Suryaa.co.in

Andhra Pradesh

సజ్జలకు సుప్రీంలో చుక్కెదురు

– తనపై ఇక కేసులు నమోదుచేయకుండా ఆదేశాలివ్వాలని సుప్రీంలో సజ్జల భార్గవరెడ్డి పిటిషన్
– కుదరదన్న సుప్రీంకోర్టు
– హైకోర్టులోనే వాదనలు వినిపించుకోవాలని ఆదేశం
– భార్గవ్ రెడ్డి పోస్టులు బ్యాడ్ టేస్ట్
– రెండువారాలపాటు సజ్జలను అరెస్టు చేయవద్దన్న ఊరట

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇంఛార్జి, సజ్జల భార్గవరెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం తనపై దాఖలు చేసిన కేసులను కొట్టివేయాలని సుప్రీంను సజ్జల ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంలో విచారణకు వచ్చింది.

ఇకతనపై కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను, సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. సజ్జల వాదనలను ఏపీ హైకోర్టులో వినిపించాలని అక్కడే పిటీషన్‌లు దాఖలు చేయాలని సూచించింది.

ఏపీ హైకోర్టును ఆశ్రయించేంత వరకూ రెండు వారాల పాటు సజ్జలను అరెస్ట్ చేయకూడదని సుప్రీం మధ్యంతర రక్షణ కల్పించింది. రెండు వారాల తరువాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? లేదా? అన్నది హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.

టీడీపీ నేతలపై సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, ధర్మాసనం దృష్టిని తీసుకొచ్చారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా పోస్టులన్నీ ఆమోదయోగంగా లేవు. సీరియస్‌గా ఉన్నాయి. బ్యాడ్ టేస్ట్ అని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం సజ్జల భార్గవరెడ్డి పిటీషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణను ముగించింది.

తనపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లు కొట్టి వేయాలని సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణకు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. గతంలో జరిగిన వ్యవహారాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారని సజ్జల తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.

చట్టాలు ఎప్పటివి అన్నది ముఖ్యం కాదని, మహిళలు, ప్రజా ప్రతినిధులు అని కూడా చూడకుండా చేసిన అసభ్య వ్యాఖ్యలు చూడాలని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్దార్థ లూత్రా కోరారు. సామాజిక మాధ్యమాల్లో ఇతరులపై దుమ్మెత్తి పోస్తూ, అసభ్య పదజాలం ఉపయోగించే వ్యవహారంలో కీలక సూత్రధారి భార్గవ రెడ్డి అని సుప్రీంకు ప్రభుత్వం తెలిపింది.

టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను సిద్ధార్ధ లూత్రా.. ధర్మాసనం దృష్టిని తీసుకొచ్చారు. ప్రస్తుత దర్యాప్తునకు కూడా సహకరించడం లేదని వెల్లడించారు. చాలా విషయాలు సుప్రీంకోర్టు ముందు కూడా గోప్యంగా ఉంచారని లూత్రా తెలిపారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల వివరాలను కోర్టుకు ప్రభుత్వం అందించింది.

వాటిని పరిశీలించి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా పోస్టులన్నీ ఆమోదయోగ్యంగా లేవని, చాలా తీవ్రంగా ఉన్నాయని, బ్యాడ్ టేస్ట్ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యలు చేశారు. దుర్భాషలు, అభ్యంతరకరమైన భాష ఉపయోగించే ఎవరైనా చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తాము ఇప్పుడు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని, ఏ విషయాలు అయినా, హైకోర్టులోనే చెప్పుకోవాలని తెలిపింది. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించేందుకు ధర్మాసనం రెండు వారాల సమయం ఇచ్చింది. ఇరు పక్షాల వాదనలు విని తగిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హైకోర్టుకు ఉందని ధర్మాసనం పేర్కొంది.

LEAVE A RESPONSE