Suryaa.co.in

Andhra Pradesh

తప్పు చేసింది… ప్రజల్ని మోసగించింది జగన్మోహన్ రెడ్డి

-తెదేపా, జనసేన, బిజెపి లు కలిసే ఉన్నాయి… మళ్లీ 15 రోజుల వ్యవధిలో కలిసే ఉన్నామని పునరుద్గాటించే అవకాశం
-షర్మిల వేరే పార్టీలో చేరితే మీ పార్టీలో వేరే వారు కుంపటి పెట్టినట్లు ఎలా అవుతుంది
-షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున 25 మంది వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే ఛాన్స్
-మూడు రాజధానుల సిద్ధాంతం చెల్లదన్న ధర్మాసనం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తప్పులన్నీ చేసింది… ప్రజల్ని మోసగించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైకాపా సర్వనాశనానికి తానే కారణమని తెలుసుకోకుండా ఇతరులపై రంకెలు వేస్తున్నారు. అది మంచిది కాదు. ఒంటరిగా కూర్చుని జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. అప్పుడైనా ఆయనలో పరివర్తన వస్తుందేమోనని చూడాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు అన్నారు.

జగన్మోహన్ రెడ్డి అహంకారం వల్లే రానున్న ఎన్నికల్లో వైకాపా దారుణంగా ఓడిపోబోతుంది . నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి , తమకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆయా వర్గాల ప్రజాప్రతినిధులు రోడెక్కి చెప్పుకునే పరిస్థితిని నెలకొందన్నారు . బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు ఇవ్వడం లేదని నేరుగా చెప్పకుండా, ఐఏఎస్ అధికారులతో మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి క్షమించరాని ఘోరమైన తప్పిదాన్ని చేస్తున్నారు. బస్మాసురుడి మాదిరిగా నెత్తిన చేయి పెట్టుకొని, వాళ్లు కుంపటి పెడుతున్నారు… వీళ్లు కుంపటి పెడుతున్నారు అంటే ప్రయోజనం ఏమిటని మండిపడ్డారు.

కాకినాడ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… తమ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. మీ చెల్లికి ఆస్తి ఇవ్వవద్దని ఎవరైనా చెప్పారా?, ఎంపీ సీటు ఇవ్వవద్దని ఇతరులు ఎవరైనా అన్నారా?? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఎన్నికల్లో చెల్లిని వాడుకొని ఆ తరువాత వదిలేసింది మీరేనని గుర్తు చేశారు. మధ్యలో ఎవరో చిచ్చు పెడుతున్నారని ఎలా అంటారంటూ నిలదీశారు. షర్మిల వేరే పార్టీలో చేరితే, అది మీ పార్టీలో ఎవరో పెట్టిన చిచ్చు ఎలా అవుతుందని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు .

కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు ఎలా అవుతుందన్న ఆయన, ఎవరో మీకు అన్యాయం చేసినట్లు ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. ప్రజలు బంగారు పళ్లెం లో కట్టబెట్టిన అధికారాన్ని కాల రాస్తున్నారు. అంతటితో సరి పెట్టకుండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోయడం ద్వారా దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. కాకినాడ సభలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అంటూ జగన్మోహన్ రెడ్డి తన రొటీన్ డైలాగులను వల్ల వేశారు. కొత్తగా ఏదైనా చెప్పారంటే అది మా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని చెప్పడమేనంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

తెదేపా, బిజెపిల కామన్ ఫ్రెండ్ జనసేన
తెదేపా, జనసేన కూటమిలో బిజెపి ఉంటుందా?, ఉండదా అన్న చర్చ సర్వత్రా కొనసాగుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తెదేపా, జనసేన కూటమితో బిజెపి కలిసి ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటుంటే, కొందరు మాత్రం ఉండొద్దని కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో జనసేన భాగస్వామిగా ఉంది. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. తెదేపాతో పొత్తు పెట్టుకుంటే ఎన్డీఏ కూటమిలో కొనసాగడానికి వీలులేదని బిజెపి నాయకత్వం పేర్కొనలేదు.

అదే సమయంలో తెదేపా నాయకత్వం కూడా, ఎన్డీఏ కూటమిలో కొనసాగితే మాతో పొత్తు కుదరదని ఎక్కడా కూడా చెప్పలేదు. ఈ మూడు పార్టీలు ఇప్పటివరకు చక్కటి సమన్వయంతో కొనసాగుతున్నాయి. ఒకరితో ఉన్న స్నేహాన్ని మరొకరు తమ సొంతం చేసుకుంటున్నారు. దీంతో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఎవరైనా చెప్పేవరకు ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నట్లే లెక్కని ఆయన తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తున్నామని ఈ మూడు పార్టీలలో ఏ పార్టీ నాయకత్వం కూడా చెప్పే అవకాశం లేదు

.జనసేన పార్టీ కామన్ లింకు ద్వారా కలిసి ఉన్న తెదేపా, బిజెపిలు రానున్న ఎన్నికల్లో కలిసే వెళ్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తాము కలిసి లేమని ఏ ఒక్క పార్టీ నాయకత్వమైన ఖండించే వరకు, ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నట్లేనన్న ఆయన, ఏ ఒక్క పార్టీ నాయకత్వం కూడా ఖండించే మూడ్ లో లేదన్నారు . రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు అనేది తద్యమని స్పష్టమయింది. ఇప్పటికే ఎవరు నెగ్గుతారో ప్రజలకు స్పష్టమైన అవగాహన ఏర్పడగా, ఎవరు దారుణంగా ఓడిపోబోతున్నారో కూడా అర్థమైంది.

ఈ మూడు పార్టీల మధ్య ఉన్న బంధం ఇలాగే కొనసాగుతుంది. ఎన్నికలు సజావుగా సాగడానికి, ఈ మూడు పార్టీల మధ్యనున్న బంధం ఎంతో ఉపయోగపడుతుంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడడం ఖాయం. అధోగతి పాలైన రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే, కేంద్ర సహాయ సహకారాలు ఎంతో అవసరం. మన రాష్ట్రాన్ని మనము అభివృద్ధి చేసుకోలేమా? అంటే చేసుకోగలం. కానీ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటే మరింత త్వరితగతిన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

తెదేపాలో చేరనున్న విజయసాయి సమీప బంధువు
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సమీప బంధువు చేరనున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. దీనితో వైకాపా ఎత్తిపోయిందోచ్ అని అర్థమవుతుంది. వైకాపా ఎలాగో అధికారంలోకి రాదని తెలిసిపోయినా రాయలసీమలోని ప్రముఖ రెడ్డి నాయకులు తెదేపా లో చేరబోతున్నారు . విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి రెండు రోజుల వ్యవధిలో తెదేపా కండువా కప్పుకోనున్నారు. ద్వారకానాథ్ రెడ్డి తండ్రి కూడా శాసనసభ్యులుగా పనిచేశారు.

రాయలసీమకు చెందిన నిజమైన రెడ్డి నాయకులకు భ్రమలు తొలిగి, ఆలస్యంగా నైనా నిజాలను గ్రహించి తెదేపాలో చేరాలని భావిస్తుండడంతో టిడిపి లో పరిస్థితి కల కల అన్నట్టుగా ఉండగా , వైకాపా పరిస్థితి విలవిలా అన్నట్టుగా ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. విజయవాడలో మల్లాది విష్ణుకు సీటు లేదని చెప్పారు. మరొక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్ కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన దళిత శాసనసభ్యుడైన ఎమ్మెస్ బాబుకు కూడా సీటు లేదని చెప్పడంతో… నేను ఏనాడు సొంతంగా నిర్ణయం తీసుకోలేదు. మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్లుగానే చేశాను. సొంతంగా నిర్ణయం తీసుకున్నది లేదు. నాలుగున్నర ఏళ్లుగా వారు చెప్పినట్లు నడుచుకున్న నాకు సీటు లేదు కానీ వారికి మాత్రం సీటు ఇస్తారా అంటూ ప్రశ్నించారు.

దళితుడైన నాకు అన్యాయం చేస్తారా అంటూ ఎమ్మెస్ బాబు తన నిరసన గళాన్ని జగన్మోహన్ రెడ్డికి వినిపించారు. ఈ సంఘటన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ పచ్చి అబద్దాలను చెబుతున్నారని అర్థమయింది. అలాగే మరొక దళిత నాయకుడైన డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని పార్టీ నాయకులను కోరారు. రెండుసార్లు నియోజకవర్గ ఇన్చార్జిగా నన్ను నియమించి, తొలగించడం జరిగిందన్న ఆయన, ఎందుకు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారో, ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదన్నారు.

ఒక దళిత నాయకుడు, మాజీ మంత్రి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరడం కంటే దౌర్భాగ్యం మరేముంటుందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. ఇక పెనమలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల మనసులను గెల్వగలిగాను కానీ, ముఖ్యమంత్రి మనసును గెలుచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆయన చూపుకు కూడా నోచుకోలేకపోతున్నానని పార్థసారధి పేర్కొనడం పరిశీలిస్తే బీసీ శాసనసభ్యులు ఎంత అవమానానికి గురవుతున్నారో, ఇట్టే అర్థమవుతుంది.

దళిత, బిసి శాసనసభ్యులు తమకు జరుగుతున్న అవమానాలను రోడ్డెక్కి ఏకరువు పెడుతున్నారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, వీరంతా నా వర్గం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కనీసం వారిని పలకరించకపోవడం దారుణం. పలకరిస్తే పులకరించిపోయే జనం కదా వీరు. పిలిపించుకొని మాట్లాడితే పులకరించి పోయి నీ గురించి మంచిగా మాట్లాడుతారు కదా అంటూ రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. నాలుగేళ్ల క్రితమే నేను ఈ విషయాన్ని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి అహంకారి. ఎవరిని కలవరు… ఎవరితోనూ మాట్లాడరని చెబితే, కొంతమంది మేము జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడడం లేదా అంటూ వెధవ ఫోజులు కొట్టారు. నన్ను డిస్ క్వాలిఫై చేయాలని పార్లమెంట్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అందరికీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అర్థమయిందన్నారు.

ఇంటర్ డిస్ట్రిక్టే కాదు ఇంటర్ స్టేట్ బదిలీలు చేస్తున్నారు
ఎమ్మెల్యేలను, ఎంపీలను వైకాపా నాయకత్వం ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీలే కాకుండా ఇంటర్ స్టేట్ బదిలీలను చేస్తోందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. అనకాపల్లి శాసనసభ్యుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానాన్ని ఇతరులకు కేటాయించారు. గుడివాడ అమర్నాథ్ ను ఎక్కడికి బదిలీ చేస్తారో ఇంకా తెలియదు. ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీలతోపాటు ఇంటర్ స్టేట్ బదిలీలను కూడా చేస్తున్నారు. బళ్లారి కి చెందిన శాంతి కి హిందూపురం లోక్ సభ స్థానాన్ని కేటాయిస్తున్నట్లు తెలిసింది. కోనసీమ జిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణును రాజమండ్రి కి ట్రాన్స్ఫర్ చేశారు. దళితుడైన, బాబురావు పదవి త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయనకు సీటు లేకుండా చేశారు. దళితులు, బీసీల గురించి ఎంతో గొప్పగా చెప్పే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

సమిష్టి నాయకత్వంలో అద్భుత రాజధానిగా అమరావతి
సమిష్టి నాయకత్వంలో అద్భుత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దనున్నారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త ఏమిటంటే… మూడు రాజధానుల సిద్ధాంతం చెల్లదని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆపిల్ కు వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అత్యంత నిరాశే ఎదురయింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు దాఖలైన పిటీషన్ ను ఏప్రిల్ కు వాయిదా వేశారు.

అప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోనుంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును రాబోయే ప్రభుత్వం శిరసా వహిస్తుంది. అప్పటికి సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నప్పటికీ అది చెల్లదు. ఒకవేళ సుప్రీంకోర్టు పిటిషన్ టేకప్ చేసినప్పటికీ, హైకోర్టు తీర్పు చెల్లుతుందని చెప్పేవారు. తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం కోర్టు తీర్పును శిరసా వహిస్తుంది. అమరావతిని అద్భుత రాజధానిగా సమిష్టి నాయకత్వంలో తీర్చిదిద్దుతుంది.

ఐదేళ్లు ఆలస్యం అయినప్పటికీ, జరగరాని డ్యామేజ్ జరిగినప్పటికీ, రెట్టించిన ఉత్సా హం తో అమరావతి అభివృద్ధికి కృషి చేస్తుంది. అలాగే రాయలసీమను రతనాల సీమగా, విశాఖపట్నం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. విజన్ 2047 లో భాగంగా అమరావతి నగరాన్ని ప్రపంచ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దే విధంగా ముందుకు వెళ్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

LEAVE A RESPONSE