చిన్నారులపై అకృత్యాలను తీవ్రంగా పరిగణించాలి: సుప్రీంకోర్టు

చిన్నారులపై జరుగుతున్న నేరాలు సమాజానికి మాయని మచ్చ వంటివని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అకృత్యాలను తీవ్రంగా పరిగణించాలని వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించి.. సమాజానికి తగిన సందేశం ఇవ్వాలని వ్యాఖ్యానించింది.

చిన్నారులపై జరిగే అకృత్యాలను అత్యంత తీవ్రంగా పరిగణించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చిన్నారులపై జరిగే లైంగిక దాడులు, వేధింపులు సమాజానికి, మానవత్వానికి మచ్చలాంటివని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఇలాంటి కేసుల్లో నిందితులకు తగిన శిక్ష విధించి సరైన సందేశాన్ని ఇవ్వాలని న్యాయస్థానాలకు సూచించింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని దోషిగా తేల్చుతూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పక్కింట్లో ఉండే చిన్నారికి తండ్రి ప్రేమను పంచాల్సిన వ్యక్తి.. చిన్నారి అమాయకత్వంతో ఆడుకున్నాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిపై ఎలాంటి సానుభూతి ప్రకటించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.

“చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే తగిన శిక్షను విధించడం ద్వారా సమాజానికి సరైన సందేశం అందించవచ్చు. ఇలాంటి నిందితులపై ఉదాసీనత చూపాల్సిన అవసరం లేదు. తీవ్రమైన లైంగిక వాంఛలకు ఇలాంటి కేసులు ఉదహరణ. దేశానికి విలువైన మానవ వనరులు చిన్నారులే. వారే మన దేశ భవిష్యత్తు. దురదృష్టవశాత్తు దేశంలో బాలికలే చాలా బలహీనమైన స్థితిల్లో ఉన్నారు.” అని సుప్రీంకోర్టు తెలిపింది.

నిందితుడు వయసు ప్రస్తుతం 70-75 ఏళ్ల మధ్య ఉండటం, ట్యూబర్క్యులోసిస్(టీబీ) వ్యాధితో బాధపడుతుండటం వల్ల.. జీవిత ఖైదును 15 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చుతూ తీర్పు వెలువరించింది ధర్మాసనం.ట్రయల్ కోర్టు విధించి, హైకోర్టు సమ్మతించిన జరిమానాను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇది నిందితుడు చేసిన నేరానికి తగిన శిక్షేనని తెలిపింది.