Suryaa.co.in

Andhra Pradesh

మహిళా ఖైదీల ఆరోగ్యభద్రత అవసరం

– పోషకాహార మాసోత్సవాల్లో
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
– జిల్లా జైలు సందర్శన..వసతుల తనిఖీ
– మహిళా ఖైదీల మెనూపై సంతృప్తి..
విజయవాడ: జైలులో ఉన్న మహిళా ఖైదీలకూ పోషకాహారం అవసరమని ..పోషక విలువలున్న ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ జిల్లా జైలులో నిర్వహించిన పోషకాహార మాసోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత జైలు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన వాసిరెడ్డి పద్మ జైలులోని మహిళా ఖైదీల రిజిస్టర్ ని తనిఖీ చేశారు. జైల్లో వారికి అందిస్తున్న మెనూను ఆరాతీసి.. సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ఉమాదేవి అధ్యక్షత నిర్వహించిన పోషకాహార మాసోత్సవాల అవగాహన కార్యక్రమంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కొవిడ్‌-19 వైర‌స్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి రోజు వంద‌ల కొల‌ది ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్న ఈ త‌రుణంలో పౌష్టికాహారం తీసుకోవల‌సిన ఆవ‌శ్య‌క‌త మ‌రింత పెరిగిందన్నారు. ఇంటి వాతావరణంలో కుటుంబ సభ్యుల పర్యవేక్షణ, సలహాలకు నోచుకోలేని మహిళా ఖైదీల ఆరోగ్యభద్రతకు మహిళా కమిషన్ ఆలంబనగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా క‌రోనా వైర‌స్ ను ఎదుర్కోవ‌టానికి శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌ట‌మే దివ్య ఔష‌ధ‌మ‌న్నారు. వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే బ‌ల‌వ‌ర్ధ‌క స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌టం ఒక్క‌టే మార్గమని చెప్పారు.
ఆహారాన్ని బట్టి మన మానసిక, భౌతిక వికాసం ఉంటుందన్నారు. విభిన్న రంగాల్లో పిల్లల శక్తి సామర్ధ్యాల ప్రదర్శనలో పౌష్టికాహారానిది ప్రధాన పాత్రగా చెప్పారు. మహిళలు పౌష్టికాహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. మహిళా కమిషన్ డైరెక్టర్ సూయజ్ మాట్లాడుతూ మహిళలు శరీరానికి కావాల్సిన శక్తి, ఎదుగుదల, పునరుత్పత్తి జీవక్రియలకు పోషకాలు తప్పనిసరన్నారు. ఆహారంలో స్ధూలపోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం‍తోనే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని హెచ్చరించారు. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం అధికంగా కనిపిస్తోందని…దీంతో మానసిక, శారీరక సమస్యలతోపాటు, రక్తహీనతల లోపం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
ఈ సమస్య పరిష్కారానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషకాహారాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాలను చేపడుతున్నాయన్నారు. జైలు సూపరిండెంట్ కోనా రఘు మాట్లాడుతూ మహిళా ఖైదీలు బయటకు వెళ్లిన తర్వాత పౌష్టికాహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. నూట్రిషన్ డాక్టర్ ఎన్. సునీతాదేవి మాట్లాడుతూ మహిళల శారీరక, మానసిక మార్పులు, పోషకాల ఆవశ్యకతను వివరించారు. శరీరానికి కావాల్సిన శక్తి, ఎదుగుదలకు ఉపకరించే పోషకాలు ఎక్కువగా ఏఏ పదార్ధాల్లో ఉంటాయనేది అవగాహన చేశారు. కార్యక్రమంలో మహిళా ఖైదీలకు పండ్లు, పోషకాహార పదార్ధాలు పంపిణీ చేశారు. వరల్డ్ విజన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మహిళా ఖైదీలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్.జోషిబాబును మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రత్యేకంగా అభినందించారు.
అంతర్గత ఫిర్యాదుల కమిటీపై సూచనలు
మహిళా ఖైదీలతో వాసిరెడ్డి పద్మ నేరుగా మాట్లాడి వారు స్వయంగా తయారు చేసిన అల్లికలు, కుట్టిన వస్త్రాలను పరిశీలించారు. జైలులో ఎదుర్కునే సమస్యలపై ఆరా తీశారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు, పనితీరుపై జైలు అధికారులకు ఆమె సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏపీడి జయలక్ష్మి, సీడిపీఓలు మంగమ్మ, రెహానా, జైలు డాక్టర్ శ్రీనివాసరావు, జైలర్లు జి.రవిబాబు, ఎన్. గణేష్,అంగన్ వాడీ సూపర్ వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE