– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
తాడేపల్లి: నేతన్నలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను చేనేత ఐక్య కార్యాచరణ సమితి నేతలు సోమవారం కలిసి, పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, చేనేత రంగానికి టీడీపీ పాలన స్వర్ణయుగం వంటిదన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు.
ప్రస్తుతం సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నేతన్నలకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ విక్రయాలు పెంచేలా చర్యలు తీసుకుందన్నారు. ఇటీవల మొంథా తుపాను కారణంగా నష్టపోయిన నేతన్న కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. నూలు, ఇతర రసాయనాలు తడిచిపోయిన నేతన్నలకు రూ.5 వేలు చొప్పున్న అందజేస్తున్నామన్నారు. మత్స్యకారుల మాదిరిగా నేతన్నలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, బంగాళదుంపలు, పంచదార కేజీ చొప్పున అందజేస్తున్నామన్నారు.
ఎంఎస్ఎంఈ పార్కుల్లో నేతన్నలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వినతిపత్రంల పేర్కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో చేనేత ఐక్య కార్యాచరణ సమితి పిల్లలమర్రి నాగేశ్వరరావు, పి.బాలకృష్ణ, రామనాథం పూర్ణచంద్రరావు, కె.కోటేశ్వరరావు, జి.బాలాజీ, కె.కుమారి, డి.రామారావు, జి.కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు