Suryaa.co.in

Andhra Pradesh

తెనాలిలో పవన్‌ కళ్యాణ్‌ పై రాళ్ల దాడి

-దూరంగా పడటంతో తప్పిన ప్రమాదం
-పోలీసుల అదుపులో నిందితుడు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఒక దుండగుడు రాళ్ల దాడికి ప్రయత్నించిన ఘటన ఆదివారం హైటెన్షన్‌కు దారితీసింది. అయితే అగంతకుడు విసిరిన రాయి పవన్‌కు తగలకుండా కాస్త దూరంలో పడటంతో ప్రమాదం తప్పింది. వెంటనే జనసేన కార్యకర్తలు, సెక్యురిటీ సిబ్బంది పవన్‌కు రక్షణ వలయంగా ఏర్పడి తదుపరి దాడిని నివారించడంతో ముప్పు తప్పింది. వివరాల్లోకి వెళితే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి పర్యటనకు విచ్చేశారు. ఇక్కడ నుంచి జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

తెనాలిలో ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు పవన్‌ హెలికాప్టర్‌ దిగాక హెలీప్యాడ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. హెలీప్యాడ్‌ వద్ద ఉన్నట్టుండి ఒక గుర్తు తెలియని వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌పై రాయిని విసిరాడు. అయితే అది కాస్త గురితప్పి ఆయనకు దూరంగా పడిరది. వెంటనే జనసేన కార్యకర్తలు ఆ రాయి వచ్చిన దిశ నుంచి దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాడికి ప్రతిదాడి లాగా వైసీపీ మద్దతుదారులు ప్రోద్భలంతో ఈ దాడి జరిగిందా?…లేక మరేదైనా కారణం ఉందా అనే కోణం లో జనసేన నేతలు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు తమదైన శైలిలో ఆ రాయి విసిరిన వ్యక్తి ఎవరు? ఈ దాడి వెనుక గల కారణా లేంటి?అని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కీలక నేతలపై వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. విజయవాడ లో ఏపీ సీఎం జగన్‌పై రాత్రిపూట రాళ్ల దాడి జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మరో ముఖ్య ప్రతిపక్ష నేతపై రాళ్ల దాడి జరగడం సంచలనంగా మారింది.

LEAVE A RESPONSE