Suryaa.co.in

National

41 ఏళ్ల కాపురంలో 60 కేసులుపెట్టుకున్న దంపతులు

– అవాక్కైన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

జస్టిస్ ఎన్వీ రమణ ఓ జంట తమ వైవాహిక జీవితంలో ఒకరిపై ఒకరు 60కిపైగా కేసు పెట్టుకోవడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం అవాక్కయ్యింది. 41 ఏళ్ల కిందట వివాహమైన ఓ జంట 30 ఏళ్లుపాటు కలిసున్నారు. విబేధాలతో 11 ఏళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ దంపతుల వివాదానికి సంబంధించిన కేసు బుధవారం విచారణకు రాగా ఈ సందర్భంగా లాయర్లు చాతుర్యాన్ని తప్పక గుర్తించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చమత్కరించింది. అంతేకాదు, వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి వెళ్లాలని దంపతులకు సూచించింది.

‘ఏం చేద్దాం.. కొన్ని వివాదాలు అట్టే పరిష్కారం కావు.. కొంతమంది తరుచూ గొడవ పడుతూనే ఉంటారు.. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగడానికే ఇష్టపడతారు.. ఎపుడైనా ఒకరోజు కోర్టు ముఖం చూడకపోతే ఆ రోజు వారికి నిద్ర పట్టదు’ అని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కొహ్లిల ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేలా మధ్యవర్తిత్వానికి వెళ్లడం మంచిదని భార్యాభర్తల తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది.

మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కారించుకునే వరకూ మిగతా పెండింగు కేసుల జోలికి వెళ్లేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. మీ లాయర్ల చాతుర్యాన్ని తప్పక గుర్తించాలని, భార్యభర్తలు చాలాసార్లు న్యాయస్థానం మెట్లెక్కడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు.
ఈ జంటకు సంబంధించిన కేసులు ట్రయల్ కోర్టు, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాదు, సదరు మహిళ తన భర్త తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని,ఆ ఇంట్లో తాను ఉండలేనని ఆరోపించింది. అయితే, సమగ్ర పరిష్కారానికి సుముఖంగా ఉన్నారా? అని మహిళ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి లాయర్ బదులిస్తూ.. ఆమె మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నారని, అయితే హైకోర్టులో విచారణను నిలిపి వేయకూడదని కోరారు. అది సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

‘మీకు పోరాడటానికి చాలా ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది.. ఏదో ఒకటి ఎంచుకోండి.. మధ్యవర్తిత్వం సమయానుకూలమైంది’’అని పేర్కొంది. ఇరు వర్గాలు మధ్యవర్తిత్వానికి అంగీకరించడంతో ఈ అంశాన్ని ఢిల్లీ హైకోర్టు అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌కు రిఫర్ చేసింది. అంతేకాదు, విధివిధానాలు వేగవంతం చేయడానికి ప్రయత్నించాలని, వ్యవహారానికి సంబంధించిన పురోగతిపై ఆరు వారాల్లో నివేదికను సమర్పించాలని మీడియేషన్ కేంద్రం సెక్రెటరీ ని ఆదేశించింది..

LEAVE A RESPONSE