Suryaa.co.in

Andhra Pradesh

శ్రీపాద శ్రీనివాస్ రచనా వ్యాసంగం కొనసాగించాలి

-ఆత్మీయ పూరిత వాతావరణంలో అంతరంగం సంకలనం ఆవిష్కరణ
-ఇప్పుడు చేసే రచనలు భవిష్యత్తులో చర్చకు వస్తాయి : ఉండవల్లి
-శ్రీపాద రచనలు ఆర్ద్రత గుర్తుచేస్థాయి : మంత్రి దుర్గేష్
-శ్రీపాద శ్రీనివాస్ ధర్మాత్ముడు లాంటివాడు : డొక్కా మాణిక్య వరప్రసాద్
-అసెంబీలో వేసిన ప్రశ్నలకు పుస్తక రూపం ఇచ్చి మళ్ళీ గుర్తింపు తెచ్చాడు :రౌతు
-అందరినీ చైతన్య పరిచే నిజాయితీ పరుడు శ్రీపాద శ్రీనివాస్ : డా వంశీకృష్ణ
-అమ్మ, గోదావరి, స్నేహబృందం, రాజకీయాలే కథావస్తువులని చింతపెంట ప్రభాకర్ విశ్లేషణ

రాజమహేంద్రవరం: అందరితో స్నేహతత్వం కొనసాగిస్తూ, సామాజిక స్పృహతో రచనలు చేస్తున్న శ్రీపాద శ్రీనివాస్ తన రచనా వ్యాసంగం కొనసాగించాలని పలువురు సూచించారు. ఆప్యాయత అనురాగాలు పంచుతూ అందరితో కలివిడిగా ఉండడం, అందరి శ్రేయస్సు, అభివృద్ధి కాంక్షించడం అభినందనీయమన్నారు. తాజాగా ‘విభిన్న అంశాల సమాహారంగా ‘అంతరంగం’ పుస్తకాన్ని నాల్గవ సంకలనంగా స్వీయ రచనలు, రేడియో కార్యక్రమాలు వాటిపై అభిప్రాయ మాలికలు మేళవించి రూపొందించారు. హరిచందన పబ్లికేషన్స్ పక్షాన గజరావు వెంకటేశ్వరరావు సారథ్యంలో ఈ పుస్తకం రూపొందింది.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలుపైన బుక్ బ్యాంకులో ఆత్మీయ పూరిత వాతావరణంలో నిర్వహించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఆవిష్కరించారు.

ఈసందర్బంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సాంస్కృతిక నగరం రాజమండ్రిలో శ్రీపాద పుస్తకావిష్కరణ ఇంతమంది ఆత్మీయుల నడుమ సాగడం ఆనందంగా ఉందన్నారు. రవిగాంచని చోట కవి గాంచుతాడు అన్న నానుడిని గుర్తుచేస్తూ, కవి పరిధి విస్తృతంగా ఉంటుందన్నారు.

తల్లి మరణంతో వచ్చిన ఆవేదన, ఆవేశం నేపథ్యంలో శ్రీపాద శ్రీనివాస్ రచనలకు శ్రీకారం చుట్టారని, అందుకే ఈయన రచనల్లో ఆర్ద్రత ఉంటుందని పేర్కొన్నారు. మూడు పుస్తకాలను తీసుకొచ్చి, ఇప్పుడు నాల్గవ పుస్తకం తీసుకురావడం అభినందనీయమని అన్నారు.రచనలు కొనసాగించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు కూడా అందుకోవాలని, ఇందుకు తనవంతు సహకారం అందించగలనని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

ఉండవల్లి మాట్లాడుతూ ఇంతమంది మిత్రులను సంపాదించుకోవడం మామూలు విషయం కాదని అన్నారు. మంచితనం కారణంగానే ఇంతమంది ఆదరణ పొందగలిగాడని ఆయన పేర్కొంటూ నిజంగా ధన్యత పొందాడని అన్నారు. ఇదే ఒరవడి కొనసాగిస్తూ, రచనలు సాగిస్తూ, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.

డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మాలాంటి ఎందరినో చైతన్య పరిచి, అవగాహన కల్పించిన శ్రీపాద శ్రీనివాస ధర్మాత్ముడని , మౌన ముని అని కొనియాడారు. ప్రస్తుత రాజకీయాలను ఆయన ప్రస్తావిస్తూ, బూతులు తిట్టేవాళ్ళకు, కొట్టేవాళ్లకు విలువ ఇచ్చే రోజులు నడుస్తున్నాయని, అందుకే వైసిపిలో ఇమడలేక పోయానని ప్రస్తావించారు. శ్రీపాద పుస్తకంలో రాజకీయాలకు సంబంధించిన కథ బాగుందని, మార్పు అనేది సాంస్కృతిక నగరమైన రాజమండ్రి నుచి ప్రారంభం కావాలని అన్నారు. దుర్మార్గ రాజకీయాలు పోవాలన్నారు. అందుకు శ్రీపాద శ్రీనివాస్ లాంటి వాళ్ళు చైతన్యవంతమైన రచనలు చేయాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ అసెంబ్లీలో తాను ప్రశ్నలు వేయడానికి సహకారం అందించడమే కాకుండా పదేళ్లు ఎమ్మెల్యేగా చేసి ఖాళీగా ఉన్న సమయంలో చట్టసభల్లో గోదావరి గళం పేరిట పుస్తకం తీసుకొచ్చి, మళ్ళీ తనకు గుర్తింపు ఇచ్చిన మంచి స్నేహితుడు శ్రీపాద శ్రీనివాస్ అని కొనియాడారు. శ్రీపాద శ్రీనివాస్ కి ఇంతమంది స్నేహితులు ఉండడమే నిజమైన సంపద అన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డా. సిహెచ్ వంశీ కృష్ణ మాట్లాడుతూ, అపారమైన జ్ఞానం కల్గిన శ్రీపాద శ్రీనివాస్ నిజాయితీ పరుడని కొనియాడారు. శ్రీపాద ఇంకా రచనలు చేయాలనీ, అవార్డులు, రివార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీపాద శ్రీనివాస్ తో స్నేహం మొదలైన తీరుని గుర్తుచేసుకున్నారు. నెగెటివ్ లో సైతం పాజిటివ్ గా మార్చుకోవడం శ్రీపాదాలోని గొప్పతనమన్నారు. మాటలు పోయి, మూటలకు విలువ ఇస్తున్న ఈ రోజుల్లో నోరు మంచిదైతే ఊరు మంచిదన్న రాణిస్తున్నాడని కొనియాడారు.

సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టికె విశ్వేశ్వర రెడ్డి, శ్రీపాద శ్రీనివాస్ మిత్రులు ఆర్యాపురం బ్యాంకు డైరెక్టరు బుడ్డిగ రవి కొండలరావు, వక్కలంక నాగేంద్ర, తదితరులు మాట్లాడుతూ.. శ్రీనివాస్ తో గల అనుబంధాన్ని వక్తలు ప్రస్తావించారు. అమ్మ, గోదావరి, స్నేహితులు, రాజకీయాలు కథా వస్తువులుగా ఎంచుకుని చేస్తున్న రచనల పరిధిని మరింత విస్తృతం చేస్తూ రచనలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

సీనియర్ పాత్రికేయులు వి ఎస్ ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు. ప్రముఖ న్యాయవాది చింతపెంట ప్రభాకర్, పుస్తక సమీక్షచేస్తూ, శ్రీపాద శ్రీనివాస్ రచనలలో గొప్పతనాన్ని వివరిస్తూ, అమ్మ, గోదావరి, స్నేహితులు, రాజకీయాలు కథావస్తువులుగా ఎంచుకుని రచనలు చేస్తున్నారని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలన్నారు. రామినీడి మురళీమోహన్ కూడా వేదికపై ఉన్నారు.

శ్రీపాద శ్రీనివాస్ ని మంత్రి దుర్గేష్, ఉండవల్లి దుశ్శాలువతో సత్కరించారు. ఉచిత రీతిన శ్రీపాద అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పలువురు పూలమాలలతో, దుశ్శాలువాలతో సత్కరించారు. షేక్ అసదుల్లా అహ్మద్, ప్రసాదుల హరినాధ్, క్రొవ్విడి సర్రాజు పసుపులేటి కృష్ణ, ఎల్ వెంకటేశ్వరరావు, నక్కా శ్రీనగేష్, ఇయ్యపు మాధవ, బెజవాడ రంగా, వాకచర్ల కృష్ణ, ముళ్ళా మాధవ, పలువురు ప్రముఖులు, శ్రీపాద శ్రీనివాస్ గురువులు, మిత్ర బృందం, తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణమాచార్యులు వందన సమర్పణ చేస్తూ, మంగళా శాసనాలు చేశారు.

LEAVE A RESPONSE