Home » తీన్మార్‌‘మల్లన్న’ మరో ఈటల రాజేందరన్నే!

తీన్మార్‌‘మల్లన్న’ మరో ఈటల రాజేందరన్నే!

( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)
క్షవరం అయితే గానీ వివరం తెలియదన్నది సామెత. కొద్దినెలల క్రితం మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇప్పుడు తీన్మార్ మల్లన్న. పేర్లు, ప్రాంతాలే మార్పు తప్ప, మిగిలిన ‘లొంగుబాటు’ వ్యవహారమంతా షేమ్ టు సేమ్. అవసరాల ముందు సిద్ధాంతాల రాద్ధాంతాలు దేనికీ పనికిరావు. కేసులు, జైలు మెట్లు ఎక్కకముందు వరకూ అంతా మడమతిప్పని వీరులే. మాట తప్పని ధీరులే! కానీ కేసు-జైలే వారి ఇజాలను ఆటోమేటిగ్గా మార్చేస్తాయి. ఇదే అసలు నిజం. సిద్ధాంతాల మడి కట్టుకున్నామని, రాముడిలా రాజకీయాల్లో ఏకపత్నీవ్రతులమని మైకులు పగలకొట్టి, సైద్ధాంతికవాదాలు వినిపించేవారి అసలు సిద్ధాంతాలు, జైళ్లకు వెళ్లిన తర్వాత గానీ మారవు. జైలు- కేసులు బనాయించకముందు వరకూ.. తాము ఎవరినయితే రాముడన్నారో, తర్వాత ఆయనే రాక్షసులవుతాడు. ఎవరినయితే రాక్షసులని తెగిడారో, అదే రాక్షసుడు ఆశ్చర్యంగా రాముడయిపోతాడు. అవసరం అలాంటిది మరి. అందుకు ఎవరూ అతీతులు కారు. రోజూ కేసీఆర్ అండ్ కో మీద, అక్షరాస్త్రాలు సంధించే మన తీన్మార్ మల్లన్న సహా.
అన్నట్లు తీన్మార్ మల్లన్న గుర్తున్నాడా? అదేనండీ క్యూ న్యూస్ అనే యూట్యూబ్ చానెల్ పెట్టి, అందులో రోజూ కేసీఆర్ పాలనను, సర్ఫ్‌ఎక్సెల్‌తో ఉతికి ఎండబెట్టే తీన్మార్ మల్లన్న. ఇప్పుడు గుర్తొచ్చిందా? యస్. ఆయనే! విపక్షాలతోపాటు కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించిన మల్లన్న పోరాటం తెలంగాణ ప్రజలనే కాదు. తెలుగు ప్రజలందనీ హత్తుకుంది. వెనుక ఎలాంటి దన్ను లేకపోయినా, సింహం సింగిల్‌గా వస్తుందన్న సినిమా డైలాగు మాదిరిగా.. ఒక్కడే నడిచౌరస్తా మీద నిలబడి, కేసీఆర్‌ను చూపుడువేలితో ప్రశ్నించిన ఏకైక యువ జర్నలిస్టు మల్లన్న సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతంగానే రెండో స్థానంలో నిలిచి, బీజేపీని మూడవ స్థానంలోకి నెట్టేసిన మల్లన్న.. ఇప్పుడు అదే బీజేపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారు. అంటే ఈటల రాజేందర్ మాదిరిగా మల్లన్న కూడా, కేసుల తర్వాత రక్షణ కవచం కోసం ‘కమలవనం’లో చేరి.. కాషాయం కట్టి పునీతుడవుతున్నారన్న మాట. ఇతర పార్టీల్లో ఉండే వారిపై ఎన్ని మరక లున్నా.. కమలవనంలో చేరితే వారంతా పులుకడిగిన ముత్యాలయినట్లే. సర్ఫ్‌ఎక్సెల్, వీల్, డెట్టాల్ వంటివేమీ వాడకుండానే పరిశుద్ధులయిపోతారు. మన రాజేందర్, మల్లన్న కూడా ఇప్పుడు బీజేపీ దృష్టిలో పులుకడిగిన ముత్యాలు, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనాలన్నమాట. భేష్!
సరే.. అసలు ఇంత యమార్జంటుగా మల్లన్న బీజేపీలో చేరవలసిన అవసరం ఏమిటి? ఇన్నాళ్లూ బీజేపీలో కనిపించని సిద్ధాంతాలు.. జైలు, కేసుల తీవ్రత పెరిగినప్పుడే గుర్తుకురావడం ఏమిటి చెప్మా? అన్నది తెలంగాణ ప్రజల డౌటనుమానం! గత శాసనమండలి ఎన్నికల సందర్భంలో తాను ఏ పార్టీ మనిషినీ కాదని, తన వెనుక తెలంగాణ ప్రజలు తప్ప ఏ పార్టీలూ లేవని చెప్పుకున్న మల్లన్న.. కరోనా విస్తరణకు మోదీనే కారణమని, ఆయనకు ఉన్న ఇల్లు సరిపోక కొత్త ఇల్లు కట్టుకుంటున్నారంటూ బుల్లితెరపై చెలరేగిపోయారు. మోదీ ఓట్ల కోసం వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల వల్లే, క రోనా కేసులు పెరిగాయని మోదీని తీన్మార్ వాయించాడు. మోదీని అంతర్జాతీయ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తుంది. పోయాలి కూడా అని శపించి శహభాష్ అనిపించుకున్నాడు. తనకు కేసీఆర్ ఎంత దూరమో.. బీజేపీ కూడా అంతే దూరమని, తాను ప్రజల అజెండా మోయడానికి వచ్చానే తప్ప, పార్టీల జెండా మోయడానికి రాలేదన్న భారీ డైలాగ్.. మల్లన్న ఇమేజీని హిమాలయమంత ఎత్తుకు తీసుకువెళ్లింది. సరే.. మల్లన్న నాటి ముచ్చట్లన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనుకోండి. అది వేరే విషయం!
అయితే ఇటీవలి కాలంలో మల్లన్నపై అనేక కేసులు నమోదవడంతో చిక్కుల్లోపడాల్సి వచ్చింది. అంతలోనే ఆయనను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపారు. దీనితో మల్లన్న చంచల్‌గూడకు వెళ్లాల్సి వచ్చింది. సహజంగా ఇవన్నీ హిమాలయమంత ఎదిగిన ఆయన ఇమేజ్ మంచులా కరగడానికి కార ణమయింది. ప్రపంచం కూడా బహు చెడ్డది. తెరముందు నిల్చుని కేసీఆర్‌ను తిట్టిపోస్తుంటే సంతోషించిన జనం, అరెస్టయిన తర్వాత.. పాపం మల్లన్న ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆయనను జైలుకు ఎందుకు పంపించారని ఆలోచించే తీరికే లేదు ఈ పాడు ప్రపంచానికి! లోకం అంతే గురూ. అపజయం ఎప్పుడూ అనాధనే కదా?
ఆ ప్రకారంగా బీజేపీపై ఒకప్పుడు తీన్మార్ వేసిన మల్లన్నను ఎవరూ పట్టించుకోని సమయంలో.. ఆయనకు అదే బీజేపీ గుర్తుకొచ్చింది. మరి ఎవరూ పట్టించుకోకపోతే ఏదో ఒక రాజకీయ రక్షణ కావాలి కదా? అంతే.. వెంటనే మోదీ గారి సిద్ధాంతాలు బహుబాగా ఉన్నట్లు ఆయనకు అప్పటికప్పుడు గుర్తుకొచ్చాయట. ఇంకేముంది? సీన్ కట్ చేస్తే తీన్మార్ మల్లన్నకు మోదీ సిద్ధాంతాలు బ్రహ్మాండంగా నచ్చేసినందున.. ఆయన బీజేపీలో చేరాలనుకున్నట్లు మల్లన్న భార్య, క్యూ టీమ్ కూడా ప్రకటించేసింది. అంటే మల్లన్నకు బెయిల్ వచ్చిన వెంటనే ఏ అమిత్‌షానో, ఏ నద్దాగారి సమక్షంలోనో కమలతీర్ధం తీసుకుని, కాషాయం కండువా కప్పేసుకుంటారన్న మాట. అంతకుమించి.. బీజేపీ అనే అతిపెద్ద రాజకీయ రక్షణ కవచం లభించిందన్నమాట. ఆ చేరికతో మల్లన్న పెంచుకున్న ఇమేజీ సహజంగా డామేజీ అవుతుంది.
ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది జర్నలిస్టులపై ప్రభుత్వాలు వివిధ కేసులు పెట్టి వేధించాయి. టీవీ9 రవిప్రకాష్‌ను జైల్లో పెట్టించారు. ఆ తర్వాత తెలంగాణలో ఆనం చిన్ని వెంకటేశ్వరరావు అనే గుండెధైర్యం ఉన్న మరో జర్నలిస్టును 50 రోజులకు పైగా జైల్లో ఉంచారు. టీవీ5 జర్నలిస్టు మూర్తిని ఏపీలో సీఐడీ వేధించింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్‌పైనా మహారాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది. అయితే విచిత్రంగా వారెవరూ బయటకువచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరలేదు. తెలంగాణలో ఆనం చిన్ని వెంకటేశ్వరరావు అనే జర్నలిస్టయితే, బయటకు వచ్చిన తర్వాత మరింత ఉధృతంగా ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తున్నారు. కానీ, కేసీఆర్‌ను రోజూ సవాల్ చేస్తున్న తీన్మార్ మల్లన్న అనే జర్నలిస్టు మాత్రం ఒక్క ఘటనకే భీతిల్లి రాజకీయ పార్టీల గూటిలో ఒరిగిపోవడమే విచిత్రం.
ఎవరు ఏ పార్టీలోనయినా చేరవచ్చు. ఎవరికి ఏ పార్టీ సిద్ధాంతాలయినా నచ్చవచ్చు. అందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండబోవు. అయితే కొద్ది నెలల క్రితమే మల్లన్నే తిట్టిపోసిన మోదీ సిద్దాంతాలు, జైల్లో ఉన్నప్పుడే ఎందుకు నచ్చినట్లు? టీఆర్‌ఎస్‌కు తాను ఎంత దూరమో బీజేపీకి అంతే దూరమని చెప్పిన మల్లన్న కొలబద్ద, ఇప్పుడు బీజేపీ వైపు ఎందుకు మొగ్గినట్లు? ప్రజల అజెండానే తప్ప పార్టీల జెండాను మోయనని బీరాలు పలికిన మల్లన్న, ఇప్పుడు బీజేపీ జెండా మోసేందుకు ఎందుకు రెడీ అవుతున్నట్లు? మెడమీద తల ఉన్న ఎవరికయినా వచ్చే సందేహాలే ఇవి.
అంతకుముందు ‘కారు’ దిగనంతవరకూ, ఈటల కూడా ఇలాంటి ముచ్చట్లే చెప్పారు. భూకజ్జా కేసులు పెట్టించక ముందు వరకూ రాముడయిన కేసీఆర్.. కేసులు నమోదయిన తర్వాత రాక్షసుడయిపోయారు. కరోనా సమయంలో కేంద్రంపై కాలుదువ్విన అదే ఈటల.. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హుజూరాబాద్‌లో అదే బీజేపీ అభ్యర్ధి! కేసుల తర్వాత ఆయనకూ కమలవనం రాజకీయ రక్షణ కవచమిచ్చింది. నిజంగా తాము ఎలాంటి తప్పు చేయనివారు, తమ చేతులు పరిశుద్ధంగా ఉన్నవారు ఎవరికీ భయపడుకుండా నేరుగా సర్కారుతోనే యుద్ధం చేయవచ్చు. తామెవరికీ భయపడమని చెప్పేవారంతా, తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించి, రక్షణ పొందడం ఎందుకు? ఒంటరిగా యుద్ధం చేసేందుకు భయమా? ‘‘స్మశానం ముందు ముగ్గండదు. రాజకీయ నాయకులకు సిగ్గుండద’’న్న పరుచూరి చెప్పిన డైలాగు గుర్తుకురావడం లేదూ?

Leave a Reply