Suryaa.co.in

Andhra Pradesh

ముగ్గురు మహిళల 37 ఏళ్ల పోరాటం హైకోర్టులో వారికి అనుకూల తీర్పు

సుప్రీంకోర్టు గుర్తించబడిన(రిపోర్ట్ బుల్ జడ్జిమెంట్ 2020) తీర్పు తర్వాత దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంద్రప్రదేశ్ హైకోర్టులోనే తొలి తీర్పు జారీ

హిందూ ఉమ్మడి వారసత్వ ఆస్తులలో మహిళలకు పురుషులతో పాటు సమాన ఆస్తి హక్కు

( చింతలపాటి పాణిని సోమయాజి , హైకోర్టు న్యాయవాది)

అమరావతి: ఆస్తి హక్కు పై ఆంద్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు జూన్ 2023

ఆస్తి హక్కు : తండ్రి, వారసత్వ ఆస్తిలో కుమార్తెలకు_సమాన హక్కు
మహిళల ఆస్తి హక్కు, హిందూ వారసత్వ చట్టం-1956,
హిందూ వారసత్వ(సవరణ)చట్టం-2005 ప్రకారం తండ్రి,వారసత్వ ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు కల్పిస్తూ (ఆగస్టు 2020) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపద్యంలో సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం, కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతోపాటు, సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ 2020లో సుప్రీంకోర్టు రిపోర్ట బుల్ తీర్పు చెప్పింది.

హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ, వారికి తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. హిందూ వారసత్వ(సవరణ) చట్టంలో-2005 ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది.సవరణ సమయం 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆమెకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

2005లో చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి చనిపోతే సోదరులు ఆస్తిలో వాటా నిరాకరించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం 2005 నాటికి తండ్రి మరణించినా, బతికి ఉన్నా ఆడపిల్లలకు సమాన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేసింది.ఈ అంశంపై ట్రయల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలను ఆరు నెలల్లో నిర్ణయించాలని ధర్మాసనం ఆదేశించింది. (ఆగస్టు 2020 తీర్పును) దానిని అనుసరించి దేశంలోనే తొలిసారిగా ఆంద్రప్రదేశ్ హైకోర్టులో జూన్ 2023 మంగళవారం నాడు సంచలన తీర్పు చెప్పింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే….

గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామానికి చెందిన 1.అచ్యుతుని సీతారావమ్మ,2. సిరిపురపు స్వరాజ్యలక్ష్మి,3. చుండూరు సావిత్రి దేవి అనువారు తురగా రామూర్తి,రమాదేవిలకు స్త్రీ సంతానంగా వున్నారు. వీరితో పాటుగా 6గురు కుమారులు ఉన్నారు. వీరికి ఉమ్మడి వారసత్వ రీత్యా సంక్రమించిన ఆస్తులు వడ్లమూడి,గుంటూరులలో కలవు.

వీరి తండ్రి 1961లో ఎటువంటి విల్లు రాయకుండా మరణించిన తర్వాత వారి ఆస్తి పంపకాల నిమిత్తం 1986లో ఓయస్ నెం.86/1986 పార్టీషన్ సూట్ తెనాలి అడిషినల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేసియున్నారు.

ఈ కేసులోని ముగ్గురు మహిళలు తమకు అన్నదమ్ములతో పాటు సమానంగా ఆస్తిలో హక్కు కావాలని,కల్పించాలని 1986 నుండి కోర్టులలో పోరాడుతూ చివరకు 2010 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ను ఆశ్రయించారు. కింద కోర్టులో తమకు జరుగుతున్న అన్యాయం పై హైకోర్టులో CRP No:1364/2010 రివిజన్ పిటీషన్ దాఖలు చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంద్రప్రదేశ్ కు కొత్తగా ఏర్పడిన హైకోర్టులో ఈ ముగ్గురు మహిళా పిటిషనర్ లకు అనుకూలంగా జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి దేశంలోనే తొలిసారిగా హిందూ సక్సేషన్ అమెన్డ్ మెంట్ యాక్ట్ 2005 ప్రకారం తీర్పునిచ్చారు. గతంలో 1993లో తెనాలి కోర్టు ఇచ్చిన ప్రిలిమనరి డిక్రీ లో ఆడ పిల్లలకు 11/70 శాతం తక్కువ వాటాలను సవరిస్తూ 2005 సవరణ చట్టం ప్రకారం మరియు 2020 సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్ట్ బుల్ తీర్పును అనుసరించి 11/100 వాటాలుగా మారుస్తూ/సవరిస్తూ తోటి అన్నదమ్ములతో పాటు ఈ అక్క,చెల్లెలకు సమానంగా ఆస్తి హక్కులను కల్పిస్తూ , 13.6.2023 మంగళవారం నాడు ఆయన సంచలన తీర్పును ఇచ్చారు.

ఈ కేసులో ముగ్గురు మహిళా పిటిషనర్ లతో పాటు 14 మంది ప్రతివాదులుపై న్యాయపోరాటం చేసి 37ఏళ్లకు కానీ ఆంద్రప్రదేశ్ హైకోర్టులో విజయం సాధించారు. ఈ కేసులో మహిళా పీటీషనర్ ల తరుపున న్యాయవాదిగా చింతలపాటి పాణిని సోమయాజి తమ వాదనలు వినిపించారు. తెనాలి కోర్టు కి హైకోర్టు జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి ఈ కేసుకు సంబంధించి తదుపరి తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల పై తగిన ఆదేశాలు జారీ చేశారు.

 

LEAVE A RESPONSE