Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ రాహువు తొలగే సమయం వచ్చేసింది

  • కూటమి కొత్త ఉషస్సులు తీసుకొస్తుంది
  • గత అయిదేళ్లలో జరిగిన వైసీపీ విధ్వంసాన్ని గుర్తు చేసుకొని రాబోయే 24 గంటల్లో ఆలోచించి ఓటేయండి
  • ఇది మార్పునకు సమయం.. రాష్ట్ర భవిష్యత్తును లిఖించుకొనే సమయం
  • అయిదేళ్లలో ఏమీ చేయని జగన్ ఓట్ల కోసం నాటకం ఆడుతున్నాడు
  • వైసీపీ వస్తే ప్రజల ఆస్తులన్నీ కాజేస్తారు
  • కాకినాడను శాంతివనంగా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది
  • కాకినాడలో వారాహి విజయభేరీ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ 

‘అయిదేళ్ల విలువైన కాలాన్ని ప్రజలంతా ఇస్తే ఏం చేయలేని జగన్.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వ నాశనం చేసిన జగన్ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏదో చేస్తానని చెబుతున్నాడు. ఎన్నికల వేళ ఓట్ల కోసం రకరకాల మాటలు తియ్యగా చెబుతున్నాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అభివృద్ధిలో అట్టడగు స్థానానికి తీసుకెళ్లిన ఈ వైసీపీ నాయకుడికి ఇప్పటికే ఓటమి అర్ధమయింద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, ప్రజలకు కనీస భద్రత లేకుండా శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసి, ఆఖరికి ప్రజల ఆస్తులను లాక్కోవడానికి కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్న ఈ ముఖ్యమంత్రి పాలనపై సగటు ప్రజలు ఎదురు తిరిగి తీర్పు చెప్పే సమయం వచ్చింది అన్నారు. రాబోయే 24 గంటల్లో వైసీపీ చేసిన దుర్మార్గ పాలనను ఓటర్లు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎన్ని దాష్టీకాలకు తెగబడ్డాడో, అన్ని రంగాలను, వర్గాలను ఎంతలా ఇబ్బందిపెట్టాడో అన్ని ఆలోచించి 13వ తేదీ ఉదయం ఓటు వేయండని కోరారు.

కాకినాడలో శనివారం సాయంత్రం జరిగిన వారాహి విజయభేరీ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కాకినాడ లోక్ సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి  వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ అభ్యర్థి  పంతం నానాజీలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘కాకినాడలోనే కాకుండా రాష్ట్రంలో జరిగిన అయిదేళ్ల విధ్వంస పాలన మీద రాబోయే 24 గంటల్లో ప్రజలంతా చర్చించాలి. దుర్మార్గాల గురించి ఆలోచించాలి. అప్పుడే బలంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేయాలి.

మన భవిష్యత్తు కోసం మనం వేసుకునే ఓటు
2019లోనే నేను రాష్ట్ర ప్రజలను హెచ్చరించాను. జగన్ కు ఓటు వస్తే జరిగే దుర్మార్గాలను చెప్పాను. కాని ప్రజలంతా వైసీపీకి అప్పట్లో ఓటు వేసి, గత అయిదేళ్లుగా ఎంత నష్టపోయామో ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఈసారి అలా కాకుండా సగటు ప్రజలు ఆలోచించాలి. ప్రజలు వేసే ఓటు రాష్ట్రం కోసం… మన భవిష్యత్తు కోసం అనేది గుర్తుపెట్టుకోండి. నేను రాజకీయాలు పదవుల కోసం చేయలేదు. నా నేల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను. పరాజయం పొందినా నిలబడ్డాను. ప్రజలంటే ఉన్న ప్రేమ, అభిమానం మాత్రమే నన్ను నడిపించాయి.  గత దశాబ్ద కాలంగా ఎలాంటి పదవులు లేకున్నా, బలంగా మీ కోసం పోరాడుతున్నాను. మీరు కూడా ఈ రౌడీ రాజ్యంపై పోరాడాల్సిన సమయం వచ్చేసింది. ప్రజల కోపాన్ని బలంగా ఓట్లు రూపంలో చూపించి, ఈ వైసీపీ పాలకులకు బుద్ధి చెప్పాలి.

కోర్డులను అనుమతి అడిగే వ్యక్తి మనకొద్దు
విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి అడిగే నేరస్తుడు మా ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు మనం సిగ్గుపడాలి. జగన్ రాజకీయాలు మాట్లాడతాడు కాని.. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయితే పట్టించుకోడు. ఒక్క మాట మాట్లాడడు. గంజాయి అమ్మే వ్యక్తులు అతడి చుట్టూ ఉంటే ఏం మాట్లాడతాడు..? 25 కార్మిక యూనియన్ల నాయకుల్ని మాట్లాడకుండా భయపెట్టిన నియంత జగన్. రౌడీరాజ్యం, గంజాయి మాఫియా, అడిగిన వారిపై పోలీసుల కేసులు, అడ్డుపడితే హత్యలు చేయించిన వైసీపీ పాలకులపై జనం తిరగబడే రోజు వచ్చింది.  కాకినాడ ను రౌడీలకు మాఫియా చేశారు. గంజాయి అడ్డా అయింది. రేషన్ బియ్యం అమ్ముకునే హబ్ అయింది. డీజిల్ అమ్మకునే బ్యాచ్ ల ప్రాంతం అయింది. బ్లేడ్ బ్యాచ్ లతో ప్రజల్ని బెదిరించే అడ్డాగా మారింది. పేకాట క్లబ్బులు, మడ అడవుల ధ్వంసం చేసిన వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్లినా ఈ ద్వారంపూడి చెడు పాదముద్ర ఉంటుంది. మైనింగ్, బియ్యం, కబ్జాల ముద్ర ఉంటుంది. అలాంటి వ్యక్తి మిమ్మల్ని పాలించే వాడు కాకూడదు. క్రిమినల్స్ రాజ్యాలు ఏలితే కాకినాడలాగానే ఉంటుంది.

వైసీపీ దాష్టీకాలను ఎదుర్కొంటూ జనసేన బలంగా నిలబడింది
గత అయిదేళ్లలో వైసీపీ దాష్టీకాలకు జనసేన బలంగా నిలబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి మరీ బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చానంటే ప్రధానమంత్రితో ఎంత బలంగా నిలబడ్డానో, రాష్ట్రం కోసం ఎంత తపించానో ఆలోచిచండి. నేను ఎంతగా రాష్ట్రం కోసం ఆలోచించానో ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజలు కూడా బలంగా నిలబడాలి.

జనసేనలాంటి సింహం బయటకు వస్తే వైసీపీలాంటి అడవి దున్నలు ఎలా పారిపోతాయే అలా ఉంటాం. నేను ఒక ఎన్నిక కోసం ఆలోచించడం లేదు. ఓ తరం కోసం పోరాటం చేస్తున్నాను. మార్పు కోసం ఓటు అడుగుతున్నాను. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ప్రజలకు స్వేచ్ఛ, భద్రత కల్పించే పాలన తీసుకొస్తాం. ఆఖరి శ్వాస ఉన్నంత వరకు జనసేన వేదికగా ప్రజలకు  బలంగా నిలబడతాను. దేశం వదిలి వెళ్లడానికి కోర్టు పర్మిషన్ అడిగే నేరస్థుడి ఫొటో మన పాస్ పుస్తకాల మీద ఎందుకు..? అలాంటి వ్యక్తి వస్తే ఎంతటి విధ్వంసం చేస్తాడో ఆలోచించండి.  ఇది మార్పు సమయం. కూటమి ప్రభుత్వంలో కాకినాడను శాంతివనంగా తయారు చేస్తాం. మాఫియాను ఉక్కుపాదంతో తొక్కేస్తాం. విద్య, వైద్యం, ఉపాధి, తాగు, సాగునీరు, శాంతిభద్రతలు ప్రాధాన్యం అంశాలుగా పనిచేస్తాం. అభివృద్ధితో కూడిన సంక్షేమం మా విధానం. రౌడీలు రాజ్యాలు ఏలుతున్నారంటే ప్రజలది తప్పు. మనమంతా ఒక్కటై  ఈ రౌడీ రాజ్యాన్ని తరిమికొట్టాలి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండబాబుకి సైకిల్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాసు గుర్తుపై ఓటేయండి’’ అని కోరారు.

LEAVE A RESPONSE