జగన్ ..మీ పీఆర్సీ కథ బాగోలేదు అబ్బాయ్

సీఎంకు టీచర్లు చెప్ప ‘లేఖ’

గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులకు, నమస్కారములు,
ఆర్యా,
తమరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు మరియు ఉద్యోగులకు మీ నోటితో కొన్ని వాగ్దానాలు చేశారు.అవి ఈనాడు గుర్తు చేసుకోవటానికి సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి.మీరు అధికారంలోకి వచ్చిన తరువాత అధికారుల సమావేశంలో మీ మేనిఫెస్టోను చూపిస్తూ, ఇది ఒక పవిత్రమైన, భగవద్గీత, బైబిల్, ఖురాన్, అని చెబుతూ, వీటిని అమలు చేయకపోతే మనం బ్రతికిన దాంట్లో ప్రయోజనం లేదు అనే మాదిరిగా మీరు మాట్లాడినప్పుడు మేము నిజంగా ఇంతటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రిని భవిష్యత్తులో చూడలేదేమో అని సంతోషపడ్దాము.కాని. మీరు పై మూడు గ్రంధాలను ప్రజల హృదయాలలోకి చొచ్చుకుపోయేలా చేసే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో, మీ ప్రచారంలో చెప్పిన మాటలు మీకు మచ్చుకు కొన్ని వాగ్దానాలు గుర్తుకు చేస్తున్నాను.

1.సి.పి.యస్ రద్దు చేస్తాం.
2. ఉద్యోగుల డి.ఏ లను సకాలంలో
మంజూరు చేస్తా.
3.ఉద్యోగులు తలెత్తుకొని తిరిగేలా మెరుగైన పి.ఆర్.సి ఇస్తాం.
అని చెప్పిన మీరు ఉద్యోగుల జీతభత్యాలు, ఆరోగ్య భద్రత, విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు.అంతేకాదు ఈ రోజు మీ పత్రికలో ఉద్యోగుల జీతభత్యాలను గురించి, వ్యతిరేకంగా వ్రాయిస్తూ, సమాజంలో దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. క్రింద స్థాయిలో మీరు ప్రచారంలో ఉన్నపుడు మీయొక్క వాగ్దానాలు విన్న మేము, తండ్రికి తగ్గ తనయుడు రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ” రావాలి జగన్ కావాలి జగన్” స్లోగన్ ను నెత్తిన పెట్టుకొని తిరిగిన ఉద్యోగులు ఎందరో, అంతే కాదు గ్రామస్థాయిలో ఉపాధ్యాయులు చాపకింద నీరులా మీ గెలుపు లో కొంత భూమికను పోషించారు.మీ తండ్రిగారు ఈ రోజుటికి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. తన పాలనలో ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా పాలన చేయడం వల్లనే కదా.
మరి మీరు ఈ రోజు అధికారులు చెప్పింది వేదంగా భావించి, ఉద్యోగుల జీతభత్యాలు, ఆరోగ్య భద్రత, విషయంలో ఉద్యోగులు చరిత్రలో మిమ్మల్ని మరిచిపోలేని విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది. మిమ్ములను శాశ్వత ముఖ్యమంత్రి గా చూడాలనుకొనే వారికి ఇవి బాధాకరమైన విషయం గా భావిస్తున్నాము.అధికారానికి అధికారులు ముఖ్యం కాదు, అధికారుల దగ్గర పనిచేసే సిబ్బంది ముఖ్యం అనే విషయాన్ని ఏ పాలకడైతే తెలుసుకోగలుగుతాడో,అతడే శాశ్వత పాలకులుగా ఉండగలరని మాత్రం ప్రతి ఉద్యోగి చెప్పగలడు.

గతంలో పాలకులు అధికారుల మాటలువిని క్రింది స్థాయి సిబ్బందిని నొప్పించి, తట్టి బుట్ట చేతపట్టుకొని నెత్తిన బట్టేసుకొని పోయిన చరిత్రలను మీరు వద్దండి.ఇప్పటికైనా సమయం మించి పోలేదు .ఒక పండుగ వస్తే కొత్త బట్టలు వేసుకోవాలనుకోవడం మానవుని కోరిక. అలా కాదు ఆర్థిక స్థితి లేదు అనుకుంటే ఉన్న బట్టల్లో కొంత మెరుగైన బట్టలను వేసుకోవాలి అనుకొంటారు.అలాగే ఉద్యోగిగా కొత్త పి.ఆర్.సి.అంటే ఇప్పుడు పొందుతున్న వేతనం కంటే మెరుగైన వేతన సవరణ పొందాలని కోరుకుంటూరు.కాని పొందుతున్న వేతనాలకు రావాల్సిన పాత బకాయిలను జోడించి మెరుగైన వేతనం ఇస్తున్నారు .అంటే అర్దం ఎలా ఉందంటే నీ పాత చొక్కాకు గుండీలు లేవు, ఇప్పుడు గుండీలు వేసి ఇచ్చాం ఇంకేమి కావాలి నీకు అని పిల్లవాడికి చెప్పినట్లుంది 11 వ పి.ఆర్.సి కథ.ఎంతటి పెద్ద అధికారైనా నా లాంటి ఒక ఉపాధ్యాయుడి దగ్గర్నుంచి జ్ఞానాన్ని ప్రసాదింపచేసుకొన్నవాడె కదా, అదివారు మరవచ్చ,చరిత్ర మరువలేదుకదా.ఓ అధికారి, ఓ నాయకుడా, చరిత్రలను దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలి.అదే మన మనుగడకు నాంది కావాలి.

నమస్కారములతో,
ఉపాధ్యాయులు, PATHIKONDA Mandalam

Leave a Reply