Suryaa.co.in

Andhra Pradesh

అమ్మ ఒడి అకౌంట్ లో డబ్బులు మాయం

-తస్మాత్ జాగ్రత్త..
– అమ్మఒడి, చేయూత డబ్బులు వేస్తామని కాల్‌
– కట్‌చేస్తే..ఎకౌంట్ లో డబ్బులు మాయం
– కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పోలీసులు

టెక్నాలజీ అప్డేట్ అయినట్టుగానే.. సైబర్ క్రిమినల్స్ కూడా అదే రేంజ్‌లో అప్డేట్ అయిపోతున్నారు. రోజుకో స్టైల్లో మోసాలు చేస్తూ జనాలను నిలువునా ముంచేస్తున్నారు క్రిమినల్స్.

తమ నేరాలకు అవసరమైన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని ఒకసారి.. లక్కీ లాటరీ తగిలిందని మరోసారి.. ఓటిపి చెప్పమని.. ఇలా మాయమాటల్లో పెట్టి ఇంకోసారి ఖాతాలు కొల్లగొట్టడం కామన్ గా మారిపోయింది.

కానీ ఇప్పుడు.. ఏకంగా నిత్యం టచ్ లో ఉన్న వారితోనే కాల్ కాన్ఫరెన్స్ పెట్టి మరి.. మిమ్మల్ని నట్టేట ముంచేస్తున్నారు.

విశాఖలో తాజాగా జరిగిన ఘటన కలకలం రేపింది. పేదల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన పథకాలను ఆశ చూపి.. పెద్దమొత్తంలో డబ్బును గుంజేశారు. ప్రభుత్వం.. పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందరికీ అందేలా ప్రణాళికలు రూపొందించి.. క్షేత్రస్థాయిలో అందిస్తోంది. అందుకోసం సచివాలయ వ్యవస్థను, వాలంటీర్లకు సాయంతో ఎప్పటికప్పుడు పథకాలు అందిస్తుంది ప్రభుత్వం.

ఏ కారణం చేతనైనా ఆగినా.. లబ్ధిదారుల అభ్యర్థనతో మరోసారి వెరిఫై చేసి మళ్ళీ ఆ పథకాలను వర్తింపజేసేలా చేస్తున్నారు. ఇప్పుడిదే సైబర్ నేరగాళ్లకు అస్త్రంగా మారిపోయింది.

పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వాలంటీర్స్ కు కాన్ఫరెన్స్ కాల్ కలిపి లబ్ధిదారుల ట్రాప్ చేశాడు ఓ క్రిమినల్. తాను అమరావతి హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నానని వాలంటీర్ కు కాల్ కలిపి.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలు అందని వారి వివరాలు అడిగాడు. అందులోనూ గతంలో పథకాలు అంది.. ఇప్పుడు వాటికోసం వేసి చూస్తున్న వారిని ఎంచుకున్నాడు.

వాలంటీర్ సాయంతో కాన్ఫరెన్స్ కాల్ ఆ లబ్ధిదారుడికి కలిపి.. ట్రాప్ చేశాడు. మధ్యలో వాలంటీర్ కాల్ కట్ చేసి.. మళ్లీ అమ్మఒడి, చేయూత లాంటి స్కీమ్స్ వర్తింప చేస్తానని నమ్మబలికాడు. అందుకు తాము పంపిస్తున్న లింకులో వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలని కోరాడు. ఒక్క లింకు క్లిక్ చేస్తే ఎకౌంట్లో నగదు జమ చేసి పథకాలను వర్తింప చేస్తామని మాయ చేశాడు.

నిజమే అనుకున్న బాధితుడు.. వచ్చిన లింకును క్లిక్ చేసి వివరాలతో పాటు యుపిఐ ఐడి పిన్ సబ్మిట్ చేశాడు. దీంతో క్షణాల్లోనే.. ఖాతాలో నగదు జమ అవుతుందని అనుకున్న ఆ బాధితుడికి గుండె ఆగేంత పని అయింది.

ఎందుకంటే ఖాతాలో నగదు పడలేదు సరి కదా.. అతని ఖాతాలో ఉన్న లక్ష రూపాయలు ఖాళీ అయ్యాయి. దీంతో మోసపోయారని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సిపి రవిశంకర్ అయ్యనార్ ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. సైబర్ క్రైమ్ సీఐ ఉమామహేశ్వరరావు నేతృతంలో ప్రత్యేక బృందాన్ని రంగాల్లోకి దింపి.. ప్రభుత్వ పథకాలు పేరుతో జనాలను డ్రాప్ చేస్తూ దోచుకుంటున్న సైబర్ క్రిమినల్స్ ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు.

దీంతో.. కాకినాడ పెద్దాపురం కు చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడిని ట్రాక్ చేసిన నిందితుడుగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశారు. అయితే.. ఢిల్లీ కేంద్రంగా మోసాలు జరుగుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు.

LEAVE A RESPONSE