Suryaa.co.in

Features

సనాతన ధర్మం- దేవదాసి వ్యవస్థ

తప్పుఒప్పుల గురించి నేను ప్రస్తావించడం లేదు. గతాన్ని గురించి తెలుసుకొని తప్పులుంటే సరిదిద్దుకొవడం సంస్కారం. మధ్యలో వచ్చిన ఆచారాలలోని కొన్ని పొరపాట్లు గ్రహించాలి. అలాంటిదానికి సంబంధించినదే ఈ చారిత్రాత్మక సంఘటన. ఇక చదవండి…

1947 అక్టోబర్ 8 మద్రాస్ అసెంబ్లీలో సభ్యులు ఒ.పి. రామస్వామిరెడ్డియార్, ముత్తులక్ష్మిరెడ్డి దేవదాసీ నిర్మూలన చట్టం కోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో గందరగోళం ప్రారంభం అయ్యింది. సత్యమూర్తి అయ్యర్, శ్రీనివాస్ అయ్యర్, గోవిందరాఘవ అయ్యర్, శేషగిరి అయ్యర్ ల టీం ఇది సనాతన ధర్మానికి విరుద్ధం, మత శాస్త్రాలకు వ్యతిరేకం, మేము జైలుకైనా పోతాము కానీ దీన్ని చట్టం కానివ్వం అంటూ ఆందోళన చేశారు. రెండుపక్షాల ఆందోళనలో రాజాజీ మౌనం వహించారు.
సాయంత్రం ముత్తులక్ష్మి పెరియార్ ని సలహాకోసం కలిసింది. పెరియార్ సలహా ఇచ్చాడు.

అక్టోబర్ 9 మరుసటి రోజు సభ ప్రారంభం కాగానే సత్యమూర్తి అయ్యర్ చర్చ ప్రారంభించారు. “దేవదాసిలు సనాతన ధర్మం, శాస్త్రాలతో దేవాలయంలో ఏర్పాటు చేయబడ్డ పరిచారికలు. దేవదాసిలు నేరుగా దైవ సేవకులు. వారు చేసే అన్నీ పవిత్రకార్యాలను బట్టి వారికి భగవంతుని సర్వఆశీస్సులు, సుఖభోగాలు లభిస్తాయి.”
అనేక శాస్త్ర నియమాలతో సుదీర్ఘంగా సాగిన సత్యమూర్తి అయ్యర్ ప్రసంగం అనంతరం లేచిన ముత్తులక్ష్మి అమ్మ లేచి ఇలా అంది…….

“అయ్యర్ గారు చెప్పిన శాస్త్ర విషయాలతో ఏకీభవిస్తున్నాను. కానీ ఇన్ని వందల సంవత్సరాల నుండి మేము చేసిన సేవలకు మాకు దక్కిన శుభాశీస్సులు మాకు ఇక చాలు. ఇకపై ఇటువంటి పనులు చేయటం ద్వారా దైవాశీస్సులు లభిస్తాయి, ఇది సనాతన ధర్మం అని నమ్మే వారు మీ ఇంటి ఆడవాళ్ళని స్వచ్చందంగా దేవదాసీలుగా పంపవచ్చు”

అంటూ ముగించాక మద్రాస్ అసెంబ్లీ దేవదాసినిర్మూలనచట్టాన్ని ఆమోదించింది.
అప్పటికి మద్రాస్ స్టేట్ లో వున్న రాయలసీమ, కోస్తా ఆంధ్ర ల్లోని మాతమ్మ, జోగిని వ్యవస్థ, మలబార్ ప్రాంతంలోని నంగా వ్యవస్థ, కన్నడ ప్రాంతంలోని బసివి రద్దు చేయబడ్డాయి.

శాస్త్రాలు చెప్పాయని దేవుడితో కళ్యాణం జరిపించి వాళ్ళని వేశ్యలు మార్చి వాడుకుని, 40 ఏళ్ల తర్వాత వేలం వేసే నీచ నికృష్ట ఆచారం. వందలసంవత్సరాల నుండి సనాతనధర్మం పేరుతో ఆచరించేవారు. ఒక్క తంజావూరు టెంపుల్ లోనే రాజరాజాచోళుని కాలంలో 400 మంది పైగా దేవదాసిలు ఉండేవారు అని చరిత్ర.
దేవదాసి తల్లికి జన్మించిన డాక్టర్ము త్తులక్ష్మిరెడ్డి (w/o డాక్టర్ సుందరరామిరెడ్డి ) పెరియార్ ఉద్యమఫలితంగా అనేక ప్రతికూల పరిస్థితులను ఎదిరించి చదువుకుని డాక్టర్ అయ్యింది. ప్రపంచ ప్రఖ్యాత అడయారుకేన్సర్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ కూడా డాక్టర్ ముత్తులక్ష్మి గారే.

– దామోదర ప్రసాద్

LEAVE A RESPONSE