జగన్ మామ మోసం… విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం

  • రెండు నెలల్లో వార్షిక పరీక్షలు… నేటికీ పరీక్ష ఫీజులు చెల్లించని వైసీపీ ప్రభుత్వం
  • రూ.2.56 కోట్లు పరీక్ష ఫీజు చెల్లించలేనివాళ్లు ఐబీ సిలబస్ తెస్తారా?
  • విద్యార్థులను పరీక్షలకు ఎలా వెళ్తారు?..తల్లితండ్రులు ఒకసారి ఆలోచించాలి
  • సీబీఎస్ఈ నిబంధనలను పాఠశాలల్లో అమలు చేయని సర్కార్
  • 85,353 విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరం
  • వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ నిర్వహణకే ముప్పుతిప్పలు
  • హాఫ్ నాలెడ్జ్ సీఎం తీసుకొనే నిర్ణయాలు ఇలాగే ఉంటాయి
  • జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  

‘విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందిస్తానని మోసపు మాటలు చెప్పిన జగన్ మామ… పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. వారి భవిత ప్రశ్నార్థకం అవుతోంది. ఇంగ్లీష్ మీడియం పేరుతో హడావుడి చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు అని న్యాయస్థానం చెప్పడంతో సీబీఎస్ఈ సిలబస్ విధానం తెచ్చారు. తీరా ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ లో చదివిన విద్యార్థులు కనీసం పరీక్షలు రాసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి, అవకతవక విధానాలను బహిర్గతం చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో సీబీఎస్ఈ సిలబస్ అమలులో వైసీపీ ప్రభుత్వ తీరుని వెల్లడించారు.

నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ ‘‘సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలో ఉన్న 44,369 పాఠశాలల్లోనూ అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ సిలబస్ అనుమతి కోసం సీబీఎస్ఈ బోర్డు స్కూలుకు రూ.లక్ష ఫీజు చెల్లించాలి.. ఆ బోర్డు చెప్పిన నిబంధనలు, నియమాలు పాఠశాలల్లో అమలు చేయాలి. కేవలం రాష్ట్రంలో 1000 పాఠశాలల మాత్రమే కేంద్రం నుంచి సీబీఎస్ఈ అనుమతి తీసుకొంది. అదీ కేంద్ర ప్రభుత్వం ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తే.

ఈ పాఠశాలల్లో రాష్ట్రం మొత్తం మీద 85,353 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి తరగతుల వారీగా సీబీఎస్ఈ సిలబస్ మొదలుపెట్టిన ప్రభుత్వం ఆయా పాఠశాలల్లో సీబీఎస్ఈ నిబంధనలు మేరకు కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించలేకపోయింది. పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలకు సంబంధించి సీబీఎస్ఈ సిలబస్ మేరకు మరో రెండు నెలల్లో వార్షిక పరీక్షలు రాయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ వారి భవిష్యత్తుపై ఉదాసీనతతో వ్యవహరిస్తోంది. ఎందుకంటే వార్షిక పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయింది. అసలు వారు ఏ మాధ్యమంలో పరీక్షలు రాయాలో, వారి పరిస్థితి ఏమిటో తెలియని ఆగమ్యగోచర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

సీబీఎస్ఈ నిబంధనలు అమలు కావడం లేదు
విద్యార్థులకు మరో రెండు నెలల్లో పరీక్షలు ఉన్నాయి. రూ.2,56,05,900 లు ఫీజులు కింద చెల్లించాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ దానిపై కిమ్మనడం లేదు. ఇలాగైతే విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారా? ఒకసారి విద్యార్థుల తల్లితండ్రులు ఆలోచన చేయాలి. సీబీఎస్ఈ బోర్డు నిబంధనల మేరకు అనుమతి ఉన్న పాఠశాలల్లో నిర్దేశిత నియమాలు, నిబంధనలు అమలు చేయాలి. బోధనకు అనువైన మౌలిక వసతులు కచ్చితంగా ఉండాలి. సైన్సు ల్యాబోరేటరీలు వేయి పాఠశాలలకుగానూ కేవలం 732 పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. గ్రంథాలయాలు కూడా 721 పాఠశాలల్లోనే ఉన్నాయి. కంప్యూటర్ ల్యాబోరేటరీలు కూడా 454 పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. సీబీఎస్ఈ  పిల్లలకు 44 వేల కంప్యూటర్స్ ఉండాలి. కేవలం 12,214 కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి స్కూల్ కీ పరీక్షల నిమిత్తం రెండు ప్రింటర్స్, స్కానర్స్ కావాల్సి ఉంటే వాటినీ సమకూర్చలేదు.

స్టూడెంట్ కౌన్సిలర్లు ఎక్కడ?
కంప్యూటర్ టీచర్ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. 489 పోస్టులు మాత్రమే తీసుకున్నారు. మిగిలిన వాటి భర్తీకి కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రతి పాఠశాలకు స్టూడెంట్ కౌన్సిలర్ పోస్టు కచ్చితంగా ఉండాలని నిబంధన ఉంటే కనీసం ఏ పాఠశాలలో ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఒకేషనల్ ట్రైనర్స్ కూడా 573 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఇలా అరకొరగా సౌకర్యాలను కల్పిస్తే పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారు..? సిలబస్ ను ఎలా అర్ధం చేసుకుంటారు. సీబీఎస్ఈ సిలబస్ వేయి పాఠశాలలకు అనుమతి తీసుకొంటేనే ఇంత గందరగోళం ఉంటే, ఐబీ సిలబస్ పేరిట పిల్లలకు అంతర్జాతీయ వసతులను కల్పించే బాధ్యత ఎవరు తీసుకుంటారు..? పిల్లలకు పాఠాలు ఎలా అర్ధం అవుతాయి..? దీనిపై తక్షణం ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండున్నర కోట్ల పరీక్ష ఫీజులు కట్టలేని ప్రభుత్వం 3 లక్షల డాలర్లు చెల్లించి ఎలా ఐబీ సిలబస్ తీసుకొంటుంది?

రాజకీయం కోసం కాదు.. బిడ్డల భవిష్యత్తు కోసం చెబుతున్నాం
జనసేన పార్టీది ఎప్పుడూ ఒకే విధానం. రేపటి తరాలకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలనేది మా ఆకాంక్ష. దీని కోసమే మేం పోరాడుతాం… మాట్లాడుతాం. సీబీఎస్ఈ సిలబస్ విషయంలో జరుగుతున్న తతంగాన్ని ఆధారాలతో సహా బయటపెడుతున్నాం. దీనిలో రాజకీయం లేదు. ప్రభుత్వ అసమర్ధత వల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే భయం ఉంది. దీన్ని వెంటనే ప్రభుత్వం సరిచేసుకోవాలి. హాఫ్ నాలెడ్జ్ సీఎమ్ తీసుకొంటున్న నిర్ణయాలతో విద్యా విధానాలు తీసుకొస్తే పిల్లలకు సరైన భవిష్యత్తు ఉండదు. తెలిసీ తెలియకుండా విధానాలు తీసుకొస్తే వ్యవస్థలు నాశనం అవుతాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవడం మానేయండి.

ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి
సీబీఎస్ఈ సిలబస్ అమలులో ప్రభుత్వ అసమర్థతకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగాలి. మార్చిలో పరీక్షలకు వెళ్లాల్సిన విద్యార్థులకు అత్యవసరంగా తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఫీజులు చెల్లించాలి. కనీసం పాఠశాలల్లో అవసరం అయిన కంప్యూటర్లు లేకపోతే వారు పరీక్షలు ఎలా రాస్తారు..? వెంటనే ప్రభుత్వం సీబీఎస్ఈ సిలబస్ పాఠశాలలపై దృష్టి సారిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. వెంటనే తగిన బాధ్యతను సీఎం తీసుకొని తప్పులను సరిచేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే పిల్లల భవిష్యత్తు మొత్తం పాడవుతుంది.

జనసేన పార్టీ ఏ విషయం మీద మాట్లాడిన పూర్తి ఆధారాలతో రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడుతుంది. మా పార్టీ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న వారి సొంత కంపెనీలకు భూములను ధారాదత్తం చేసి, ఉద్యోగాలు ఇస్తారని మాయ మాటలు చెప్పడం తప్పు. కోర్టులో కేసు ఉంటే సెటిల్మెంట్లు చేశామని మంత్రి చెప్పడం వారి పాలనా తీరుకు నిదర్శనం. కోర్టులో ఉన్న కేసుల్ని సెటిల్ చేస్తున్నామని చెప్పారంటే ఏదో మతలబు ఉందనే అర్థం అవుతోంది. సీబీఎస్ఈ బోర్డు నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేసి పిల్లలకు సరైన దారి ప్రభుత్వం చూపాలని కోరుతున్నాం’’ అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు  కోన తాతారావు, పార్టీ అధికార ప్రతినిధి  పోతిన వెంకట మహేష్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్  కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నాయకులు  పంచకర్ల రమేష్ బాబు,  బండ్రెడ్డి రామకృష్ణ,  నేరెళ్ల సురేష్,  బండారు నివాస్,  తాతంశెట్టి నాగేంద్ర,  అక్కల రామ్మోహన్,  మండలి రాజేష్,  దల్లి గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply