Suryaa.co.in

Andhra Pradesh

కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తాడేపల్లి ప్యాలెస్ నుండే

– రాజకీయాల్లో దాడుల సంస్కృతికి పేటెంట్ రైట్స్ జగన్ రెడ్డివే
– గతంలో కోడికత్తి డ్రామాలు.. ఇప్పుడు గులక రాళ్ల దాడులు
– ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో కరెంటు కోతలు, కారు చీకట్లు డ్రామాలో భాగమే
– దాడి జరిగిన క్షణాల్లోనే పోస్టర్లు, బ్యానర్లతో వైసీపీ నేతల ధర్నాలు డ్రామాలో భాగం కాదా?
– ప్రభుత్వాసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ఫోటోషూట్లు ఎలా సాధ్యమయ్యాయి?
– నిన్న జరిగిన గులకరాయి డ్రామాలోని 10 ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన మా – ప్రశ్నలకు జవాబిచ్చే ధైర్యం వైసీపీ నేతలకుందా?
– ఈ డ్రామా వ్యవహారంపై ఎన్నికల కమిషన్ సీబీఐ లేదా ఎన్ఐఏతో తక్షణమే లోతైన విచారణ జరిపించాలి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

జగన్ బస్ యాత్ర సందర్భంగా నిన్న ఆయనపై విజయవాడలో చిన్న రాయి దాడి జరిగింది. ఇటువంటి దాడులు ఎవరిపై జరిగినా అది అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ఇందుకు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు స్పందిస్తూ.. దాడిని ఖండించడమే కాకుండా. తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరగాలి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి, దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

కానీ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిపై ఈ సంఘటన జరిగిన కొన్ని నిమిషాల్లోనే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున టీడీపీపై బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ కుట్ర పన్నిందని, జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వేలేక ఇటువంటి దుష్చర్యలకు పాల్పడ్డారని రకరకాలుగా నిరాధారమైన ఆరోపణలు చేశారు.

హింసను వ్యతిరేకించే పార్టీ టీడీపీ
40 సంవత్సరాల టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు కూడా హింసను ప్రేరేపించలేదు. అన్న నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ గార్లు ఎక్కడా ఎప్పుడూ హింసను ప్రేరేపించిన దాఖలాల్లేవు. ప్రజల్ని రెచ్చగొట్టలేదు. ఇటువంటి సంఘటనలకు ఏ రోజు కారకులు కాలేదు. పైపెచ్చు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులే అనేక సార్లు దాడులకు గురయ్యారు. గత 5 సంవత్సరాల్లో టీడీపీ నేతలెందరో వైసీపీ దుశ్చర్యలకు బలయ్యారు. సాక్ష్యాత్తు చంద్రబాబు నాయుడు గారిపైనే అనేక సార్లు దాడులు జరిగాయి. కానీ, ఏనాడూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి స్పదించిన దాఖలాల్లేవు. వాటిని కట్టడి చేసే చర్యలూ లేవు.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ప్రయాణిస్తున్న వాహనంపైకి కర్రలు, రాళ్లు విసిరారు. ఈ దాడిని టీడీపీ ప్రశ్నిస్తే ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా డీజీపీ దాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన డీజీపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై రాళ్లు, కర్రలతో దాడి జరిగితే చర్యలు తీసుకోవాల్సిందిపోయి దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా వర్ణించి తాడేపల్లి ప్యాలెస్‌కు తన విధేయతను చాటుకున్నారు.

వారి ప్రకటన విని నిర్ఘాంతపోయింది. ఆరోజు జగన్ కనీసం నోరు కూడా విప్పలేదు. ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత నందిగామలో చంద్రబాబు పర్యటిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. ఆ దాడిలో చంద్రబాబు ప్రధాన భద్రతా అధికారి నుదటిపై గాయమై తీవ్ర రక్తస్రావమైంది. చంద్రబాబుకు తగలాల్సిన రాయి సీఎస్ఓ మధు అడ్డుకోవడంతో ఆయనకు ఆ రాయి తగలి తీవ్ర గాయమైంది. ఆరోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి కనీసం స్పందించలేదు.
చిత్తురు జిల్లా అంగళ్లులో చంద్రబాబుపై వైసీపీ రౌడీ మూకలు కర్రలు, రాళ్లతో దాడి చేశాయి. ఆ రోజు ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ స్పందించలేదు.

స్పందించకపోగా దాడికి పాల్పడిన వారిని స్థానిక మంత్రి, జిల్లా ఎస్పీ వెనకేసుకొచ్చారు. ఎర్రగొండపాలెంలో జరిగిన దాడిలో చంద్రబాబుగారికి భద్రత కల్పిస్తున్న ఎన్ఎస్జీ కమాండర్ సంతోష్ కుమార్‌కు తీవ్రగాయమైన మాట వాస్తవం కాదా? ఇలా ఐదేళ్లలో చంద్రబాబుపై అనేక దాడులు జరిగాయి. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే చర్యలు లేవా?

దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై 200 మంది వైసీపీ మూకలు దాడి చేస్తే ఈ నాటికీ చర్యల్లేవు. పైగా సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి స్పందిస్తూ మాకు బీపీలు రావా? మాకు ఆవేశం ఉండదా? అని అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. ఇదేనా సీఎం స్పందించాల్సిన తీరు. ఆరోజు టీడీపీ నేతల ఇళ్ల మీద తెగబడి దాడులు చేస్తూ.. పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తే కనీసం స్పందించలేదు. పైగా నాపైన, నా కుటుంబంపైన పలుమార్లు దాడులు జరిగితే నేటికీ ఏ ఒక్కరినీ శిక్షించలేదు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెన్నుపాటి గాంధిపై వైసీపీ నాయకులు దాడి చేసి, ఆయన కంటి చూపు పోవడానికి కారకులైతే, ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదు.

తోట చంద్రయ్య అనే బీసీ నాయకుడిని నడి రోడ్డుపై పీక కోసి చంపారు. బీసీ బాలుడు అమర్ నాథ్ ని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. గుంటూరులో ఒక అమ్మాయిని వైసీపీ నాయకుడు నరికి చంపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గత ఐదేళ్లలో వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరిగాయి. ప్రాణాలు తీశారు. కానీ, ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఏ నాడూ స్పందించలేదు. కట్టడి చేసే చర్యలు తీసుకోలేదు. ఈ విధంగా, రౌడీ మూకల్ని పెంచి పోషిస్తూ.. దాడుల సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసిన వైసీపీ.. నేడు తెలుగుదేశం పార్టీపై అకారణంగా బురద జల్లితే ప్రజలెవరూ నమ్మబోరు.
సానుభూతి కోసం నాడు కోడికత్తి.. నేడు గులకరాయి డ్రామాలకు తెరలేపిన జగన్ రెడ్డి.

జగన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడిపై అనేక అనుమానాలన్నాయి. 2019 ఎన్నికలకు ముందు సైతం విశాఖ ఎయిర్ పోర్టులో నడిచిన కోడికత్తి డ్రామా మనమంతా చూశాం. 5 సంవత్సరాలపాటు దళిత యువకుడు శ్రీను జైలులో మగ్గాడు. ఆ రోజు జగన్ భుజానికి చిన్న గాయమైతే విశాఖలో ఏ ఆస్పత్రికీ వెళ్లకుండా హుటాహుటిన విమానమెక్కి హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి కుట్లు వేయించుకొని నానా హంగామా చేశారు.

హైదరాబాద్ ప్రైవేటు ఆసుప్రతిలో జగన్‌కు కుట్లు వేసి, కోడికత్తి డ్రామాకు సహకరించిన ఇద్దరు డాక్టర్లలో ఒకరికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్, ఇంకో డాక్టర్‌కి ఏపీ మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. ఇప్పుడు మరోసారి అదే రకమైన డ్రామాకు తెరలేపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా కోడికత్తి డ్రామా విచారణకు సహకరించకుండా, ఐదేళ్ల పాటు న్యాయస్థానాలను తప్పించుకుని తిరిగిన వైనం చూశాక ప్రపంచమంతా విశాఖ ఎయిర్ పోర్టులో నడిచిందంతా ఒక డ్రామా అని నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు మరోసారి అదే రకమైన డ్రామాకు తెరలేపారు.

నిన్న విజయవాడలో జరిగిన గులకరాయి డ్రామాలోని వివిధ సన్నివేశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
జగన్ రెడ్డికి, వైసీపీ పెయిడ్ బ్యాచ్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ డ్రామా సన్నివేశాలకు సంబంధించిన ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి :

ప్రశ్న 1 : ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటన చేస్తుంటే పదేపదే కరెంటు ఎందుకు కట్ చేశారు? సీఎం వెళ్లే మార్గంలో ఎందుకు చీకట్లు కమ్ముకున్నాయి. ఒక వీవీఐపీ, అందునా రాష్ట్ర ముఖ్యమంత్రి, అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన వ్యక్తి పర్యటన ఉన్నపుడు కరెంటు ఎందుకు కట్ చేశారు? ఇది కుట్రలో భాగంగా చేసిన పని కాదా? రాష్ట్ర డీజీపీ, ఇంటలిజెన్స్ డీజీ, విజయవాడ కమీషనర్ ఆఫ్ పోలీస్‌లను ప్రశ్నిస్తున్నాం. కరెంటు ఎందుకు పోయింది? ఒకవేళ పోయినా ఒకటి, రెండు నిమిషాల్లో సరిచేయాలి. సీఎం పర్యటన కాబట్టి విత్ ఇన్ సెకండ్స్‌లో రికవర్ అవ్వాలి. అంత సేపు కరెంటు పోవడమేంటి? చీకట్లు కమ్ముకోవడమేంటి? ఏపీ సీపీడీసీఎల్ ఛైర్మన్‌ను సైతం మేం ప్రశ్నిస్తున్నాం. ఎవరి ఆదేశాల మేరకు, ఏ డ్రామాకు సహకరించడానికి కరెంటు తీశారు?

ప్రశ్న 2 : కారు చీకట్లో బస్సుపైన సీఎంను ఎందుకు నుంచోబెట్టారు? చికట్లో సీఎంను బస్సుపైన నించోబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రపంచంలో ఎక్కడా వీవీఐపీలను ఈ రకంగా చీకట్లలో ఊరేగించరు. కరెంటు పోయిన వెంటనే ఆయనను బస్సులో కూర్చోబెట్టకుండా అలా నిలబెట్టడం కుట్రలో/డ్రామాలో భాగమేనని అర్ధం చేసుకోవాలా?

ప్రశ్న 3 : సీఎం భద్రతా సిబ్బంది వద్ద బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉండగా వాటిని ఎందుకు ఓపెన్ చేయలేదు? ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వద్ద సూట్ కేస్ ఆకారంలో బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయి. ఇలాంటి దాడులు జరిగినప్పుడు వీవీఐకి దాన్ని అడ్డుగా పెట్టి రక్షణగా నిలుస్తారు. కానీ నిన్న ముఖ్యమంత్రిపై దాడి జరిగాక ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది చేతుల్లోని బుల్లేట్ ప్రూఫ్ షీట్ వాడలేకపోయారు? ఉత్సవ విగ్రహాల్లా నిల్చుండిపోయి ఏ డ్రామాలో పాత్రదారులయ్యారు?

ప్రశ్న 4 : ముఖ్యమంత్రికి గాయమైన వెంటనే కిందికి బస్సులోకి గానీ, మరో సురక్షితమైన వాహనంలోకి గానీ ఎందుకు తీసుకెళ్లలేదు? గాయమైన తర్వాత కూడా ముఖ్యమంత్రిని బస్సుపైనే ఎందుకు నిలబెట్టారు.? భద్రతా ప్రొటోకాల్ ప్రకారం ఎటువంటి ఏ చిన్న దాడి జరిగినా ముఖ్యమంత్రిని వేరే వాహనంలో హుటాహుటిన ఆ ప్రదేశం నుండి తప్పిస్తారు. కానీ నిన్న ఆశ్చర్యకరంగా ఏ డ్రామాలో భాగంగా ముఖ్యమంత్రిని వాహనం మార్చకుండా అదే వాహనంలో కొనసాగించారు?

ప్రశ్న 5: తక్షణమే వైద్య సిబ్బందిని పిలవకుండా ముఖ్యమంత్రికి టవల్ ఇచ్చి మరీ ఆయన గాయాన్ని ఆయన్నే తుడుచుకోమని చెప్పడమేంటి? ఇది కేవలం డ్రామాను రక్తి కట్టించడానికి, మీకు కావల్సిన విజ్యువల్స్ ప్రసారం చేసుకోవడానికి కాదా? ముఖ్యమంత్రి స్వయంగా రక్తపు మరకలు కెమెరాలకు చూపించాలి. అది చూసి అయ్యో! రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇలా జరిగిందా అని సానుభూతి కొట్టేయాలి. ఇవి డ్రామా సన్నివేశాలు కాక మరేమిటి?

ప్రశ్న 6 : ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో అంబులెన్స్ ఉండేది అత్యవసర సమయాల్లో వాడడం కోసం. అదేదో అలంకారం కోసం అన్నట్లు నిన్న ఎందుకు ఉంచారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఖచ్చితంగా డాక్టర్స్ టీమ్, అంబులెన్స్ టీమ్ ఉంటుంది. నిన్న అంబులెన్స్‌ని ఎక్కడ దాచిపెట్టారో సమాధానం చెప్పాలి. దాడికి గురైన వీవీఐపీకి ఫస్ట్ ఎయిడ్ చేసి తక్షణమే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం కోసమే అంబులెన్స్ పెడతారు. కానీ నిన్న జరిగిన డ్రామాలో జగన్ రెడ్డి కాన్వాయ్లోని అంబులెన్సుకు ఎటువంటి పాత్ర లేకుండా చేసింది మీ కుట్రలో భాగం కాదా?

ప్రశ్న 7 : ముఖ్యమంత్రి బస్సు యాత్రను కవర్ చేయడానికి మీడియా మొత్తాన్ని ఎందుకు అనుమతించడంలేదు? మీ కుట్రలు, డ్రామాలు ప్రపంచానికి తెలిసిపోతాయని మీడియాను అనుమతించడంలేదా? మీ అధికారిక బులుగు మీడియా తప్పితే ఇతర మీడియాను అనుమతించకపోవడం వెనుక మతలబు ఏంటి? నిన్న సాక్షిలో రిలీజ్ చేసిన పుటేజ్ పరిశీలిస్తే.. ముందుగా ముఖ్యమంత్రికి ఒక గజమాల వేసినట్లు, ఆ గజమాల పక్కకు తొలగించే సమయంలో ముఖ్యమంత్రి మొహం దగ్గరగా వెళ్లడంతో, ఆ తర్వాత ఫ్రేమ్ కట్ అయిపోయి నెక్ట్స్ విజ్యువల్ ముఖ్యమంత్రి తల పైన ఏదో రాయి తగిలి నుదిటిపై చేయి పెట్టుకున్నట్లుంది. ఈ విధంగా ఎడిటెడ్ వీడియోలను సొంత మీడియా ద్వారా బయట ప్రపంచానికి చూపించి డ్రామాను మరింత రక్తి కట్టించే ప్రయత్నం మీరు చేయలేదా? ఎటువంటి ఆంక్షలు లేకుండా మీడియా మొత్తాన్ని కవరేజికి అనుమతిస్తే.. ఇటువంటి నాటకాలు సాగవని మీ భయమా?

ప్రశ్న 8: దాడి జరిగిన నిమిషాల వ్యవధిలోనే ప్లేకార్డులు, పోస్టర్లు పట్టుకుని వైసీపీ నేతలు రోడ్లపై ధర్నాలు ప్రారంభించారు. ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యులని బురద జల్లే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. అంత తక్కువ వ్యవధిలో పోస్టర్లు ఎలా తయారు చేశారు. ఫ్లెక్సీలు అంత తొందరగా ఎలా ప్రింట్ చేశారు. ఇది డ్రామా, కుట్ర కాకపోతే మరేంటి? స్క్రీన్ ప్లేలో భాగంగా ముందుగానే చక్కగా పోస్టర్లు, బ్యానర్లు ప్రింట్ వేయించుకొని దాడి సీన్ పూర్తవగానే ధర్నా సీన్ కు తెరలేపిన మాట నిజం కాదా?

ప్రశ్న 9 : నేటి సాక్షి పత్రికలో ముఖ్యమంత్రికి తీవ్ర గాయాలైనట్లు, ఒక రకంగా హత్యాయత్నం జరిగినట్లు హెడ్ లైన్ వార్తలు ప్రచురించారు. మరి అంతటి తీవ్ర గాయాలైన వ్యక్తి ఘటన జరిగిన తర్వాత కూడా దాదాపు 2 గంటల పాటు తన బస్సు యాత్రను ఏ విధంగా కొనసాగించగలిగారు? ఇటు వంటివి కచ్చితంగా నాటకాలలో సాధ్యమవుతాయి గానీ, నిజ జీవితంలో కాదు కదా?

ప్రశ్న 10 : ఆసుప్రతిలో ఆపరేషన్ థియేటర్లో ఫోటో షూట్లు జరుగుతాయా? ఆ విధంగా ఫోటో షూట్లు చేసి ఆ ఫోటోలతో సానుభూతి పొందడం కోసం కాదా? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడుగుతున్నాం. మెడికల్ పొటోకాల్ ప్రకారం ఆపరేషన్ థియేటర్లోకి ఫోటో గ్రాఫర్లను అనుమతిస్తారా? ఆ విధంగా ఫోటో షూట్లు చేస్తారా? ఇది ఖచ్చితంగా డ్రామా కాక మరేంటి? ఏ యాంగిల్ లో కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎలా తీయాలి అని నిర్ణయించుకుని మరీ ఫోటోలు తీసి ప్రచురించారు. దీనిని మీ డ్రామాలో క్లైమాక్స్ సీన్ అని మేము అనుకోవాలా?

జగన్ రెడ్డి డ్రామా దాడి జరిగిన వెంటనే.. వైసీప పెయిడ్ బ్యాచ్ రోడ్డెక్కి తెలుగుదేశం పై దుమ్మెత్తిపోయడం మొదలు పెట్టారు. ఇది డ్రామానో కాదో ప్రజలు ఆలోచించాలి. ఎన్నికల్లో సానుభూతి పొందడం కోసం, కొన్ని ఓట్లు సంపాదించుకోవడం కోసం చేసిన హైడ్రామా ఇది. రేపు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలసి జగన్ రెడ్డి, ఆయన పెయిడ్ బ్యాచ్ ఆడిన ఒక అద్భుతమైన డ్రామా మాత్రమే. జగన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్ అని అడిగారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. మంచి చేసి ఉంటే ప్రజలు ఓట్లేస్తారు. కానీ, మీరేమీ చేయలేదని మీకు కూడా తెలుసు కాబట్టే ఇలాంటి డ్రమాలకు తెరలేపారు.

దయచేసి జగన్ రెడ్డి గారూ, ఇటువంటి రిస్క్ లు తీసుకోవద్దు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటువంటి డ్రామాలు అడటం అవసరమా? మీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటే మాకు కూడా బాధేస్తోంది. దయచేసి ఇటువంటి డ్రామాలాడొద్దు ప్లీజ్. మీరు అద్భుతంగా నటించగలరని మేం ఒప్పుకుంటాం. మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. పాదయాత్ర సమయంలో, ఎన్నికల ప్రచార సమయాల్లో ఎంత అద్భుతంగా నటించారో ప్రజలందరికి తెలుసు. పదే పదే మీ నటనా ప్రావీణ్యాన్ని దయచేసి ప్రదర్శించొద్దు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సేఫ్ గా, ఆరోగ్యంగా ఉండాలని మేం కోరుకుంటాం.

ఈ డ్రామాపై తక్షణమే తక్షణమే లోతైన విచారణ జరిగి తీరాలని, ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలని రాష్ట్ర డీజీపీని, ఇంటలిజెన్స్ డీజీని, విజయవాడ పోలీస్ కమిషననర్ ఈ ముగ్గురిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ నాయకులు నిన్నటి నుండి ప్రజల్ని అనేక రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఒక అశాంతిని సృష్టించే కుట్ర చేస్తున్నారు. వాళ్లలా కాకుండా.. తెలుగుదేశం పార్టీ నాయకులు సంయమనం పాటిద్దాం. అలజడులు సృష్టించాలి, సానుభూతి పొందాలన్నదే వారి లక్ష్యం. ఎన్నికలు సజావుగా జరగకుండా చేయాలన్నదే వారి ఉద్దేశం.
బాధ్యతగల ప్రతిపక్షంగా మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో పోరాడుతాం. నిన్న జరిగిన గులకరాయి డ్రామాకు సంబంధించిన స్క్రప్ట్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ లో తయారైందని ఇప్పటికే ప్రజలందరికీ క్లారిటీ వచ్చేసింది. చివరగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి మాదొక చిన్న మనవి. దయచేసి మీరు ఇలాంటి డ్రామాలకు సీక్వెల్స్ తయారు చేసే ప్రయత్నాలు చేయకుండా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో మాతో తలపడండి.

LEAVE A RESPONSE