Suryaa.co.in

National

కర సేవకుల పోరాట ఫలితమే మందిర నిర్మాణం

– గవర్నర్ బండారు దత్తాత్రేయ

కర సేవకుల పోరాట ఫలమే అయోధ్య రామ జన్మభూమి మందిర నిర్మాణం అని గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అయోధ్యలో శ్రీ బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం విజయ శ్రీ భవన్ దగ్గర వైభవంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాములవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాములవారి ఆశీస్సులతో దేశంలో రామరాజ్యం స్థాపన జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయోధ్య రామ జన్మభూమి కోసం పోరాడిన విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు అశోక్ సింగల్ గారు ధన్యులని కొనియాడారు. సింగల్ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని గుర్తు చేశారు.ఈ సందర్భంగా గవర్నర్ కి పోలీసులు గౌరవ వందనం అందజేశారు. తదనంతరం ఎల్ఈడి ద్వారా అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా టీవీలు వీక్షిస్తూ తలపై అక్షింతలు వేసుకొని స్వామివారిని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంతో పాటు పరిసర ప్రదేశాలన్నింటిని అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. కాషాయ జెండాలు తోరణాలతో ప్రత్యేక శోభను సంతరించారు. కార్యక్రమం నిర్వహిస్తున్నంత సేపు జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. భక్తిశ్రద్ధలతో శ్రీరామ జపం చేస్తూ భజనలు పూర్తి చేశారు. అనంతరం మిఠాయిలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి సత్యం జీ, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి పండరినాథ్, నాయకులు జగదీశ్వర్, పగుడాకుల బాలస్వామి, శివరాములు, వాణి సక్కుబాయి, వీరేష్, జీవన్, తిరుపతి, శ్రీనివాసు లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE