Suryaa.co.in

Telangana

శాం పిట్రోడా నాకు రోల్ మోడల్

– శాం పిట్రోడా రాసిన రీడిజైన్ ద వరల్డ్ పుస్తకాన్ని తెలుగులో ఆవిష్కరించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా తనకు రోల్ మోడల్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హోటల్ తాజ్ కృష్ణలో ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచన చేసిన రీ డిజైన్ ద వరల్డ్ తెలుగులో అనువాదం చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎం.ఎం పల్లంరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తో కలిసి భట్టి ఆవిష్కరించారు.

అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచన చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే పుస్తకం దేశంతో పాటు సమాజాన్ని మార్చి వేస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని తెలిపారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని అన్నారు. అసమానతలు పెరగడం సమాజానికి హానికరమని రచయిత ఈ పుస్తకంలో చాలా విశ్లేషణాత్మకంగా పొందుపరిచారని వివరించారు. సమాజ హితం కోసం వారు చేస్తున్న రచనలు చాలా స్ఫూర్తిదాయకం చైతన్యవంత మైనవన్నారు.

కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రజల ఆశలు ఆకాంక్షలు కలలు నెరవేరలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలు ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల కలలు ఆశలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి సాంకేతికంగా, మేధో పరంగా మద్దతు సహకారం అందించడానికి తెలంగాణకు రావలసిందిగా శామ్ పిట్రోడాకు విజ్ఞప్తి చేశారు.

మనందరి ప్రియతమ నాయకులు దివంగత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో టెలి కమ్యూనికేషన్ రంగాన్ని తీసుకువచ్చేందుకు అమెరికాలో ఉన్న శ్యామ్ పిట్రోడా గారి మేధస్సును గుర్తించి అడ్వైజర్ గా సేవలు తీసుకున్నారని అన్నారు. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని చాలా దగ్గరగా తీసుకురావడానికి టెలి కమ్యూనికేషన్ ద్వారా భారీ విప్లవాన్ని శ్యామ్ పిట్రోడా తీసుకొచ్చారని తెలిపారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిగా చదువుతున్న సమయంలో తన ఇంటికి ఫోన్ చేయడానికి జనరల్ పోస్ట్ ఆఫీస్ లో ట్రంక్ కాల్ బుక్ చేసి గంటల తరబడి నిరీక్షించి ఫోన్ చేసి మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. ఫోన్ చేయడానికి గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి నుంచి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎవరితోనైనా క్షణాల్లో ఫోన్ చేసుకుని మాట్లాడే సౌకర్యం ఇప్పుడు వచ్చిందంటే శామ్ పిట్రోడా చేసిన కృషి అని చెప్పక తప్పదన్నారు

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల కమిటీలకు ఇన్చార్జిగా కొనసాగిన క్రమంలో అమెరికాలోని 20 నగరాల్లో ఎన్ఆర్ఐ సెల్ కమిటీలు వేశానని చెప్పారు. ఈ క్రమంలో చికాగో నగరంలో కూడా ఎన్నారై సెల్ కమిటీ వేయడానికి వెళ్ళిన కార్యక్రమానికి శ్యామ్ పిట్రోడా హాజరు అయ్యారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

పుస్తకావిష్కరణ సందర్భంగా క్వాడ్ జెన్ వైర్ లెస్ సొల్యుషన్స్ చైర్మన్ సీఎస్ రావు మాట్లాడుతూ, ‘రీడిజైన్ ది వరల్డ్’ పుస్తకం ప్రపంచ క్రమం ఎలా, ఎందుకు మారాలి, హైపర్ కనెక్టివిటీ ప్రపంచాన్ని ఎలా మార్చగలదో సూచిస్తుంది. ఈ తెలుగు అనువాదాన్ని శ్రీ పి.ఎన్.రావు తన అద్భుతమైన కృషితో, హైదరాబాదుకు చెందిన ఎమెస్కో ప్రచురణ సంస్థ సహకారంతో చేశారు. ఇది ప్రజాదరణ పొందిన పుస్తకంగా మారుతుందని ఆశిస్తున్నాను.

ప్రపంచ నిర్మాణం గురించి, భారతదేశ ఎదుగు దలపై దాని ప్రభావం గురించి రాసిన ఈ తెలుగు అనువాదాన్ని నిజమైన ఆందోళనలను చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలు మనమంతా చదవడానికి అర్హమైనది” అన్నారు.

తనకు తెలుగు అనువాద హక్కులు ఇచ్చినందుకు శామ్ పిట్రోడాకు సి.ఎస్.రావు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ విజయ్ కుమార్ నేతృత్వంలోని ఎమెస్కో అనే అత్యంత ప్రజాదరణ పొందిన, చరిత్రాత్మకంగా స్థాపించిన తెలుగు ప్రచురణ సంస్థకు కూడా తన కృతజ్ఞతలు తెలియజేశారు.

“రీడిజైన్ ది వరల్డ్” పుస్తకంపై శాం పిట్రోడా ఓవర్ వ్యూ
“రీడిజైన్ ది వరల్డ్” మరియు “ప్రపంచానికి కొత్తరూపం ఇద్దాం. కదలిరండి” అనే ఈ పుస్తకం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మూల కారణాలను పూర్తిగా స్పష్టంగా గుర్తించడం ద్వారా ప్రపంచ సమస్యల గురించి చాలా తెలివైన వివరణ. బాగా గుర్తించిన ప్రపంచ సమస్యలకు ఆచరణాత్మకమైన, ఆచరణీయమైన పరిష్కారంగా స్పష్టమైన మేనిఫెస్టోను శాం ఈ పుస్తకం ద్వారా సూచించారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డెమోక్రటైజేషన్, వికేంద్రీకరణ, డీమానిటైజేషన్ అనే మూడు ప్రత్యేక కోణాలు ప్రపంచ వ్యవస్థను మార్చేందుకు దోహదపడ్డాయని శామ్ పిట్రోడా పేర్కొన్నారు. ఇంటర్నెట్ ద్వారా ప్రజాస్వామ్యీకరణ అందరికీ జ్ఞానం, విద్య, వినోదం, షాపింగ్, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, రవాణాకు వికేంద్రీకృత అందుబాటును ఈ కొత్త ప్రపంచంలో హైపర్ కనెక్టివిటీ ద్వారా అనుమతిస్తుంది. మొబైల్ వాలెట్లు, పేమెంట్స్, బ్యాంకింగ్ ఆఫర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లు మన సమాజం, నాగరికతల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి ప్రపంచ శక్తుల ప్రభావం, ఔచిత్యం ఇప్పుడు ఎలా ఉంటాయని, అమెరికా, రష్యా, యుకె, నాటో, చైనా తదితర సూపర్ పవర్స్ ఇంకా ఎందుకని శాం పిట్రోడా ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి నిర్మాణాత్మక మార్పు, జనాభా, డిజిటల్ డివిడెండ్ సామర్ధ్యంతో ప్రపంచ క్రమంలో భారతదేశం ప్రాముఖ్యత ప్రపంచ పునర్నిర్మాణ ఆవశ్యకత భావనగా హైలైట్ అవుతోంది. సరికొత్త, అత్యంత క్రియాశీల యువ భారతదేశంలో డిజిటల్ నైపుణ్యాల ద్వారా డిజిటల్ అక్షరాస్యతను వేగంగా స్వీకరించడం ద్వారా భారతదేశం నిజమైన డిజిటల్ ప్రజాస్వామ్యానికి సిద్ధంగా ఉంది. అందువల్ల ప్రపంచ వ్యవస్థలో మార్పును ప్రభావితం చేసే శక్తి భారతదేశానికి ఉంది అని శామ్ పిట్రోడా ఈ పుస్తకం ద్వారా వ్యక్తపరుస్తున్నారు.

శాం పిట్రోడా రాసిన ఈ పుస్తకాన్ని పోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా, డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి సంపాదకుడిగా వ్యవహరించారు.శాం పిట్రోడా ఈ కార్యక్రమంలో జూం కాల్ ద్వారా పాల్గొన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పరకాల ప్రభాకర్, మాజీ ఎం.పి. వుండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు, ఐపీఎస్ వి.వి. లక్ష్మీనారాయణ, ఐపీఎస్ ఎన్. సాంబశివ రావు, ఐఏఎస్ కె.ఎన్.కుమార్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE