేయడం ఎంత వరకు సబబని మండిపడ్డారు. సజ్జల వ్యాఖ్యలు రాష్ట్రంలో రెండు రాజకీయ వర్గాల మధ్య ఉద్రేకతలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతంగా కలిగించేలా ఉన్నాయన్నారు. తన తండ్రి అధికారాన్ని, ఐదేళ్ల సీఎం పదవిని అడ్డుపెట్టుకుని రూ.8 లక్షల కోట్ల మహాదోపిడీకి పాల్పడిన జగన్ రెడ్డి పేరును పుస్తకంలో ప్రచురించడం విజయ్ బాబు మర్చిపోయారేమోనని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీలు ప్రతిపక్ష నాయకులపై బూతులు తిట్టలేరనే జగన్ రెడ్డి ఆ వర్గాలకు సలహాదారుల పదవులు ఇవ్వలేదన్నారు.

పుస్తక రచయిత విజయ్ బాబు సైతం ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రతిపక్షాలపై వ్యతిరేకంగా అవినీతి ఛానెల్ సాక్షిలో డిబేట్లు చేయడం, ప్రతిపక్ష నాయకులే టార్గెట్‌గా పుస్తకాలు రాయడం పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వ సొమ్మును వేతనంగా తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, విజయ్ బాబులపై క్రిమినల్ కేసు నమోదు చేయించి తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనవి చేశారు. రాష్ట్ర సంచిత నిధి నుంచి ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ప్రతీ ఒక్కరిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.

LEAVE A RESPONSE