ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులు

– ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను డీఈవోలు సేకరిస్తున్నారు. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది సరిపోరనే అంశం సీఈసీ రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ప్రస్తావనకు వచ్చింది. ఈ మేరకు జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో మీనా తగిన ఆదేశాలు ఇచ్చారు. సిబ్బంది కొరత లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఈసీ సూచనల మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

శుక్రవారం ఉదయం 11 గంటల్లోగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఎన్నికల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా ఉపాధ్యాయులను నియమించనున్నారు. దీంతో జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులు ఆఘమేఘాలపై సిబ్బంది వివరాలను సిద్ధం చేసి ఎన్నికల అధికారులకు పంపుతున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించిన వివరాలను ప్రత్యేక ఫారంలో నింపి ఎన్నికల అధికారులకు పంపిస్తున్నారు.

Leave a Reply