Home » ఆత్మహత్య చేసుకున్న రైతు శ్రీకాంత్ కుటుంబాన్ని రూ.25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి

ఆత్మహత్య చేసుకున్న రైతు శ్రీకాంత్ కుటుంబాన్ని రూ.25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి

-అన్నదాత ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే
-కాంగ్రెస్ పార్టీ తరుపున రూ.50 వేల సహాయం అందజేత
– పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

విజయవాడ / పల్నాడు – పత్తి, మిర్చి సాగుతో తీవ్ర నష్టాలు పాలై ఆత్మహత్య చేసుకున్న.. రైతు శ్రీకాంత్ కుటుంబాన్ని రూ.25 లక్షల నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వమే ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం.. రచ్చమలపాడులో బాధిత కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు బుధవారం పరామర్శించారు. మృతుని తల్లిదండ్రులు నాగభూషణం, మల్లేశ్వరిలకు కాంగ్రెస్ పార్టీ తరుపున రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో గత మూడేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, అవన్నీ ప్రభుత్వ హత్యలే అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు కోలుకోని విధంగా నష్టపోతున్నారని ఆక్రోశం వెలిబుచ్చారు. యువరైతు ఆత్మహత్యతో అతని కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, మృతునికి ఏడు సంవత్సరాల జగదీష్, ఐదేళ్ళ వినయ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారని, ప్రభుత్వం వీరికి ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు.

మృతుని పూర్తి వివరాలను కుటుంబ సభ్యులు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకు వివరించారు. కాకునూరి శ్రీకాంత్ రెండు ఎకరాల తన సొంత పొలంతో పాటు ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని, పత్తి, మిర్చి పంటలను పండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడులు పెరిగిపోవడంతో సుమారు రూ.10లక్షల వరకు అప్పులపాలయ్యాడన్నారు.

ఈ మధ్యనే ఒంగోలు జాతి ఎడ్లు, బండిని కూడా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఎంత ప్రయత్నించినా గత మూడేళ్లుగా వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో.. విధిలేని స్థితిలో… తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

కలగా మారిన వైఎస్సార్ జలకళ…
వైసీపీ ప్రభుత్వ విధానాలతోనే 29 సంవత్సరాల యువరైతు శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడటం మనస్సును కలచి వేస్తోందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. నీటి వసతి లేని రైతాంగానికి వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు.

వైఎస్సార్ జలకళ అంటూ రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని ఘనంగా ప్రకటించినా… ఆచరణలో ఆ పథకంగా సరిగ్గా అమలు కావడం లేదన్నారు. వైఎస్సార్ జలకళ… రైతులకు కలగా మారిందని వాపోయారు. అదే విధంగా తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలను రాష్ట్రం తక్షణమే ఆదుకోవాలన్నారు. సాగు నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన కోరారు.

400 పైగా కరువు మండలాలు ఉన్నా…
రాష్ర్టంలో 400పైగా కరువు మండలాలు ఉన్నా… ప్రభుత్వం 103 మాత్రమే అని ప్రకటించి అన్న దాతల నోట్లో మట్టి కొట్టిందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. సిఎం జగన్ ప్యాలెస్ వదిలి పొలం బాట పట్టాలని డిమాండ్ చేశారు. ఇకనైనా పారదర్శకంగా కరువు మండలాలను ఎంపిక చేసి అన్నదాతకు లబ్ధి కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి, ఏపీసీసీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సేవాదల్ చైర్మన్ ఎలమందారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శంకర్, డీసీసీ అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply