Suryaa.co.in

Telangana

2014 నుంచే బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం

మోదీ, కేటీఆర్ మాటల పరమార్ధం ఇదే
సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్ మోదీని పొగిడారు
హంగ్ వస్తే టీఆర్ఎస్ కు మద్దతిస్తామని లక్ష్మణ్ 2018లో అన్నారు
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోదీ పర్యటనలు
ఎంఐఎం ఎటువైపో తేల్చుకోవాలి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణలో 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా ఇరు పార్టీలు ఒకరికి ఒకరు అంతర్గతంగా సహకరించుకుంటూ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. గత రెండు రోజుల నుంచి ప్రధాని మోదీ, మంత్రి కేటీఆర్ మాటలను నిశితంగా పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గురువారం అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ మంత్రినాయక్, ఉప్పునూతల జెప్పీటీసీ ప్రతాప్ రెడ్డి, ఉప్పునూతల ఎంపీపీ అరుణ నర్సింహా రెడ్డి, అచ్చంపేట వైస్ ఎంపీపీ అమరావతి సీఎం రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ బద్రీనాథ్ యాదవ్ తదితర నాయకులు గురువారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి రేవంత్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత వారినుద్దేశించి ప్రసంగించారు.

కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా మోదీని బీజేపీ సొంత ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా పొగిడారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గడిచిన 9 ఏళ్లలో మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కేసీఆర్ మద్దతు ఉన్నది అనే విషయం పార్లమెంటు రికార్డులను తిరగేస్తే అర్ధమవుతుందన్నారు. 2016లో మిషన్ భగీరథ ప్రారంభత్సోవంలో కేసీఆర్ మోదీని పొగడ్తలతో ముంచెత్తిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం అత్యంత ప్రగతిశీలమైనదని, రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటుందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారని చెప్పారు. దీన్ని బట్టి మోదీ కేసీఆర్ బంధం ఎంత బలమైందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు రేవంత్ రెడ్డి.

పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ కేసీఆర్ మోదీకి అండగా నిలిచారన్నారు. నోట్ల రద్దుపై దేశం అంతా గగ్గోలు పెడుతుంటే కేసీఆర్ మాత్రం పూర్తిగా మద్దతు ప్రకటించారు. 2018లో ఆగస్టులో రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు చేస్తారనే చర్చ జరుగుతున్న సమయంలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన కేసీఆర్ ఏ నాయకుడికి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా కేవలం బీజేపీ నేతలను మాత్రమే ప్రగతి భవన్ కు పిలుపుంచుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి స్మృతి వనం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేసేందురు కలిశామని బీజేపీ నేతలు ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ వాస్తవంగా వాజ్ పేయి స్మృతి వనం ఏర్పాటును అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్, బీజేపీ నేతలు ప్రగతి భవన్ వేదికగా కుట్ర పన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఐదేళ్లు గడుస్తున్నా వాజ్ పేయి స్మృతి వనం ఏర్పాటు గురించి ఇప్పటి వరకు ఒక్క మాట్లాడలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

2018 ఎన్నికలు ముగిసిన తర్వాత అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్..హంగ్ అసెంబ్లీ ఏర్పడితే టీఆర్ఎస్ మద్దతిస్తామని మీడియాతో వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అనుబంధానికి లక్ష్మణ్ అప్పుడు చేసిన వ్యాఖ్యలే నిదర్శమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునామీలో బీజేపీ, బీఆర్ఎస్ కొట్టుకపోవడం ఖాయమని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతీయడానికి బీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడిగా సహకరించుకునేందుకు సిద్ధమయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య పొత్తు కుదిరిందని సీట్ల సర్దుబాటు కూడా జరిగిందని వ్యాఖ్యానించారు. బీఆరెస్ 9 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో పోటీ చేసే వీలుగా సీట్ల పంపకం జరిగిందన్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బీఆర్ఎస్, బీజేపీ వ్యూహంలో భాగమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆరెస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ కు మద్దతుపై ఎంఐఎం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ, బీఆరెస్ లది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ…అని ఎద్దేవా చేశారు. అలాంటి వారికి అసద్ ఎలా మద్దతు ఇస్తారు అని ప్రశ్నించారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది.. బీజేపీతో దోస్తీ కడుతూ వారికి గెలుపు కోసం పని చేస్తున్న బీఆరెస్ వైపు నిలబడుతుందా? బీజేపీ, బీఆరెస్ ను ఓడించాలంటున్న కాంగ్రెస్ వైపు నిలబడుతుందో స్పష్టం చేయలన్నారు రేవంత్ రెడ్డి.

LEAVE A RESPONSE