– వైఎస్సార్సీపీ నాయకుడు వంగవీటి నరేంద్ర
తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీస్ వ్యవస్థను ప్రయోగించి అక్రమ కేసులతో వేధించడం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వైఎస్సార్సీపీ నాయకుడు వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఎక్కడా టీడీపీకి తగినంత బలం లేకపోయినా రెడ్ బుక్ పాలనతోనే అభ్యర్థులను బెదిరించి విజయం సాధించిందని చెప్పారు. డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా ప్రలోభాలకు లొంగని వైఎస్సార్సీపీ అభ్యర్థులను తప్పుడు కేసులతో వేధించి దారికి తెచ్చుకుంటోందని, కూటమి నాయకుల అప్రజాస్వామిక విధానాలపై హైకోర్టును ఆశ్రయించడంతో తిరుపతి, తునిలో ఉప ఎన్నిక వాయిదా పడిందని వివరించారు.
ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింస, అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని నరేంద్ర వెల్లడించారు. తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, హామీలు అమలు చేయలేక 8 నెలలకే చేతులెత్తేసిందని, ప్రజలు సైతం కూటమి మోసాలను ఇప్పటికే గ్రహించి బయటకొచ్చి మాట్లాడుతున్నారని చెప్పారు. ఇంకొన్నాళ్లు ఆగితే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేని పరిస్ధితి ఎదురుకావడం ఖాయమని స్పష్టం చేశారు.