Suryaa.co.in

Editorial

హక్కుల కమిషన్‌కు భోజనం బంద్‌

– ఏపీ హక్కుల కమిషన్‌ ఉద్యోగులకు భోజనం సరఫరా నిలిపివేత
– ఉద్యోగులు ‘ హక్కులు’ కోరినందుకు సర్కారీ బహుమతి
– కర్నూలు కలెక్టర్‌కు సర్కారు ఆదేశాలు
– ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి రీలొకేట్‌ అయిన కమిషన్‌
– నాటి నుంచి ప్రభుత్వమే చైర్మన్‌, సభ్యులకు భోజనం సరఫరా
– తాజాగా ఉద్యోగులు హక్కులు అడిగినందుకు కమిషన్‌కు భోజనం బంద్‌
– మరి కల్పించాల్సిన సౌకర్యాల సంగతేమిటి?
– హైదరాబాద్‌ హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ ఇవ్వటం లేదేం?
-కమిషన్‌ చైర్మన్‌కు కనీసం స్టెనో కూడా ఇవ్వరా?
– గొంతెత్తితే సౌకర్యాలు కత్తిరిస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘హక్కులో రామచంద్రా’ అని మొన్నటి వరకూ అడిగిన హక్కుల కమిషన్‌ ఉద్యోగులు.. ఇప్పుడు కొత్తగా ‘అన్నమో రామచంద్రా’ అని దీనంగా కోరుతున్న వైచిత్రి ఇది. రాష్ట్ర విభజన తర్వాత, హైకోర్టు తీర్పు ఫలితంగా..ప్రభుత్వ ఆదేశాలతో కర్నూలుకు తరలివచ్చిన ఏపీ మానవ హక్కుల కమిషన్‌కు, కనీస సౌకర్యాలు కల్పించడంలో ఏపీ సర్కారు విఫలమయింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదా ఉన్న హక్కుల కమిషన్‌ చైర్మన్‌కు, కనీసం స్టెనో కూడా నియమించని నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపైనా మీడియాలో చర్చ జరిగింది.

అయితే, మీడియా కథనాలపై స్పందించి పొరపాట్లు సరిదిద్దుకోవలసిన సర్కారు.. వాటిని డిమాండ్‌ చేసిన ఉద్యోగులకు ‘తనదైన శైలి’ లో శిక్ష విధించి, హెచ్చరిక సంకేతం జారీ చేయడం విమర్శలకు గురవుతోంది. హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు రీలోకేట్‌ అయిన హక్కుల కమిషన్‌కు1-9-2021న ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ కేటాయించారు.

తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై వచ్చిన ఆంధ్రా-తెలంగాణ మూలాలు ఉన్న ఉద్యోగులకు కూడా గెస్ట్‌హౌస్‌లోనే వసతి ఇచ్చారు. అప్పటి నుంచి గత 15వ తేదీ వరకూ మిషన్‌ చైర్మన్‌- సభ్యులు- ఉద్యోగులకు ప్రభుత్వమే భోజనం ఏర్పాటుచేసింది. ఆ మేరకు నాటి కర్నూలు జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అంటే కర్నూలులోని లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయ మంచి చెడ్డలు చూసుకునే బాధ్యతను ప్రభుత్వం, కర్నూలు జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది.

ఈ నేపథ్యంలో హక్కుల కమిషన్‌ కార్యాలయ పాలనా వ్యవస్థలో నెలకొన్న సమస్యలు, ఉద్యోగుల ఈతిబాధలు, కమిషనర్‌కు స్టెనో కూడా లేని దుస్ధితిపై.. మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా వెల్లువెత్తాయి. కమిషన్‌ కార్యాలయంలో ఉద్యోగుల నియామకాలు, సౌకర్యాలపై జీఏడీ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజుకు.. హక్కుల కమిషన్‌ చైర్మన్‌ మాంధాత సీతారామమూర్తి లేఖ రాసినప్పటికీ, కమిషన్‌ సమస్యల్లో మార్పు లేదు. అన్నీ బుట్టదాఖలయ్యాయి. చివరకు ముఖ్యమంత్రికి సమర్పించిన వార్షిక నివేదికలో కూడా కమిషన్‌ కార్యాలయ పాలనా అసౌకర్యాల గురించి చైర్మన్‌ ప్రస్తావించినా స్పందన లేకపోవడం ఆశ్చర్యం.

చివరకు.. మానవ హక్కుల కమిషన్‌కు ఉన్న అధికారాలేమిటో తెలియని సీఎంఓ.. చైర్మన్‌ తమ వద్దకు వచ్చి మాట్లాడాలని సూచించటంపై, విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో కూడా కారు-డ్రైవర్‌ లేని కమిషన్‌ చైర్మన్‌ దుస్థితిని.. మీడియా వెలుగులోకి తీసుకువచ్చిన తర్వాతనే, ప్రభుత్వం ఆయనకు వాటిని సమకూర్చింది.

ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్న సమయంలో.. 17 నెలల నుంచి కల్పిస్తున్న భోజన సౌకర్యాన్ని హటాత్తుగా నిలిపివేయడం, కమిషన్‌ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తే, ఉన్న సౌకర్యాలు నిలిపివేయడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి హక్కుల కమిషన్‌ విభజన జరగకపోవడంతో, పదిమంది ఉద్యోగులను డెప్యుటేషన్‌ మీద ఏపీ కమిషన్‌ కార్యాలయానికి పంపించాలని.. ఏపీ సర్కారు, తెలంగాణ సర్కారును అభ్యర్ధించింది. దానితో పదిమంది ఉద్యోగులను ఏపీకి పంపించింది. తర్వాత అమరావతిలో ఏర్పాటుచేయాల్సిన కమిషన్‌ కార్యాలయాన్ని, కర్నూలులో ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

దానితో తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై వచ్చిన ఆంధ్రా-తెలంగాణ మూలాలు ఉన్న పదిమంది ఉద్యోగులు, స్థానికంగా కర్నూలు కలెక్టర్‌ సర్దుబాటు చేసిన 6గురు, మరో ఆరుగురు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో కమిషన్‌ కార్యాలయ పాలన మొదలయింది. వారితోపాటు హక్కుల కమిషన్‌ చైర్మన్‌-మెంబర్లకు భోజన సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కొద్దికాలం పాటు కర్నూలులోనే ఉన్న లోకాయుక్త కార్యాలయ సిబ్బందికీ, ప్రభుత్వమే భోజన సౌకర్యం కల్పించింది.

హైదరాబాద్‌ నుంచి పదుల సంఖ్యలో ఉన్న ఫిర్యాదులను తీసుకువచ్చిన ఉద్యోగులకు, కర్నూలు వచ్చే సరికి వేల ఫిర్యాదులు ఎదురయ్యాయి. దానితో ఐదారుగురు చేయాల్సిన పనిని ఒక్క ఉద్యోగి చేయాల్సిన పరిస్థితి. దానితో ప్రభుత్వం వారికి అక్కడే భోజన, వసతి సౌకర్యం కల్పించడం అనివార్యమయింది. 2021 నుంచి హక్కుల కమిషన్‌ కార్యాలయానికి భోజన సౌకర్యం ప్రారంభించిన ప్రభుత్వం, హటాత్తుగా ఈనెల 15 నుంచి.. ఎలాంటి సమాచారం లేకుండా భోజన సౌకర్యం నిలిపివేసింది.

అయితే భోజన సౌకర్యం నిలిపివేసిన ప్రభుత్వం, తమ న్యాయమైన డిమాండ్లు మాత్రం పట్టించుకోవడం మానేయడంపై, ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డెప్యుటేషన్‌పై వచ్చిన తమకు తెలంగాణ బేసిక్‌, డీఏ ఇస్తున్న ఏపీ ప్రభుత్వం… హైదరాబాద్‌ హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ మాత్రం ఏపీ ఉద్యోగుల మాదిరిగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి హైదరాబాద్‌ హెచ్‌ఆర్‌ఏ 24 శాతం అయితే, ఏపీ 16 శాతం మాత్రమే ఇస్తోంది.

అదే నగర నగదు పరిహార భత్యం హైదరాబాద్‌లో వెయ్యి రూపాయలు ఉంటే, కర్నూలులో 500 రూపాయలే ఉందని గుర్తు చేస్తున్నారు. కమిషన్‌ కార్యాలయం కర్నూలులో ఉండటంతో జిల్లా స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారని, కానీ తాము తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై వచ్చినందున, తమకు హైదరాబాద్‌లో 2021 వరకూ తీసుకున్న వేతనాలు, భత్యాలే కల్పించాలన్నది వారి డిమాండ్‌.

సీఎంఓ నిర్లక్ష్యం వల్ల కమిషన్‌ సమస్యలు అపరిష్కృతం కాకుండా నిలిచిపోయాయయన్న విమర్శలు వస్తున్నాయి. జీఏడీ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజుకు, కమిషన్‌ చైర్మన్‌ ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదంటున్నారు. చివరకు కమిషన్‌ చైర్మన్‌కే స్టెనో లేకై తన తీర్పు తానే టైప్‌ చేసుకుంటున్న దయనీయంపై, ప్రభుత్వం స్పందించాలంటున్నారు.

1 COMMENTS

LEAVE A RESPONSE