Suryaa.co.in

Andhra Pradesh

జగన్ దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే చట్టం

  • ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం… ఓ క్రూరమైన చట్టం
  • ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండాపోతుంది
  • ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది
  • రాజ్యాంగానికి లోబడి రాష్ట్రంలో పాలన జరగడం లేదు
  • న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించడానికి వీళ్లెవరు..?
  • ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదార్ పుస్తకాల్లో, సర్వే రాళ్లలో సీఎం బొమ్మలు ఏమిటి?
  • రాష్ట్రంలో ప్రజల ఆస్తులన్నీ పాలకుడి గుప్పిట ఉంచుకొనేందుకే కొత్త చట్టం
  • భూ యాజమాన్య హక్కుల చట్టంలోని లోగుట్టు ఏమిటో సామాన్యుడికి అర్ధమయ్యేలా చైతన్యం తెస్తాం
  • నిస్వార్థంగా పోరాటం చేస్తున్న న్యాయవాదులకు జనసేన సంపూర్ణ మద్దతు
  • మంగళగిరి కేంద్ర కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశం అయిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

జగన్ తన పాలనలో విశాఖపట్నంతోపాటు రాష్ట్రంలో లెక్క వేసి మరీ దోచుకున్న ప్రజా ఆస్తులను ఎలాంటి అడ్డుఅదుపు లేకుండా చట్టబద్ధంగా హస్తగతం చేసుకునేందుకు ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం (ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ) తీసుకొచ్చినట్లు కనిపిస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ చట్టం ఒక క్రూరమైన చట్టం (డ్రాకొనియాన్ లా) అని చెప్పారు. భారత రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీస ధర్మాన్ని పక్కనపెట్టి పరిపాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. సామాన్యుల ఆస్తులకు రక్షణ ఇవ్వని భూ యాజమాన్య హక్కుల చట్టంలోని లోగుట్టుని అందరికీ అర్థమయ్యేలా చెప్పి చైతన్యం చేస్తామన్నారు. సామాన్య గృహిణి నుంచి ప్రతి స్థాయి వారికీ ఈ చట్టం ఏమిటో తెలియచేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న న్యాయవాదులతో శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వల్ల ప్రజలకు ఎంత కీడు జరుగుతుందో చట్టంలోని సెక్షన్ల వారీగా న్యాయవాదులు వివరించారు. సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘దేశంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులకు రాజ్యంగం రక్షణ కల్పించింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. శ్రీ కేశవానంద భారతి మఠం భూముల విషయంలో సుదీర్ఘంగా అత్యున్నత న్యాయస్థానంలో సాగిన న్యాయ పోరాటంలో తుది తీర్పులో ఆస్తి హక్కును కూడా ప్రాథమిక హక్కుగానే సుప్రీంకోర్టు పరిగణించింది. ఇప్పుడు ప్రజల ఆస్తి హక్కులకు శాశ్వత యాజమాన్య హక్కు కల్పించే పేరుతో చట్టాన్ని వైసీపీ తీసుకొచ్చిన విధానం పరిశీలిస్తే రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను ధిక్కరించినట్లే కనిపిస్తోంది. ఓ పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవల్సిన చర్యలు, సూచనలు పట్టించుకోకుండానే వైసీపీ అడ్డగోలుగా చట్టాన్ని తీసుకొచ్చినట్లు అర్ధం అవుతోంది.

మా ఆస్తులపై నీ బొమ్మ ఎందుకు..?
విపరీతమైన ప్రచార కాంక్షతోనే వైసీపీ ప్రభుత్వం ఈ రాద్దాంతం చేస్తోంది. మన తల్లిదండ్రులు మనకు వారసత్వంగా ఇచ్చిన ఆస్తికి సంబంధించిన పట్టా పుస్తకాల్లో సీఎం ఫొటో ఎందుకు..? మనం కష్టపడి సంపాదించుకున్న భూముల్లో సర్వే చేసి రాళ్ళు పాతుతున్నారు. వాటిపై బొమ్మ ఏమిటి?  మా సొంత ఆస్తులపై నీ ఫొటోను ముద్రించాల్సిన అవసరం ఏమిటి..? అంటే ప్రజల ఆస్తులన్నీ పాలకుడి గుప్పిట్లో ఉన్నట్లు… అతను ఇచ్చేవాడు, మిగిలినవాళ్ళంతా చేయి చాచేవాళ్లు అనే ఉద్దేశంతో ఉన్నట్లు ఉన్నారు. నేను ఇచ్చేవాడిని.. మీరు తీసుకునేవాడిని.. అందరూ లోబడి ఉండాలనే మైండ్ సెట్ ఈ పాలకుడిది. రాజ్యాంగబద్దంగా ఆలోచన చేసే వారు ఎవరూ ఇలాంటి పనులు చేయరు. భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. అక్కడ ఆమోదం పొందక ముందే అందులోని అంశాలను అమలు చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవరి ఆస్తులు అయినా.. వారి కబంధ హస్తాల్లో పెట్టుకునేలా చట్టం చేశారు.

నీతి ఆయోగ్ ఓ మంచి ఆశయంతో భూ హక్కులకు సంబంధించిన యాజమాన్య నిర్ధారణ చేయాల్సిన ముసాయిదాను అన్ని రాష్ట్రాలకీ పంపింది. 2019 డిసెంబరులో దీన్ని చట్టం రూపంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి పంపింది. అప్పటి నుంచి ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదముద్ర పడటానికి ఎన్నో సవరణలు, ఇంకెన్నో ప్రయాసలు పడ్డారు. చివరిగా ప్రజలకు తమ సొంత ఆస్తులకే రక్షణ లేని విధంగా చట్టం తయారు అయిందని తెలుస్తోంది.

మొదట ఈ చట్టం గురించి నా దృష్టికి వచ్చినపుడు న్యాయవాదులకు కేసులు పోతాయనే నిరసనలు చేస్తున్నారనే మాటలు విన్నాను. వైసీపీ వాళ్ళు ఆ విధంగా చేశారు. అయితే కేవలం వారి గురించి కాకుండా ప్రజల గురించి పోరాటం చేస్తూ, వారిని చైతన్యవంతం చేయడానికి, భవిష్యత్తులో ఆస్తులకు రక్షణ లేకుండా చేసే ఇలాంటి చట్టాలను వ్యతిరేకించేందుకు అంతా ఏకం అవుతోంది.

ఏ ఆస్తి అయినా నాదే అన్నది వైసీపీ విధానం
కోర్టు పరిధిని దాటి కేవలం రెవెన్యూ అధికారులకు, రెవెన్యూ వ్యవస్థకు హక్కులు ఇస్తే ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంటుంది. శతాబ్దాలుగా ఉన్న న్యాయ వవస్థను కాదని, కొత్తగా ట్రిబ్యునల్స్ పేరుతో రెవెన్యూ వ్యవస్థకు అధికారం ఇస్తే నాయకులు దోచేయడం సులభతరం అవుతుంది. ఈ ఆలోచనతోనే వైసీపీ ఈ అసంబద్ధ చట్టాన్ని చేస్తున్నట్లు అనిపిస్తోంది. విశాఖలో రుషికొండను అడ్డగోలుగా దోచుకోవడం లాంటి చర్యలు భవిష్యత్తులో మరిన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.. ఏ ఆస్తిని అయినా నాది అని రాసేసుకునేలా, దీనికి కోర్టుల రక్షణను తీసేస్తున్నారు.

ఇది ప్రజలందరి సమస్య
ప్రజల భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారే ఈ చట్టం గురించి సగటు మనిషికి కూడా సులభంగా అర్ధమయ్యేలా చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ చట్టం వల్ల ఎంత తీవ్రమైన నష్టం జరగబోతుందో ప్రజలకు తెలియాలి. కేవలం ఇది న్యాయవాదుల సమస్య కాదు. ప్రజలందరి సమస్య.

సాధారణ పరిభాషలో చదువుకోలేని వారికి కూడా సంపూర్ణంగా అర్ధం అయ్యేలా ఈ చట్టంలోని విషయాలను వివరిస్తాను. వారిని చైతన్యవంతం చేస్తాను. ఈ చట్టం నూటికి నూరు పాళ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే చట్టం. ప్రజల ఆస్తుల రక్షణ కోసం నిస్వార్థంగా పోరాడుతున్న న్యాయవాదులకు జనసేన పక్షాన సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. రాజ్యాంగాన్ని కాదని, ప్రాథమిక హక్కులను పాలకులు హరించేలా చట్టాలు చేస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరూ దానిపై పోరాడాలి. సగటు ప్రజలకు ఎంత చెడు జరుగుతుందో చెప్పడానికి ప్రత్యేక సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాను. అవసరం అయితే న్యాయవాదుల కోరిక మేరకు గుంటూరు కోర్టుకు నేను వస్తాను. ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేద్దాం’’ అన్నారు.

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి: నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రతి వర్గం రోడ్డు మీదకు వస్తోంది. కోర్టులు వదిలి పోరాటంలోకి న్యాయవాదులు వచ్చారు. ప్రజల ఆస్తులకు రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా చట్టం తీసుకువచ్చింది” అన్నారు.

రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమైన చట్టం : న్యాయవాదులు
ఈ సమావేశంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఈవన సాంబశివ ప్రతాప్, విజయవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సోము కృష్ణమూర్తి, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పులివెళ్ళ వెంకట కోట సురేష్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాదులు ఈ చట్టం వల్ల ప్రజలకు కలిగే నష్టాలు, ఇబ్బందులను వివరిస్తూ ఈ చట్టం ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధమో తెలిపారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమైన చట్టం అని చెప్పారు. న్యాయవాదులు తెలిపిన అంశాలను పవన్ కళ్యాణ్ ఆసాంతం విని, సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రతి అంశాన్నీ నోట్ చేసుకున్నారు. చట్టం లోతులకు వెళ్లే కొద్దీ తీవ్రమైన విషయాలు ఉన్నాయని న్యాయవాదులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి తెలిపారు. న్యాయవాదులు చట్టంలో ఉన్న పలు కీలకమైన అంశాలు, సెక్షన్లను వివరించారు.

LEAVE A RESPONSE