– నాడు టీడీపీ దానిని వ్యతిరేకించింది
– ఒప్పందాలపై టీడీపీ-వైసీపీల దారి ఒక్కటే
– ఒప్పందాలు అమలు జరిగితే ప్రజలపై లక్ష కోట్ల రూపాయలకు పైగా భారం
– ఏక్సిస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో 25 ఏళ్ళ దీర్ఘకాలపు ఒప్పందాల కుదుర్చుకుంటున్నారు
విజయవాడ: రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ నుండి 7000 మెగా వాట్ల విద్యుత్ కొనుగోళ్ళ నిమిత్తం సెకీతో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను బహిర్గతం చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక డిమాండు చేసింది.
ఈ ఒప్పందాలు అవినీతితో కూడినవని, ప్రజలపై భారాలు మోపేవిగా ఉన్నాయని అందువలన ఈ ఒప్పందాలను రద్దు చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదికతో సహా అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒప్పందాలను రద్దు చేసుకుంటే రు.2900 కోట్లు పెనాలిటీ చెల్లించాల్సివస్తుందని ప్రచారం జరుగుతున్నది. అదానీ కోసం ఈ ఒప్పందాలను రద్దు చేయకుండా, అమలు చేయటం కోసమే ఈ ప్రచారం చేస్తున్నారని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక భావిస్తున్నది.
ఈ ఒప్పందాలు అమలు జరిగితే ప్రజలపై లక్ష కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని కూడా ప్రచారం జరుగుతున్నది. ఈ రెండు ప్రచారాల ప్రకారం ఒప్పందాలు రద్దు చేసుకున్నా, రద్దు చేసుకోకపోయినా సష్టపోయేది వినియోగదారులే. అందువలన ఈ ఒప్పందాలలోని అంశాలు వినియోగదారులు తప్పని సరిగా తెలుసుకోవాలి. అందుకోసం ఈ ఒప్పందాలను ఆన్ లైన్లో ఉంచటం ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక డిమాండు చేస్తున్నది.
టెక్నికల్ అభివృద్ధి వలస సోలార్ మరియు విండ్ పవర్ ధరలు నానాటికి పడిపోతున్న నేపధ్యంలో విద్యుత్ ఒప్పందాలను 25 ఏళ్ళ దీర్ఘ కాలానికి కుదుర్చుకోవటం ద్వారా ఒకేధరను 25 ఏళ్ళ పాటు వినియోగదారులపై రుద్దుతున్నారు. గతంలో తెలుగు దేశం ప్రభుత్వ కాలంలో 5.12.2014న ఆరోహి సోలార్ పవర్ కంపెనీతో యూనిట్ రు.5.63లకు 25 ఏళ్ళకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేరోజున ఎసిఎంఇ జైసల్మేర్ సోలార్ పవర్ కంపెనీతో కూడా యూనిట్ రు 5.63 లకు 25 ఏళ్ళకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
27.10.2016 న యూనిట్ రు.4.50లకు సెకీతో 25 ఏళ్ళకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవన్నీ తెలుగు దేశం హయాంలో కుదుర్చుకున్నవే. తర్వాత వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా ఇదే వరవడిని కొనసాగించింది. వైఎస్ఆర్సిపి కాలంలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ సరఫరా చేసే విద్యుత్ను యూనిట్ రు.2.49లకు కొనటానికి సెకీతో 25 ఏళ్ళకు ఒప్పందం కుదుర్చుకున్నారు. టెక్నికల్ అభివృద్ధి వలన సోలార్ మరియు విండ్ పవర్ ధరలు నానాటికీ పడిపోతున్నాయనటానికి ఈ ఒప్పందాలే నిదర్శనం.
ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరల ఏక్సిస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో యూనిట్ సుమారుగా రు.4.89లకు కొనటానికి ఒప్పందం కుదుర్చుకొని, దాని ఆమోదం కోసం విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ ముందుంచారు. తెలుగుదేశం హయాంలో దీర్ఘకాలపు ఒప్పందాలు కుదుర్చుకోవటం నష్టం అని వైఎస్ఆర్సిపి విమర్శించింది. వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే, మరల 25 ఏళ్ళ దీర్ఘకాలపు ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
వైఎస్ఆర్సిపి హయాంలో దీర్ఘకాలపు ఒప్పందాలు కుదుర్చుకోవటం నష్టం అని తెలుగుదేశం విమర్శించింది. మరల తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఏక్సిస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో 25 ఏళ్ళ దీర్ఘకాలపు ఒప్పందాల కుదుర్చుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ మరల అదే పని చేస్తున్నారు. అసలు ఈ 25 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందాలకు నిబంధనలు చేసింది కేంద్ర ప్రభుత్వం అన్న విషయాన్ని మరుగున పరుస్తున్నారు.
25 ఏళ్ళ దీర్ఘకాలపు ఒప్పందాల ద్వారా టెక్నికల్ అభివృద్ధి ఫలితాలను వినియోగదారులకు అందకుండా చేస్తున్నారు. ఒకవైపు విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గినా, 25 ఏళ్ళ పాటు వినియోగదారులు ఒప్పందంలో ఉన్న ధరలను చెల్లించాల్సిందే. అందువలన ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు వినియోగదారులకు నష్టదాయకం. కావున టెక్నికల్ అభివృద్ధి ఫలితాలు వినియోగదారులకు అందటం కోసం దీర్ఘకాలిక ఒప్పందాలను రద్దు చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక డిమాండు చేస్తున్నది.