Suryaa.co.in

Andhra Pradesh

బాధ్యత లేని అన్నలు చాలామందే ఉన్నారు

-ఆస్తిలో వాటా ఆడబిడ్డ హక్కు..ఆ బిల్డప్‌ ఎందుకు?
-కొసరు ఇచ్చి అప్పు ఇచ్చినట్లు చూపిస్తారు

-జగన్‌ అప్పుపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు
-వివేకాపై వైసీపీ వికృత చర్యలపై మండిపాటు
-ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడుతున్నామని వెల్లడి
-కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రచారంలో ఆమె తన నామినేషన్‌ సందర్భంగా అఫిడవిట్‌లో చూపిన జగన్‌కు అప్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు. నాకు జగన్‌ అప్పు ఇచ్చారు.. అది నేను అఫిడవిట్‌లో చేర్చాననే అంశంపై చెబుతున్నా. సమాజంలో నిజానికి చెల్లెలికి ఏ ఆన్న అయినా వాటా ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు..అన్నగా, మేనమామగా కూడా బాధ్యత ఉంది. తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామ…ఇది సహజంగా అందరూ పాటించే నియమం. కొందరు చెల్లెళ్లకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమ వాటాగా భావిస్తారు..తామేదో చెల్లెళ్లకు గిఫ్ట్‌గా ఇస్తున్నామని బిల్డప్‌ ఇస్తారు. ఇలాంటి వాళ్లు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క కొసరు చెల్లెళ్లకు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారు. ఇది వాస్తవం.. ఇది కుటుంబం మొత్తం తెలుసు…దేవుడికి తెలుసని వ్యాఖ్యానించారు.

వివేకా పర్సనల్‌ లైఫ్‌ను తప్పుగా చూపిస్తున్నారు
వివేకా వ్యక్తిగత జీవితాన్ని తప్పుగా చూపిస్తున్నారు. ఇవి వికృత చర్యలు..దారుణం. ఆయన సుదీర్ఘ రాజకీయ నాయకుడు. ఆయన సేవలు మీరు వాడుకున్నారు. అప్పుడు లేని పర్సనల్‌ లైఫ్‌ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఆయనను తప్పుగా చేసి చూపించడం సరి కాదు..వైసీపీ నేతలకు చెబుతున్నాం.. ఇది కరెక్ట్‌ కాదు…మీకు ఇది తగదని హితవుపలికారు. ప్రజా తీర్పులో అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఎన్నికల్లో ప్రచారం కోసం వివేకా హత్యను వాడుతున్నాం అనేది కరెక్ట్‌ కాదు. నిందితులకు శిక్ష పడి అంటే మేము రోడ్ల మీదకు వచ్చే వాళ్లం కాదు. సునీత రోడ్ల మీదకు వచ్చి న్యాయం కోసం కొంగుచాపేది కాదు. సీబీఐ హత్యను అవినాష్‌ రెడ్డి కాకుండా వేరే వాళ్లు చేయించారని చెప్పలేదు కదా? ఎవరు ఏమన్నా మేము ఆస్తుల కోసం, పదవుల కోసం కాదు న్యాయం కోసం నిలబడ్డామని తెలిపారు.

మాకు, పిల్లలకు ఏమవుతుందో ఆలోచించలేదు
సునీత కుమిలిపోతోంది. వివేకాను గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. హత్యను మభ్య పెట్టాలని చూస్తున్నారు. తెగించి న్యాయం కోసం నిలబడ్డాం. రేపు మాకైనా, మా పిల్లలకైనా ఏమవుతుందో తెలియదు. మొండిగా పోరాటం చేస్తున్నాం. నాకు చంద్రబాబుతో అవసరం లేదు. ఆయన స్పీచ్‌లు అవసరం లేదు. నేను వైఎస్‌ఆర్‌ బిడ్డను. వేరొకరి స్పీచ్‌ పట్టుకుని చదవాల్సిన అవసరం లేదు..ఆయనతో మాకు పనిలేదని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE