Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు

-తిరుపతి జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
-మేము అధికారంలోకి వచ్చాక మెరుగైన రీతిలో వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగిస్తాం
-తప్పు చేసిన వాలంటీర్లకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు
-వాలంటీర్లు ప్రజలకు జవాబుదారి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు
-ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న అధికారులపై ఎన్నికల ప్రధాన అధికారికి ఎన్డీఏ నేతల ఫిర్యాదు
– తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న, వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్‌ కు ఎన్డీఏ నేతలు తెదెపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, తెదెపా రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫి, బిజెపి నేతలు డా. పార్ధసారథి, పాతూరి నాగభూషణం, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెదెపా సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ… శ్రీ కాళహస్తిలో గోడౌన్ గుట్టు రట్టు చేసినా ఆ కలెక్టర్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదు. “ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయడం మాకు రోజు వారి పనిగా మారింది. గతంలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే రాజకీయ పార్టీలు భయపడేవి. కానీ నేడు ఈసీకి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా నవ్విపోదురు నాకేంటి అన్నట్లు జగన్ రెడ్డి పార్టీ వ్యవహారశైలి ఉంది. శ్రీ కాళహస్తిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు భారీ ఎత్తున వైసీపీ దాచుకున్న గోడౌన్‌ను మా కార్యకర్తలు పట్టుకుంటే జిల్లా కలెక్టర్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ దగ్గరకు వెళ్తె మా అభ్యర్ధనను వినడానికి కూడా విముఖత చూపించారు.

తిరుపతి జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు వైసీపీ నాయకులందరిని కలిసి షాల్ కప్పిన ఘనాపాటి ఆ కలెక్టర్. గోడౌన్‌లో దొరికినవన్నీ ప్రచార సామాగ్రి అని పంచనామాలు రాశారట! కుక్కర్లు, చీరలు, వాచీలు, ఫ్యాన్‌లు ప్రచార సామాగ్రి ఎలా అవుతుందో ఆ కలెక్టర్ సమాధానం చెప్పాలి. పరిపాలన ఎన్నికల కమిషన్ చేతిలో ఉందో లేక జగన్ రెడ్డి చేతిలో ఉందో మాకు అర్థం కావడం లేదు. కో ఆపరేటివ్ సొసైటీకి అధ్యక్షులుగా ప్రైవేటు వ్యక్తులున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే తక్షణమే వారు ఆ బాధ్యతల నుండి తప్పుకోవాలి. కానీ వారు ఇంకా కొనసాగుతున్నారు అని ఈసీకి ఫిర్యాదు చేసి వెంటనే వారిని తొలంగించాలని కోరాం” అని తెలిపారు.

వాలంటీర్ల బంగారు భవిష్యత్తు మాతోనే సాధ్యమన్న వర్ల…
“వాలంటీరు వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. కానీ మెరుగైన రీతిలో వారి సేవలను వినియోగించుకుంటాం. అధికార పార్టీకి వాలంటీర్లు దాసోహం, ఊడిగం చేయకూడదు…ప్రజలకు మాత్రమే సేవ చేయాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిచిన 441 మంది వాలంటీర్లు సస్పెండ్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో కొంతమంది వాలంటీర్లపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.

వాలంటీర్లు ఇటువంటి తప్పిదాలు చేసి క్రిమినల్ కేసు గనుక వారి మీద నమోదయితే భవిష్యత్తులో వారికి ప్రభుత్వ ఉద్యోగం రాదు. కాబట్టే నిష్పక్షపాతంగా వ్యవహరించండని మేము వాలంటీర్లను కోరుతున్నాం. జగన్ రెడ్డి జేబులో నుంచి, కొట్టేసిన, దోపిడీ చేసిన దాంట్లో నుంచి జీతాలు ఇవ్వడం లేదని ప్రజలే వారికి జీతాలు ఇస్తున్నారని వాలంటీర్లు గ్రహించాలి. ప్రజాధనం నుంచి జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాలి కానీ వైసీపీకి కాదు” అని వాలంటీర్లకు తెలియజేశారు.

చంద్రబాబు అక్రమ అరెస్టు తాళలేక మనస్థాపానికి గురై మరణించిన కుటుంబాలను నారా భువనేశ్వరీ గారు పరామర్శిస్తుంటే.. అది ఎన్నికల ప్రచారం ఎలా అవుతదో వైసీపీ నాయకులు చెప్పాలని వర్ల దుయ్యబట్టారు. “కార్యకర్తల కుటుంబాలకు అండగా మేమున్నామని చెప్పేందుకు నేరుగా మృతుల కుటుంబసభ్యులను నారా భువనేశ్వరీ గారు కలిసి పరామర్శిస్తున్నారు. కార్యకర్తలకు భువనమ్మ భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఆర్థిక సాయం చేయకూడదని మృతుల కుటుంబాలకు ఎప్పుడో ఆర్థిక సాయం అందించాం. కానీ వైసీపీ నాయకులకు బుర్ర లేకుండా ‘నిజం గెలవాలి’ పర్యటనపై ఆరోపణలు చేస్తున్నారు. వీరందరిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. తప్పకుండా వారందరిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారు” అని వివరించారు.

అక్రమ మార్గాన ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్న ఓ జగన్ రెడ్డి!
“దోపిడీ సొమ్ముతో తాయిళాలు కొని…ఓటర్లకు పంపిణీ చేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న నీ ఆశలు అరియాశలవుతాయి. నిన్ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా నీ దోపిడీ సొమ్ము దాచావని మాకు తెలుసు, ప్రజలు కూడా గ్రహించారు. ఒక్క ఛాన్స్ అంటుంటే ప్రజలు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేసుకున్నావు. వాటిని ఉపయోగించి తాయిళాలు పంపిణీ చేసినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. అవినీతి మార్గాలను అనుసరిస్తున్న జగన్ రెడ్డి పార్టీపై ఎన్నికల కమిషన్ ఉక్కుపాదం మోపాలి” అని ఈసీని కోరినట్లు వర్ల రామయ్య తెలియజేశారు.

LEAVE A RESPONSE