ఏపీలో శాంతి లేదు… భద్రతా రాదు

– ప్రతీ 10 గంటలకు ఒక హత్య, 20 చోట్ల ఆర్థిక నేరాలు, ప్రతి పన్నెండు గంటలకు ఒక కిడ్నాప్
– నేను వేసిన కేసు కోర్టు విచారణ జరుగుతుందో లేదో
– అక్రమ రవాణాలో ఆంధ్ర ది రెండవ స్థానం
– నేరాల పెరుగుదల 63 శాతానికి చేరుకుంది
– ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్వానంగా ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. అక్రమ మద్యం అమ్మకాలు, ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా లభిస్తోన్న గంజాయి వల్లే రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని అన్నారు. ప్రజలకు శాంతి భద్రతలను కల్పించలేని ప్రభుత్వం, ప్రభుత్వమే కాదంటూ ఆయన మండిపడ్డారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయన్నారు.

ఒకవేళ ఏదైనా సంఘటన జరిగినా, అక్కడి పోలీసు యంత్రాంగం వేగంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి మూడు హత్యలు, ఆరు మానభంగాలు అన్నట్లుగా తయారయిందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూములు ఉండేవని, దానితో మద్యం ప్రియులు అక్కడే మద్యం సేవించి ఇంటికి బయలుదేరి వెళ్ళే వారన్నారు.

కానీ తమ ప్రభుత్వం వచ్చాక మద్యనిషేధం లో భాగంగా మద్యం ఆదాయాన్ని మూడింతల పెంచుకుంటూనే, పర్మిట్ రూములను ఎత్తివేయడం జరిగిందన్నారు. దీనితో, మద్యం కొనుగోలు చేసిన వారు నేరుగా ఇంటికి వెళ్లకుండా, నిర్జన ప్రదేశాలలో మద్యం సేవించి, ఆ బాటిళ్లను వ్యవసాయ భూముల్లో, ఖాళీ ప్రదేశాలలో పడేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ పొలాల్లోకి దిగిన రైతులకు, కూలీలకు మద్యం బాటిళ్లు కాళ్ళ కుచ్చుకుని, వారు మూడేసి నెలలపాటు మంచాన పడే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేపల్లె అత్యాచార ఘటన నిర్జన ప్రదేశాలలో మద్యం సేవించిన వారి పనేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

నిర్జన ప్రదేశాలలో, జన సాంద్రత తక్కువ ఉండే ప్రాంతాలలో మద్యం సేవించేవారు అటుగా వెళ్తున్న ఒంటరి మహిళ పై, జంటగా వెళ్తున్న భార్యాభర్తలపై దాడులు చేసి, హత్యాచారాలకు ఒడిగడుతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల లో 2019లో ఆంధ్ర ప్రదేశ్ పదవ స్థానం లో ఉండగా, 2020 లో ఎనిమిదవ స్థానానికి చేరుకుందని చెప్పారు.
ప్రస్తుతం రెండు, మూడవ స్థానాల్లో కొనసాగుతూ.. ఉంటుందన్న రఘు రామ, ఇంకా గణాంకాలను నేషనల్ క్రైమ్ బ్యూరో అప్డేట్ చేయలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా పని ప్రదేశాలలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలలో ఆంధ్ర ప్రదేశ్ రెండవ స్థానంలో ఉందని అన్నారు. ఒక భౌతిక దాడుల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ కొనసాగుతోందని అన్నారు.

2019 తో పోలిస్తే రాష్ట్రంలో నేరాల పెరుగుదల 63 శాతానికి చేరుకుందని చెప్పారు. జాతీయస్థాయిలో నేరాల పెరుగుదల రేటు శాతంతో పోల్చిచూస్తే రాష్ట్రంలో లో 28 శాతం ఎక్కువగా నేరాల పెరుగుదల రేటు ఉన్నదన్నారు. 2019 లో అత్యధిక నేరాలు జరిగిన రాష్ట్రాలలో 12వ స్థానంలో ఉన్న ఏపీ, ఏడాది తిరిగే సరికి 9వ స్థానానికి చేరుకుందని ఎద్దేవా చేశారు.

దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్ర ప్రదేశ్ ఐదవ స్థానంలో కొనసాగుతుందన్నారు. మానవ అక్రమ రవాణా లో ఆంధ్ర ప్రదేశ్ రెండవ స్థానంలో కొనసాగుతోందని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. జగన్ రెడ్డి రాజ్యంలో ప్రతి రెండు ఎనిమిది గంటలకు ఒక రెప్, ఎనిమిదేళ్ల బాలికపై ప్రతి 12 గంటలకు ఒక అత్యాచారం… ప్రతీ గంటకు ఇద్దరు మహిళలపై దాడులు… ప్రతి మూడు గంటలకు దళితులపై దాడులు జరుగుతున్నాయన్న ఆయన, ప్రతీ 10 గంటలకు ఒక హత్య, 20 చోట్ల ఆర్థిక నేరాలు, ప్రతి పన్నెండు గంటలకు ఒక కిడ్నాప్ జరుగుతున్నాయన్నారు..

ఇక దేశంలో పోలీసులపై కేసుల నమోదులో ఆంధ్ర ప్రదేశ్ మూడవ స్థానంలో ఉందని, 2022 లో అత్యధిక లాక్ అప్ డెత్ సంఘటనలు చోటు చేసుకున్నది కూడా ఆంధ్రప్రదేశ్ లో నేనని వివరించారు. ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యం కారణంగానే మహిళలు వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడుతు న్నారన్న ఆయన, 2019లో తప్పిపోయిన వారి సంఖ్య 14 వేల పైచిలుకేనని, ఇందులో రెండు వేలకు మంది బాలలు ఉన్నారని వెల్లడించారు. తప్పి పోయిన వారిని వెతికి పట్టుకోవడం లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఘోరంగా వైఫల్యం చెందుతున్నారన్న ఎస్ ఆర్ బీసీ, మాయమైన వారు ఏమయ్యారని ప్రశ్నించిందని చెప్పుకొచ్చారు.

వారు బ్రతికే ఉన్నారా?, లేకపోతే చనిపోయారా?,వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నారా ??అంటూ ప్రశ్నించిందన్నారు. ఈ నేరాలన్నిటికీ అక్రమ మద్యం విక్రయాలు, పర్మిట్ రూములు లేకపోవడమే కారణమని పలువురు విశ్లేషించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎలాగు అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదన్న ఆయన, గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే సంక్షేమ కార్యక్రమాలు కూడా తక్కువేనని చెప్పారు. మరి ప్రభుత్వ ఆదాయం, తెచ్చిన అప్పుల సొమ్ము ఏమౌతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తోంది… ఎంతో చెప్పాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి, పక్కన ఐదు తీసివేస్తే 17 స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులకు అక్కడ అక్కడ రెండు మూడు రోజుల్లో జీతాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని తెలిసిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఒకటో తేదీన బెనిఫిట్స్ ఇవ్వకుండా, ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే హక్కు ఎక్కడిదని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. చెత్త పనులు సకాలంలో చెల్లించకపోతే, ఇంటి ముందు చెత్త తెచ్చి వేస్తానని చెబుతున్న ప్రభుత్వం, కరెంటు బిల్లులు కట్టకపోతే, విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరికలు చేస్తున్నా సర్కారు… ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపొతే వారు ఏమి చేయాలో చెప్పాలని నిలదీశారు.

సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు జీతాలు, బెనిఫిట్స్ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అంటూ రఘు రామ సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు చక్కటి పరిపాలన అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం … పరిపాలన అందించే బాధ్యత తప్ప, అన్నీ చేస్తోందంటూ ఎద్దేవా చేశారు.. చౌక ధర దుకాణాలలో బియ్యం తప్ప, సబ్సిడీపై ఏ ఒక్క నిత్యావసర వస్తువు పంపిణీ చేయడం లేదన్న ఆయన, గత ప్రభుత్వమే నయమని కనీసం సబ్సిడీపై పప్పు , పంచదార పంపిణీ చేసే వారన్నారు. రంజాన్ పండుగ సమయం ముస్లిములకు రంజాన్ తోఫా కూడా బహూకరించే వారని గుర్తు చేశారు.

అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన హోం మంత్రిని నిలదీసి నందుకు ప్రతిపక్ష మహిళా నాయకురాళ్లను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం మే ఫ్రెండ్లీ పోలీసింగా అంటూ రఘు రామ ప్రశ్నించారు. వివేక హత్య కేసులో నిందితుల బెయిలు విచారణ అంశంపై తాను కూడా ఇంప్లీడ్ అవుతానని ఆయన కూతురు సునీతారెడ్డి కోరిక సమంజసమేనదేన ని ఈ మేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయని, తీర్పు కాపీ ప్రతులను మీడియాకు రఘురామ చూపించారు. అలాగే ఒక ఒక బెంచ్ పై బెయిలు పిటిషన్ రద్దు చేసినప్పుడు, తిరిగి సదరు ముద్దాయిలు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే అదే బెంచ్ కేసు విచారించేలా చర్యలు చేపట్టాలన్నారు.

కానీ వివేకా హత్య కేసు ముద్దాయిల బెయిలు కేసు విచారణ ను మరొక బెంచ్ కు బదలాయించడం విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఇక తన పై ఐపీఎస్ అధికారి ఇ సునీల్ కుమార్ అక్రమంగా దాడి చేసిన ఘటన కేసు , ఏడాది కావస్తుందని అన్నారు. అయినా కేసు విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.. తనకు వ్యవస్థలపై సంపూర్ణ గౌరవం ఉందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని చెప్పుకొచ్చారు.

Leave a Reply