– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సామాజిక-సంక్షేమ విప్లవం మొదలైంది. టీడీపీ ఆవిర్భవించి నేటికి 42 ఏళ్లు గడిచాయి. తెలుగుప్రజలకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగువారు ఎక్కడ ఉన్నా నెం.1గా ఉండాలనేది తెలుగుదేశం ఆశయం. తెలుగుజాతి ఆత్మగౌరవ, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. బడుగు, బలహీనవర్గాల వారికి రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది.
అణగారిన వర్గాల్లో చైతన్యం కల్పించి సంక్షేమ రాజ్యానికి అన్న ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ పోకడలపై తిరుగుబాటు చేసి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం బావుటా ఎగురవేశారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లని నినదించిన ఏకైక పార్టీ తెలుగుదేశం. కిలో రూ.2కే బియ్యం, మాండలిక వ్యవస్థ, మహిళలకు ఆస్తిలో సమానహక్కు, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించింది.
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబునాయుడు రాష్ట్రానికి దిశా, నిర్దేశం చేసి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. నేడు విధ్వంస పాలనలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపడం కోసం చంద్రబాబునాయుడును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.