Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వమే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది

– ఎన్నికల హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైంది
– హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెడుతోంది
– ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్

రాజమండ్రి: గడిచిన తొమ్మది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఏదోరకంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు మీద అక్రమ కేసులు బనాయించడంతో పాటు అర్దరాత్రి పూట ఇళ్లకు వెళ్లి మహిళలను సైతం బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

ఆరోగ్యం బాగాలేదని చెప్పినా అవేవీ లెక్కచేయకుండా అధికారం ఉంది కదా ఏం చేసినా చెల్లుతుందన్న ధోరణిలో వైయస్సార్సీపీ తరపున గొంతు కలిపిన ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. గడిచిన నెల రోజుల్లో వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళీల అక్రమ అరెస్టుల ద్వారా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్న రాజా… తల్లికి వందనం గాలికి వదిలేసిందని, సూపర్ సిక్స్ ను పూర్తిగా అటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం తెరలేపిన ఈ కొత్త సంస్కృతి, సాంప్రదాయంతో…. రేపు మళ్లీ అదే బోనులో మీరు నిలబడాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం చేసే ప్రతి అరాచకాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్న ఆయన… ప్రభుత్వం మీద ప్రజల్లో ఇంత తీవ్రమైన స్ధాయిలో వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదన్నారు. గద్దెనెక్కించిన ప్రజలే ప్రభుత్వాన్ని గద్దె దించే కార్యక్రమం చేస్తారని.. ప్రజలు తిరుగుబాటుకి సిద్ధంగా ఉన్నారని రాజా స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE