Suryaa.co.in

Andhra Pradesh

తొలి ఎన్డీఏ సభ గ్రాండ్ సక్సెస్

• స్వయంగా దేశ ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడింది
• విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారులపై సీఈసీ చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన చిలకలూరి పేట బొప్పాడి సభ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నాతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. లక్షలాదిమంది జనం తోసుకొస్తుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడటం దేనికి సంకేతం? బీజేపీ, టీడీపీ, జనసేన తొలి ఎన్డీఏ సభ నభూతో నభవిష్యత్ అన్నట్టు జరిగింది. మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులంతా పాల్గొన్ని సభను విజయవంతం చేశారు. అయితే ట్రాఫిక్ జామ్ వల్ల వేలాదిమంది సభకు రాలేకపోయారు. ప్రధానమంత్రి ఈ సభ ద్వారా ఒకటి స్పష్టం చేశారు.

ఏపీ ప్రజల కష్టాలు తనకు తెలుసని, వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమైనవని ఆయన చెప్పారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటానన్నారు. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని,అవినీతి, దోపిడీలో అధికార వైసీపీ నేతలు పోటీ పడ్డారని సభ ద్వారా ప్రధాని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో చిలకలూరి సభ ద్వారా తెలుస్తోందని, ఈ అరాచక పాలనకు అంతం పలుకుదామని ప్రధాని పిలుపునిచ్చారు.

ఆరోగ్య శ్రీ సహా అనేక పథకాలకు కేంద్రం నిధులిస్తున్నా ఏపీ ప్రభుత్వం సొంత స్టిక్కర్లు వేసుకుంటా అంతా తామే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోందని ప్రధాని చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. లక్షలాదిమంది ప్రజలు హాజరైన సభకు పోలీసులు ఇచ్చే భద్రత ఇదేనా? కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. స్వయంగా ప్రధాని హాజరైన సభ వైపు జనం తోసుకొస్తుంటే నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? పోల్స్ ఎక్కినవారు దిగాలని, వారిని స్థానిక పోలీసులు నియంత్రించాలని స్వయంగా ప్రధానే చెప్పారంటే పోలీసు వైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రధానమంత్రి సభలో క్లౌడ్ మేనేజ్ మెంట్ బాధ్యత ఎవరిది? అధికారులను ఏర్పాటుచేసి, జనాన్ని నియంత్రాంచాల్సిన బాధ్యత సీనియర్ పోలీసు అధికారులకు లేదా? మరి ఎందుకు నిర్లక్ష్యం వహించారో తేలాలి. ప్రధాని భద్రత, జనం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను పోలీస్ బాస్ లు ఎందుకు పట్టించుకోలేదో చీఫ్ ఎలక్షన్ కమిషన్ సమగ్ర విచారణ చేయాలి. జగన్ రెడ్డి ప్రభుత్వంతో పాటు అందులో పనిచేస్తున్న కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే సభకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సభను బ్రహ్మాండంగా విజయవంతం చేశారు.

LEAVE A RESPONSE