Suryaa.co.in

Features

తులసీదళం ప్రాముఖ్యత

పవిత్రతకు చిహ్నంగా చెప్పుకునే ‘తులసి’ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి అలంకరణలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంది.స్వామివారికి కూడా తులసి అంటే చాలా అభిమానం.భక్తి నిదర్శనంగా నిలచిన తులసి కథను తెలుసుకుందాం.

తులసి చిన్నప్పటి నుంచి పెరుమాళ్ళు కు మహాభక్తురాలు.
స్వామిపై ఈమెకున్న భక్తి అపారమైనది. ఆ భక్తి ప్రపత్తుల చేతనే భగవంతుని గురించి తపస్సు చేసి సర్వేశ్వరుని సాక్షాత్కారం పొందింది.

స్వామి ప్రత్యక్షమై “నీకేమి కావాలో కోరుకొమ్మని” అడుగగా “ఎల్లప్పుడూ నీ సేవ చేసుకుంటూ ఉండాలన్నదే నా కోరిక” అని కోరింది. అంతట పెరుమాళ్ళు “నిన్ను భూలోకంలో మొక్కగ అవతరింపజేసి నిన్ను తరింపజేస్తాను” అని అన్నారు.

తులసి భగవత్కటాక్షము చేత శ్రీవిల్లిపుత్తూర్ అనే దివ్య ప్రాంత్రంలో భాగవతోత్తముల ఇండ్ల ‘తులసిమొక్కగా’ అవతరించింది. అప్పుడు పెరుమాళ్ళు భాగవతోత్తములందరికి స్వప్నంలో సాక్షాత్కరించి. “మీ పెరటిలో తులసి మొక్క ఉన్నది. అది “చల్లదనం”, “మార్థవం”, “పరిమళం” అనే గుణాలతో నిండి ఉంటుంది. మీరందరూ ప్రతిరోజూ వాటి దళాలతో నాకు పాదపూజ చేయండని” ఆజ్ఞ ఇచ్చారు.

అప్పుడు భాగవతోత్తములందరు శ్రీవిల్లిపుత్తూరు నందు కలసి అందరికి ఒకే మాదిరిగా కలిగిన స్వప్న వృత్తాంతాన్ని చెప్పుకుంటూ. భాగవతోత్తముల పెరటిలో చూడగా పెరుమాళ్ళు ఆజ్ఞ ఇచ్చిన విధంగా చల్లదనం, మార్థవం, పరిమళం అనే మూడు గుణాలతో ప్రకాశిస్తున్న తులసిని చూచి భగవంతుడు ఆజ్ఞ ప్రకారం రోజూ తులసీ దళాలతో పూజించసాగారు.భక్తురాలైన తులసి తన కోరిక నెరవేరినందుకు చాల ఆనందంతో, నిత్యయవ్వనంతో పెరుమాళ్ళు పాదాలను ఆశ్రయించింది.

ఇలా కొంతకాలం గడిచిన తర్వాత సర్వేశ్వరుని వక్ష: స్థలమునందున్న లక్ష్మీదేవి తనకంటె దిగువనున్న తులసిని పరిహసించింది. ఆ అవమానభారంతో తులసి వాడిపోయి, నిత్య యవ్వనం పోయి ఎండిపోయినట్లు తయారైంది.

పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు తులసి పరిస్థితికి కారణమేమిటని విచారించి, లక్ష్మీదేవి వలన తులసికి జరిగిన పరాభవాన్ని గ్రహించారు.స్వామివారికి భక్తురాలియందు గల వాత్సల్యం చేత మరలా తమ ప్రియభక్తులైన భాగవతోత్తము లందరికి స్వామికి పాదాలయందు దళాలను సమర్పించ వలదని, తులసిని మాలలుగా కట్టి తమ కిరిటమందు అలంకరించమని ఆజ్ఞ ఇచ్చారు.స్వామివారి అజ్ఞానుసారం భాగవతోత్తములందరు తులసి దళాలను మాలలుగా కట్టి, కిరీట మందు అలంకరించారు.

దీని వల్ల పెరుమాళ్ళుకు భక్తులపై గల అభిమానాన్ని మనం తెలుసుకోవచ్చు. అందువల్లే తన భక్తురాలైన తులసిని కటాక్షించి శిరసుపై ధరించాడు. అంతే కాక సత్యభామా గర్వభంగం కూడా ఈ తులసీదళం వల్లే అయింది. కాబట్టి ఈ తులసీదళ మహిమ అద్భుతమైనది, పరమపవిత్రమైనది.

– ఆమంచి రాఘవ శాస్త్రి

LEAVE A RESPONSE