Suryaa.co.in

Andhra Pradesh

పేదోళ్లకు పథకాలు ఆపమంటున్నారు.. ఆపేయమంటారా?

– వరుసగా మూడో ఏడాది –వైఎస్సార్‌ సున్నావడ్డీ (మహిళలు)
– రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,02,16,410 అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన రూ.1,261 కోట్ల వడ్డీని వారి తరపున పొదుపు సంఘాల అక్కచెల్లమ్మల బ్యాంకు ఖాతాల్లో ఒంగోలులో బటన్‌ నొక్కి నేరుగా జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.
– నేడు అందిస్తున్న రూ.1,261 కోట్లతో కలిపి వైఎస్సార్‌ సున్నావడ్డీ క్రింద ఇప్పటివరకు వైయస్‌.జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.3,615 కోట్లు

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:
మన ఇంటి దీపాలకు నా అభినందనలు
నా ఎదుట ఉన్న మన ఇంటింటి దీపాలకు, మన సాధికారత సారధులకు, బాధ్యతల ప్రతిరూపాలకు, తమ రెక్కల కష్టంతో పిల్లలను పెంచుకుంటూ కుటుంబాలను నిలబెడుతున్న మణిమాణిక్యాలకు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి చరిత్రను సువర్ణాక్షరాలతో తిరగరాస్తున్న నా అక్కచెల్లెమ్మలందరికీ మీ అన్నగా, తమ్ముడిగా మీ జగన్‌ నిండు మనస్సుతో నిండు మనస్సుతో రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

ఈ ఒక్క పథకానికే మూడేళ్లలో రూ.3615 కోట్లు..
బ్యాంకుల నుంచి పొదుపు సంఘాలుగా రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన నా అక్కచెల్లెమ్మలందరికీ వైఎస్సార్‌ సున్నావడ్డీ రుణాల పథకాన్ని అమలుచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తూ.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చెల్లించాల్సిన రూ.1261 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమంలో బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు అకౌంట్లలోకి ఈ ఒంగోలులో ప్రారంభించడానికి మీ మధ్యకు వచ్చాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది సున్నావడ్డీ కింద ఏప్రిల్‌ 2020లో రూ.1258 కోట్లను చెల్లించాం. రెండవ ఏడాది చెల్లించాల్సిన సున్నావడ్డీ కింద 2021 ఏప్రిల్‌లో మరో రూ.1100 కోట్లు మన ప్రభుత్వం ప్రతి అక్కచెల్లెమ్మ అకౌంట్లలో జమ చేసింది.

ఇప్పుడు వరుసగా మూడో ఏడాది 2022 ఏప్రిల్‌లో ఈరోజున ఇదే ఒంగోలు నుంచి డ్వాక్రా పొదుపు సంఘాలకు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు వైయస్సార్‌ సున్నావడ్డీ పథకానికి రూ.1261 కోట్ల రూపాయలు ఈకార్యక్రమం పూర్తిన వెంటనే నేరుగా జమ చేస్తున్నాం. దీనివల్ల 1,02,16,410 మంది నా అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. మొత్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైయస్సార్‌ సున్నావడ్డీ అన్న ఒక్క పథకానికే ఈ మూడు సంవత్సరాల కాలంలో క్రమం తప్పకుండా ప్రతి అక్క,చెల్లెమ్మకు భరోసా ఇస్తూ… అన్న నాకు తోడుగా ఉంటాడు, కచ్చితంగా సున్నావడ్డీ డబ్బులు నా బ్యాంకు అకౌంట్లో పడతాయని నమ్మకం కలిగిస్తూ.. ఈ మూడేళ్లలో రూ.3615 కోట్లు ఈ ఒక్క పథకానికే అందజేశాం.

వడ్డీలనూ తగ్గించాం…
అంతేకాకుండా బ్యాంకులతో కూడా మాట్లాడాం. గతంలో అక్కచెల్లెమ్మల నుంచి పన్నెండున్నర, పదమూడున్నర శాతం వడ్డీలు బ్యాంకులు వసూలు చేస్తుంటే.. కనీసం బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలు తగ్గించే కార్యక్రమం గతంలో జరగలేదు. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని తపన, తాపత్రయం చూపించాం. అందులో భాగంగా గతంలో పన్నెండున్నర, పదమూడున్నర శాతం వడ్డీలు కట్టాల్సిన పరిస్థితుల నుంచి బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర శాతానికి తగ్గించడం జరిగింది.

దీనివల్ల మనమిచ్చే రూ.3లక్షల వరకు సున్నావడ్డీ సొమ్ముతో పాటు మిగిలిన సొమ్ము మీద కూడా అతితక్కువ వడ్డీకే రుణాలు అక్కచెల్లెమ్మలకు వస్తున్నాయి. వారికి మంచి జరగాలనే ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను.

2014–19లో అక్కచెల్లెమ్మలకు మోసం…
2014 నుంచి 2019 వరకు అంటే గత ప్రభుత్వం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చేసిందేమిటి అని గమనించమని అక్కచెల్లెమ్మలను అడుగుతున్నా. 2014–19 మధ్య కాలంలో గత ప్రభుత్వం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలున్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి.. అక్షరాలా రూ.14,205 కోట్ల రూపాయలు చెల్లించకుండా మోసం చేయడంతో ఏ గ్రేడ్‌లగానూ, బి గ్రేడ్‌లగానూ ఉండే సంఘాలన్నీ దిగజారిపోయి సీ, డీ గ్రేడ్‌లుగా పడిపోయాయి. చాలా సంఘాలు ఎన్‌పీఏలగానూ అవుట్‌ స్టాండింగ్‌ జాబితాల్లోకి చేరడం మన కళ్లెదుటే చూశాం. అప్పటి ప్రభుత్వం ఒక పక్క వ్యవసాయ రుణమాఫీ అని రైతులను మోసం చేసింది.

మరో పక్క పొదుపు సంఘాల రుణమాఫీ అని చెప్పి అక్కచెల్లెమ్మలందరినీ నట్టేట ముంచింది. కోటిమందికి పైగా అక్కచెల్లెమ్మలను నట్టేట ముంచిన పరిస్థితి మనం చూశాం. కోటి కుటుంబాలు నట్టేట మునిగిన పరిస్థితుల్లో.. వారికి రుణాలు మాఫీ చేస్తామని మోసం చేయడమే కాకుండా 2014 నుంచి 2019 మధ్య కాలంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని కూడా ఎత్తివేస్తూ గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. 2016 అక్టోబరు నుంచి సున్నావడ్డీకి ఇవ్వాల్సిన సొమ్మను కూడా అక్కచెల్లెమ్మలకు పూర్తిగా ఎగనామం పెడుతూ సున్నావడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది.
ఈ రకంగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2016 అక్టోబరు నుంచి సున్నావడ్డీ పథకం రద్దు చేయడంతో కేవలం వడ్డీ ద్వారానే అక్కచెల్లెమ్మలకు జరిగిన నష్టం రూ.3036 కోట్లు. ప్రభుత్వం కట్టవల్సినా.. కట్టకుండా ఎగనామం పెట్టిన సొమ్ము ఇది. ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అప్పుడు చంద్రబాబు చేస్తానని చెప్పి మాఫీ చేయకపోవడం అది ఒకవైపు, మరోవైపు సున్నావడ్డీ పథకాన్ని రద్దు చేయడం ఈ రెండింటితో అక్కచెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా మారింది.

చంద్రబాబు దిగిపోయేనాటికి రూ.25 వేల కోట్లకు చేరిన అప్పులు
ఆ అక్కచెల్లెమ్మలు, వారు చేసిన అప్పులు ఆ వడ్డీలు, వాటికి చక్రవడ్డీలు అన్నీ ఏకమై తడిసి మోపుడై 2019 నాటికి, అంటే చంద్రబాబునాయుడు దిగిపోయేనాటికి రూ.25,517 కోట్లకు ఎగబాకడం చూశాం. ఫలితంగా చంద్రబాబునాయుడు గారు చేసిన మోసం పుణ్యాన పొదుపుసంఘాల అక్కచెల్లెమ్మలలో 18.36 శాతం సంఘాలన్నీ కూడా అవుట్‌ స్టాండింగ్, ఎన్‌పీఏల జాబితాలో చేరాయి. అంటే పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితుల్లోకి ఈ సంఘాలన్నీ వెళ్లిపోయాయి.

ఇప్పుడు అక్కచెల్లెమ్మల మొహల్లో చిరునవ్వు…
మరి ఇప్పుడు ఒకసారి గమనిస్తే ప్రతి అక్కచెల్లెమ్మ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఈ రోజు అక్కచెల్లెమ్మలు నిలదొక్కుకున్నారు, గర్వంగా తలెత్తుకున్నారు. గతంలో 18.36 శాతం ఎన్‌పీఏలుగా, అవుట్‌ స్టాండింగ్‌లుగా ఉన్న సంఘాలన్నీ కూడా ఇవాళ కేవలం .73శాతం అంటే కనీసం ఒక్కశాతం కూడా లేని పరిస్థితుల్లోకి అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలన్నీ కూడా ప్రగతిబాట పట్టాయి.

20 లక్షల అదనంగా చేరిన పొదుపు అక్కచెల్లెమ్మలు…
మనం అధికారంలోకి వచ్చేనాటికి స్వయంసహాయక సంఘాలుగా ఉన్న సభ్యులు ఆ అక్కచెల్లెమ్మలు దాదాపుగా 80 లక్షల మంది మాత్రమే ఉంటే.. ఈ రోజు పొదుపు సంఘాలలో ఉన్న అక్కచెల్లెమ్మలు 1 కోటి రెండు లక్షల మంది ఉన్నారు. అంత పెరుగుదల కనిపించింది. ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఏకంగా 20 లక్షలకు పైగా పొదుపు సంఘాల ఉద్యమంలో అక్కచెల్లెమ్మలు భాగస్వామ్యులు కాగలిగారు.

అక్కచెల్లెమ్మల విజయగాథ
నిజంగా ఇదొక చరిత్రలో నిల్చిపోయే పెద్ద, గొప్ప విజయగాథ. తమను చరిత్రలను తిరగరాసుకుని రాష్ట్ర చరిత్రను తిరిగరాస్తున్న అక్కచెల్లెమ్మల విజయగాథ. వారికి అండగా నిలబడిన ప్రభుత్వ విజయగాథ. ఈ ప్రభుత్వం మీద వారికి ఎంత నమ్మకం ఉందో చెప్తున్న గొప్ప విజయగాథ ఇది.

ఈరోజు రాష్ట్రంలో ఇది కనిపిస్తుందంటే నిజంగా దేవుడి దయ. ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంత మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చినందుకు ఎప్పటికీ దేవుడికి రుణపడి ఉంటాను. ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టే రాష్ట్రంలో జీర్ణించుకోలేని పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. కడుపుమంట కూడా ఎక్కువ కనిపిస్తుంది. దుష్ట చతుష్టయం ఈ రోజు రాష్ట్రంలో జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉంది.

ఎంత అండగా నిలబడ్డామో నాలుగు మాటల్లో….
మహిళా పక్షపాత ప్రభుత్వంగా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా.. దేశ చరిత్రలోనే ఎప్పుడూ కనీ, వినీ ఎరుగని విధంగా అక్కచెల్లెమ్మలకు ఎంతగా అండగా నిలబడ్డామో నాలుగు మాటల్లో మీ అందరికీ తెలియజేస్తాను.
మచ్చుకు ఒక పది పథకాల గురించి మాత్రమే మీ అందరికీ తెలియజేస్తాను.

జగనన్న అమ్మఒడి.. నిజంగా 44.50 లక్షల మంది తల్లులకు మంచి జరుగుతుంది. తద్వారా 84 లక్షల మంది పిల్లలకూ మంచి జరుగుతుంది. ఇంత మంచి జరుగుతున్న ఈ కార్యక్రమంతో ప్రతి సంవత్సరం పిల్లలందరూ కూడా బడి బాట పడుతున్నారు. తల్లులు పిల్లలను బడికి పంపిస్తే చాలు మా అన్న ఉన్నాడు, పిల్లలను చదివిస్తాడు, పిల్లలను బడికి పంపిస్తే… ప్రతి ఏటా రూ.15వేలు నా చేతిలో పెడుతున్నాడు అని ప్రతిఅక్కచెల్లెమ్మ మొహంలో ఆనందం కనిపిస్తుంది. రూ.6500 కోట్లు ప్రతి సంవత్సరం అక్కచెల్లెమ్మలు చేతిలో పెడుతూ మొత్తంగా ఇంతవరకూ రూ.13,023 కోట్లు చెల్లించాం.

వైఎస్సార్‌ఆసరా పథకం.. ఇచ్చిన మాట ప్రకారం అమలు చేశాం కాబట్టే.. పొదుపు సంఘాల్లో ఈ రోజు నమ్మకం పెరిగింది. అక్కచెల్లెమ్మల సంఖ్య కేవలం ఈ 34 నెలల కాలంలోనే 20 లక్షల మందికి పైగా పెరిగింది. పొదుపుసంఘాల్లో 80 లక్షల నుంచి 1 కోటి 2 లక్షలకు పెరిగిన పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాలకు 2019 ఎన్నికల నాటివరకు ఉన్న అప్పుమొత్తం నాలుగు విడతల్లో వారి చేతికే ఇవ్వడం ద్వారా ఆ అక్కచెల్లెమ్మలందరినీ అప్పుల ఊబిలోంచి బయటకు లాగడం జరిగింది. మాట నిలబెట్టుకుంటూ ఇప్పటికే రెండు విడతల్లో ఆసరా పథకానికి రూ.12,758 కోట్లు ఇచ్చాం.

వైయస్సార్‌ చేయూత ఈ పథకం ద్వారా 24.95 లక్షల మందికి 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలందరికీ.. అత్యంత బాధ్యతాయుతమైన వయస్సులో ఉన్న వీళ్ల చేతుల్లో డబ్బులు పెడితే కుటుంబాలకి మంచి జరుగుతుంది. ఇంతవరకూ ఏ ప్రభుత్వం వీళ్లను పట్టించుకోలేదు. ఎప్పుడూ ఎక్కడా కనీవినీ ఎరగని విధంగా వైయస్సార్‌ చేయూత పథకాన్ని తీసుకొచ్చాం.
నా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ కూడా మంచి చేస్తూ… రూ.9180 కోట్లు వారి చేతిలో పెట్టాం.

ప్రగతి బాటలో నడిపించాం…
డబ్బులు ఇవ్వడమే కాకుండా.. .వారిని ప్రగతి బాటవైపు నడిపించాలని ఆరాట పడ్డాం. ఆందులో భాగంగానే ఐటీసీ, రిలయన్స్, హిందుస్తాన్‌ లీవర్, పీ ఆండ్‌ జీ, అమూల్‌ వంటి పెద్ద పెద్ద సంస్ధలతో మాట్లాడాం. బ్యాంకులతో కూడా మాట్లాడి వారందరిని అనుసంధానం చేశాం. ఫలితంగా ఈ రోజు 1,20,518 రిటైల్‌ దుకాణాలను అక్కచెల్లెమ్మలు నడిపిస్తున్నారు. 3,42,907 యూనిట్లు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి పశుసంపద పెంపకానికి అక్కచెల్లెమ్మలు ముందుకు వచ్చారు.

అదే అక్కచెల్లెమ్మకు చేయూత ద్వారా వరుసగా క్రమం తప్పకుండా నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇచ్చే ఈ గొప్ప పథకానికి ఈ రోజు రాష్ట్రంలో శ్రీకారం జరుగుతుంది.
వైఎస్సార్‌ కాపునేస్తం… దీని ద్వారా 3,28,000 వేల మంది కాపు అక్కచెల్లెమ్మలకు మంచి జరిగే కార్యక్రమం చేస్తున్నాం. రూ.982 కోట్లు వారి చేతుల్లో పెడుతున్నాం.

వైయస్సార్‌ ఈబీసీ నేస్తం.. దేశంలో తొలిసారిగా ఓసీ వర్గాల్లో ఉన్న పేదలకు మంచి జరిగించే కార్యక్రమానికి ముందడుగు పడింది. పేదవాడు ఏ కులంలో ఉన్నా మంచి జరగాలనే గొప్ప అడుగు ముందుకు వేశాం. అదే వైయస్సార్‌ ఈబీసీ నేస్తం. 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటూ 3,93,000 మందికి ఏడాదికి రూ.15వేలు చొప్పున మూడేళ్లు పాటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.ఈ పథకం కింద రూ.589 కోట్లు నేరుగా వారి చేతిలో పెడుతున్నాం.

వైయస్సార్‌ పెన్షన్‌ కానుక… మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు వరకు ఇస్తున్న పెన్షన్‌ కేవలం రూ.1000. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఇస్తున్న పెన్షన్‌ లబ్ధిదార్ల సంఖ్య కేవలం 44 లక్షల లోపే.
కానీ ఈ రోజు 61.74 లక్షల మంది నా అవ్వాతాతలకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, వికలాంగ సోదరులకు పెన్షన్‌ ఇస్తున్నాం. ముష్టివేసినట్లు రూ.1000 అనే రోజులు పోయి ఈరోజు రూ.2500 ప్రతి చేతిలో పెడుతున్నాం.

ఇందులో కేవలం మహిళలు మాత్రమే… నా అవ్వలు, వితంతు అక్కచెల్లెమ్మలకు మాత్రమే తీసుకుంటే 36.46 లక్షలు మంది. వీరికి ప్రతినెలా ఒకటో తేదీ వచ్చిన వెంటనే నేరుగా తలుపు తట్టి.. చిరునవ్వుతో గుడ్‌మార్నింగ్‌ చెప్పి ఎటువంటి ప్రయాస లేకుండా చేతిలో రూ.2500 పెట్టి వాలంటీర్లుగా ఉన్న నా చెల్లెల్లు, తమ్ములు వాళ్ల ఆశీస్సులు, దీవెనలు తీసుకుని పోతున్నారు.

వైయస్సార్‌ జగనన్న కాలనీలు.. దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా.. రాష్ట్రంలో కూడా ఎక్కడా కనీ,వినీ ఎరుగని విధంగా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మీ అన్నగా, తమ్ముడిగా ఇంటి పట్టాలు ఇచ్చాం. 31 లక్షల కుటుంబాలు అంటే 1 కోటి 25 లక్షల మంది జనాభాకు అంటే రాష్ట్రంలో నాలుగింట ఒక వంతు మందికి చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఇళ్లపట్టాలు ఇచ్చాం. అందులో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇవన్నీ పూర్తయితే ఆ అక్కచెల్లెమ్మలకు మీ అన్నగా, తమ్ముడిగా నేను ఇచ్చే ఆస్తి విలువ.. ఒక ఇంటి పట్టా, ఇళ్లు తీసుకుంటే… కనీసం రూ.5 నుంచి రూ.10 లక్షలు లెక్కిస్తే… మొత్తం ఆ అక్కచెల్లెమ్మల చేతుల్లో 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వారికి ఇచ్చినట్లవుతుంది.

మంచి మేనమామగా చదివించాలని….
అక్కచెల్లెమ్మలకు అండగా, తోడుగా ఉండాలి. పిల్లలను కూడా మంచి మేనమామగా చదివించాలని ఆరాటపడ్డాం. ఆ పిల్లలు మన పిల్లలే, వారిని మనమే గొప్పగా చదివించాలని తపన పడ్డాం. అంతవరకు ఉన్న ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ఇంగ్లిషు మీడియం చదువులు లభించేలా చర్యలు తీసుకున్నాం. క్లాస్‌ టీచర్ల కాన్సెప్ట్‌ నుంచి సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌లోకి వచ్చాం. సీబీఎస్‌ఈ సిలబస్‌ను మన పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.

2024లో జరిగే 10వతరగతి పరీక్షలను మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే రాయబోతున్నారు. అంత గొప్పగా పిల్లలకోసం, వారి జీవితాల గురించి ఆలోచన చేసిన ఈ మంచి మేనమామ ఉన్నాడు అని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు తెలియజేస్తున్నాను.
పిల్లలు గొప్పగా చదవాలి, చదవడమే కాకుండా, ఇంగ్లిషులో పునాదులు పడటమే కాకుండా వారు పైస్ధానాలకు అంటే డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి, పెద్ద, పెద్ద చదువులు చదవాలి… ఆ చదువుల కోసం ఏ తల్లీతండ్రి అప్పులు పాలు కాకూడదు, బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చులకు సైతం ఆ పిల్లలు, తల్లిదండ్రులు ఇబ్బంది పాలు కాకూడదు అని వారి కోసం ఆలోచన చేశాడు మీ అన్న, మీ తమ్ముడు మీ జగన్‌.

జగనన్న విద్యాదీవెన… పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా 21.55 లక్షల తల్లులకు రూ.6969 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి ఆ తల్లుల చేతుల్లోకి చేర్చాం. ఆ పిల్లల చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును నేరుగా తల్లులకే ఇస్తున్నాం.
ఈ రూ.6969 కోట్లలో గత ప్రభుత్వంలో ఆ పెద్దమనిషి పెట్టిన రూ.1800 కోట్లు బకాయిలు కూడా మన పిల్లల కోసం మీ జగనన్న తీర్చాడు.

జగనన్న వసతి దీవెన.. ఈ పథకం ద్వారా పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్న 18.77 లక్షల తల్లుల ఖాతాల్లోకి.. ఆ పిల్లల బోర్డింగ్‌ మరియు లాడ్జింగ్‌ ఖర్చుల తల్లులు భరించలేని పరిస్థితుల్లో ఉండకూడదు, అప్పులపాలయ్యే పరిస్థితుల్లోకి రాకూడదని అని డాక్టర్లు, ఇంజనీర్లు, డిగ్రీలు చదివే ఆ పిల్లలకు సంవత్సరానికి రూ.20వేలు, పాలిటెక్నిక్‌ చదివే పిల్లలకు ఏడాదికి రూ.15 వేలు, ఐటీఐ చదివే పిల్లలకు సంవత్సరానికి రూ.10 వేలు.. రెండు దఫాల్లో నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో వసతి దీవెన కింద రూ.3329 కోట్లు ఇంతవరకు జమ చేశాం.

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ.. అక్కచెల్లమ్మలు, పిల్లలు గురించి ఇంతలా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎప్పుడూ ఉండకపోయుండవచ్చు. అక్కచెల్లెమ్మలు గర్భిణీలుగా ఉన్నప్పుడు, పిల్లలు కడుపులో ఉన్నప్పుడు వారు బాగుండాలి, పిల్లలు బాగా పుట్టాలి, వారికి రక్తహీనత ఉండకూడదు, విటమిన్స్, మినరల్స్‌ ఉండాలి, మంచి ఆహారం వారికి లభించాలని ఆలోచన చేసిన ప్రభుత్వాన్ని గతంలో చూసి ఉండరు. గతంలో ఆపెద్దమనిషి హయాంలో సంపూర్ణ పోషణం లాంటి ఈ పథకానికి రూ.500 కోట్లు కూడా పెట్టని పరిస్థితులు. ఈ రోజు దానికి వైయస్సార్‌ సంపూర్ణ పోషణ అనే పేరుతో 34.20 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలకు మంచి చేస్తూ… రూ.2000 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేస్తున్నాం.నేను చెప్పినవి ఈ పది పథకాలు మాత్రమే.

నవరత్నాలు– అనేక సామాజికవర్గాల చరిత్ర మార్పు
మనం అమలు చేస్తున్న నవరత్నాలు మన రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం చరిత్రను కాదు.. అనేక సామాజిక వర్గాల చరిత్రను మారుస్తున్నాయి. మనం అమలు చేస్తున్న పథకాల ద్వారా కేవలం ఈ 35 నెలల కాలంలోనే నేరుగా ప్రతి అక్క, చెల్లెమ్మ చేతిలోకి నేరుగా డబ్బులు వెళ్లే కార్యక్రమం ద్వారా రూ.1,36,694 కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతుంది. ఒకటో తేదీన పెన్షన్‌ పొద్దునే తలుపుతట్టి ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటికి వచ్చి ఇస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా మొత్తం ప్రదర్శించి అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే…మరలా దరఖాస్తు చేసుకుంటే మళ్లీ జూన్‌లోనూ, డిసెంబరులో ఇస్తామని చెప్పి.. ప్రభుత్వం ఎలా మంచి చేయాలా అని ఆరాటపడుతున్న ప్రభుత్వం మనది.
ఈ రూ.1,36,694 కోట్లలో అక్కచెల్లెమ్మలకు వారి చేతులలోకి నేరుగా వెళ్లిన సొమ్ము రూ.94,318 కోట్లు. ఇంత గొప్ప కార్యక్రమాలు రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నాయి.

చెక్కు చెదరని సంకల్పంతో…
ఇలాంటి పథకాలను మీ అందరికీ చేర్చడంలో ఎక్కడా తాత్సార్యం చేయలేదు. కరోనా వచ్చినా, ఆర్ధిక పరిస్థితులు ఎదురుతిరిగినా కూడా చెక్కుచెదరని సంకల్పమే చూపించాం. ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అని చెప్పి… మీకు ఎక్కడా కోతలు పెట్టే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. నా ఇబ్బందులు నాకు ఉన్నా.. నా ఇబ్బందులు కన్నా మీ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అని, మీ ఇబ్బందులు నా ఇబ్బందులుగా భావించి… మీ అన్నగా, తమ్ముడిగా మీ అందరికీ తోడుగా ఉన్నాను.
మీ మనస్సాక్షిని అడగండి…
అవినీతి లేకుండా నేరుగా మీ చేతికి, మీ బ్యాంకు అకౌంట్‌కి డబ్బులు జమ చేసిన ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి మనసున్న పాలనను మీరు గతంలో ఎప్పుడైనా చూశారా అని మీ గుండెల మీద చేతులు వేసుకుని మీ మనస్సాక్షిని అడగండి అని సవినయంగా మీ అందరినీ కోరుకుంటున్నాను.
దుష్టచతుష్టయం…
మనం చేస్తున్న ఇలాంటి పాలన వద్దని.. మా బాబు పాలనే కావాలని ఈ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం అంటోంది. దుష్ట చతుష్టయం అంటే ఏమిటో ఈ పాటికే మీకు అవగతమైపోయి ఉంటుంది. చంద్రబాబునాయుడుగారు, రామోజీరావుగారు, ఏబీఎన్, టీవీ5 వీళ్లందరిదీ ఒకేమాట, ఒకేబాట.
ఈ దుష్టచతుష్టయంతో పాటు వీరి దత్తపుత్రుడు కూడా కలిసి.. వీళ్లంతా ఏమంటున్నారో కూడా మీరంతా గమనించాలి.

ఇదిగో ఈనాడు పత్రిక(ఈనాడు దినపత్రిక చూపిస్తూ…) వీళ్లు రాస్తున్న రాతలు ఏమిటో తెలుసా ? ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలట ? ఈనాడు మొదటి పేజీ బ్యానర్‌ స్టోరీ. జగన్‌ ప్రభుత్వం నిర్వాకంతో మరో శ్రీలంకగా రాష్ట్రం ? ఉచితంతో ఆర్ధిక విధ్వంసం.. ఇవి రోజూ కూడా మన చంద్రబాబుగారు, రామోజీరావూ, ఏబీఎన్, టీవీ5 ఈ దుష్ట చతుష్టయం అంతా కలిసి రాస్తున్నారు.
నేను అడుగుతున్నా ? అక్కచెల్లెమ్మలకు, రైతులకు, చదువుకుంటున్న పిల్లలకు, అవ్వాతాతలకు, పేదరికంలో ఉండి అలమటిస్తున్న నా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో ఉన్న నా పేదలకు ఇలా పథకాలు అమలు చేయడానికి వీలులేదట ?

రోజూ పేపర్లలో, టీవీలలో డిబేట్లు పెట్టి వీరంతా చేస్తున్న ప్రచారం ఇదే. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదల్చుకుందో వారి అధికార గజిట్‌ పేపరు ఈనాడులో చెప్పిస్తారు. వాళ్ల మనసుల్లో ఉన్న మాటను వాళ్ల అధికార గజిట్‌ పేపర్లో ఇలా ప్రచురిస్తారు. ఇలా రాయిస్తారు. ప్రభుత్వం డబ్బు పంచే తమాషా ఆపాలని చెప్పి రాయిస్తారు. దాదాపు రోజూ ఇటువంటి మాటలు, రాతలే చూస్తున్నాం.
నేను అడుగుతున్నాను. దీని అర్ధం ఏమిటని ? దీని అర్ధం నా ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు, పేద వర్గాల్లో అందుతున్న లబ్ధిని, ఈపథకాలన్నింటినీ ఆపేయాలని ఆ ఎల్లో పార్టీ, ఆ ఎల్లో మీడియా వారిద్దరికీ ఒక ఎల్లో దత్తపుత్రుడు కోరుకుంటున్నారు.

ఆశ్చర్యం అనిపిస్తుంది….
ఈ పథకాలు అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఏకంగా గోబెల్స్‌ ప్రచారం మొదలు పెట్టారు.అంటే మీ అందరికీ తెలుసు ఒక అబద్దాన్ని వందసార్లు చెప్పిందే చెప్పి వందసార్లు చెప్పి… నిజమేమన్నా ఉంటుందని ప్రజల్లో భ్రమ కలిగించేదే గోబెల్స్‌.
అటుంటి గోబెల్స్‌ ప్రచారం రోజూ చేస్తున్నారు.
పేదలకు మనం సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట.. కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు మాదిరిగా అమలు చేయకపోతే… ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తే మాత్రం రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇదీ ఈనాడు నిర్వచనం. పేదలకు సంక్షేమపథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట… పేదలకు ఇవ్వకుండా.. పాలకుల జేబుల్లోకి ఆ డబ్బు పోతే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇదీ వాళ్ల సారాంశం.
రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం….
ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తే… తద్వారా పాలకులు కాకుండా ప్రజలు బాగుపడితే ఈ రాష్ట్రం ఏమైనా శ్రీలంక అవుతుందా అని చెప్పి ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ప్రజలు బాగుపడితే, పథకాలు ప్రజల చేతికి నేరుగా పోతే… లంచాలకు, వివక్షకు తావులేకుండా ప్రజలు ఆ పథకాలు అందుకుంటే.. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే మన రాష్ట్రం ఏమైనా శ్రీలంక అవుతుందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని ప్రజలందరినీ కోరుతున్నాను.
ఈ పథకాలన్నింటినీ ఆపేయాలని, మా చంద్రబాబుకు ఏవరైనా ఓటే స్తే వీటన్నంటినీ ఆపేస్తాడని చెప్పకనే చెబుతున్నారు ఈ ఎల్లోమీడియా ప్రబుద్ధులు. ఒక్కసారి ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను.
నేనందరినీ ఒకటే అడుగుతున్నాను ?. దీనికి మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను ? ఒప్పుకోమంటే మాత్రం రెండు చేతులు పైకెత్తి ఊపండి. ఒప్పుకుంటే చేతులు పైకెత్తి ఊపాల్సిన పనిలేదు. నేను ప్రశ్నలడుగుతాను, మీరే సమాధానం చెప్పండి.
మనందరి ప్రభుత్వంలో 44.50 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ… 84 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టిస్తూ… మనందరి ప్రభుత్వం రూ.13,022 కోట్లు జగనన్న అమ్మఒడి పథకాన్ని మనం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నాం.

ఈ పథకాన్ని ఆపాలన్నది వీరి ఉద్దేశ్యం. ఇందుకు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను ?
(ఒప్పుకోమంటూ చేతులుపైకెత్తి ఊపిన మహిళలు.)
కనీసం అప్పటికైనా ప్రజలు బాగుపడటం అంటే ఈ రాష్ట్రం బాగుపడటం అని ఈ ప్రబుద్ధులుకు అర్ధం అవుతుంది. మనందరి ప్రభుత్వంలో ఏకంగా 52.40 లక్షల మంది రైతులు, కౌలురైతు కుటుంబాలుకు నేరుగా బటన్‌ నొక్కిన వెంటనే వారి అకౌంట్లలోకి డబ్బు వెళ్తుంది.
ఇప్పటివరకు వైయస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతన్నకు, కౌలు రైతులకు,అసైన్డ్‌ రైతులకు, ఆర్వోఎఫ్‌ఆర్‌ రైతున్నల కుటుంబాలకు మంచి చేస్తూ… ఈ పథకం ద్వారా రూ.20,162 కోట్లు నేరుగా వారందికీ మేలు చేశాం. ఇలాంటి వైయస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ఆపేయాలన్నది వీరందరి ఉద్దేశ్యం. ఇందుకు మీరు ఒప్పుకుంటారా ? అని అడుగుతున్నాను.
(ఒప్పుకోమంటూ చేతులు పైకెత్తి ఊపిన మహిళలు)
వారికి బుద్ధి వస్తుందని ఆశిద్దాం…
మీరు ఇలా చేతులు పైకెత్తి ఊపడం వల్ల కనీసం ఆ చంద్రబాబుకు, ఈనాడు, ఆంధ్రజ్యోతికి, టీవీ5 కన్నా బుద్ధి వస్తుందని ఆశిద్దాం.
ప్రభుత్వం అంటే ప్రజలు.. ప్రజలు బాగుపడితే రాష్ట్రం బాగుపడటమే.. అది తెలియక, తెలిసినా వక్రీకరించే దుర్భిద్ధితో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీళ్లందరికీ కూడా మనం రెండు చేతులు పైకెత్తి ఊపే సమాధానంతోనే వాళ్లకి జ్ఞానోదయం అవుతుంది.

మనందరి ప్రభుత్వంలో ఏకంగా 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ… 45 నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న వారికి వైయస్సార్‌ చేయూత పథకం తీసుకొచ్చి, వారిని చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.18,750 వారి చేతిలో పెట్టి వరుసగా నాలుగేళ్లపాటు రూ.75 వేలు ఇస్తున్నాం. అంతేకాకుండా ఐటీసీ, అమూల్, రిలయెన్స్‌ వంటి పెద్ద సంస్థలతో ఒప్పందం చేసి, బ్యాంకులతో కూడా టైఅప్‌ చేసి, వారందరికీ కూడా జీవనోపాధి చూపిస్తున్నాం. ప్రభుత్వం తరపునుంచి రూ.9180 కోట్లు వైయస్సార్‌ చేయూత ద్వారా అమలు చేస్తే… అటువంటి అక్కచెల్లెమ్మలకు వైయస్సార్‌ చేయూత పథకం ఆపేయాలన్నది వీరి ఉద్దేశ్యం. దీనికి మీరు ఒప్పుకుంటారా ? అని అడుగుతున్నాను.

మనందరి ప్రభుత్వంలో 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి కుటుంబాలకుమంచి చేస్తూ..గతంలో చంద్రబాబు గారు మోసం చేసి, రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి ఎగ్గొట్టి, చివరçకు సున్నావడ్డీ ఇచ్చే పథకాన్ని సైతం రద్దు చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల అక్కచెల్లెమ్మల అప్పులు తడిసి మోపుడై… 18.36 శాతం ఎన్‌పీఏలుగా తయారై, అవుట్‌ స్టాండింగ్‌లుగా తయారై.. అక్కచెల్లెమ్మలు ఎదురీత ఈదుతున్న పరిస్థితి. అటువంటి సందర్భంలో వైయస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఆక్కచెల్లెమ్మలను కాపాడేందుకు రూ.12,758 కోట్లు వెచ్చిస్తే.. దాన్ని ఆపేయాలని వీళ్ల ఉద్దేశ్యం. ఇందుకు మీరు ఒప్పుకుంటారా ? అని అడుగుతున్నాను.
(ఒప్పుకోమంటూ చేతులు ఊపిన మహిళలు)
ఇళ్లు లేని నిరుపేదలకు మనందరి ప్రభుత్వంలో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశాం. గతంలో ఇన్నిన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పరిపాలన చేసినవాళ్లు… ఇళ్లు లేని నిరుపేదలకు మంచి చేయాలి, ఇంటిస్ధలం ఇవ్వాలి, ఇళ్లు కట్టి ఇవ్వాలని గత పాలకులు ఏనాడు ఇటువంటి ఆలోచనే చేయలేదు. ఈ రోజు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చి అక్కడే ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం. ఆ ఇళ్లు పూర్తయితే ఒక్కో కుటుంబం చేతిలో రూ.5–రూ.10 లక్షల ఆస్తి వాళ్ల చేతిలో పెట్టినట్లువుతుంది. మొత్తం 31 లక్షల ఇళ్లు పూర్తయితే 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు వారి చేతిలో పెట్టినట్టవుతుంది.
ఇళ్లు పట్టాలిచ్చి, ఆ తర్వాత ఇళ్లు కట్టించి ఇచ్చే గొప్ప పథకం ఆపేయాలని వీరి ఉద్దేశ్యం. దీన్ని మీరు ఒప్పుకుంటారా ?
ఇలా చెప్పుకుంటూ పోతే….
ఇలా చెప్పుకుంటూ పోతే… మన చేతులు ఇలా ఊపుతూ అలిసిపోయినా కూడా మన బాధలు, ఆవేదనలు మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి ? ఆ బాథ, ఆవేదనల నుంచి ఈ పథకాలన్నీ మాకు కావాలి అన్న ఆకాంక్షలు తెలియజేస్తున్న అక్కచెల్లెమ్మల మనస్సులు అయినా వారికి అర్ధం అయితే వాళ్లలో మార్పు వస్తే… రాష్ట్రానికి కొద్దో గొప్పో మంచి జర్నలిజం అనేది కనిపిస్తుంది. మంచి ప్రతిపక్షం అన్నది మనకు కనిపిస్తుంది.

ఉచిత కరెంటు…
రాష్ట్రంలో 18.50 లక్షల పంపుసెట్లకు సంవత్సరానికి దాదాపుగా రూ.9వేలు కోట్లు ఖర్చు చేస్తూ ఉచిత కరెంటు ఇస్తున్నాం. జగనన్న విద్యాదీవెన, జగనన్న గోరుముద్ద ద్వారా జరుగుతున్న మంచిని వివరించడం జరిగంది. నాడు–నేడు ద్వారా ఆస్పతుల్లో రూపురేఖులు మారుతున్నాయి. నాడు–నేడు ద్వారా స్కూళ్లు రూపురేఖలు మారుతున్నాయి. వైయస్సార్‌ సున్నావడ్డీ పథకం, వైయస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ పంటలభీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత విద్యుత్‌ వంటి గొప్ప పథకాలు అమలవుతున్నాయి. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా వైయస్సాస్‌ సున్నావడ్డీ అనే పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాం.
వైయస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా దాదాపుగా 62 లక్షల మంది జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. వైయస్సార్‌ నేతన్ననేస్తం ద్వారా 1 లక్ష మంది చేనేత కుటుంబాలకు, వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3.03 లక్షల మందికి, వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4 లక్షల మంది అగ్రవర్ణపేద మహిళలకు మంచి జరుగుతుంది.

జగనన్న చేదోడు ద్వారా రజకులు, నాయీబ్రహ్మణులు, టైలర్లకు చెందిన 3 లక్షల కుటుంబాలకు మంచి జరుగుతుంది. మనందరి ప్రభుత్వంలో జగనన్న తోడు పథకం ద్వారా మన చిరు వ్యాపారం చేసుకుంటున్న 14.16 లక్షల మంది పేదలకు మంచి జరుగుతుంది. వైయస్సార్‌ వాహనమిత్ర ద్వారా 2.75 లక్షల మంది సొంత ఆటోలు, క్యాబ్‌లు ఉన్న కుటుంబాలకు మంచి జరుగుతుంది.
వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 95 శాతం ప్రజలకు గొప్ప మేలు జరుగుతుంది. వైయస్సార్‌ ఆరోగ్యఆసరా ద్వారా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయించుకున్నవారు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తే… విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు చొప్పున వైద్యం కోసం వచ్చిన పేషెంట్‌ చేతిలో పెడుతున్నాం.

ఇలా గోరుముద్ద, సంపూర్ణ పోషణం వంటి గొప్ప కార్యక్రమాలన్నీ తీసివేయాలని వీరి ఉద్దేశ్యం. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. పేదరికంలో ఉండి అలమటిస్తున్న ప్రజలు ఈ రోజు 80 శాతం మంది ఉన్నారు. ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,బీసీలతో పాటు అగ్రవర్ణాలలో కూడా పేదరికంతో అలమటిస్తున్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయి.

జగన్‌ చేస్తున్నది మంచా ? చెడా ?
ఇటువంటి వాళ్లకు మీ జగన్‌ చేస్తున్నది మంచా ? చెడా ? అన్నది మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతున్నాను. మరో విషయం కూడా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకాలన్నింటినీ కూడా నిలిపివేయాలని ఎల్లో పార్టీలు, ఎల్లో మీడియా వారి దత్తపుత్రుడు అఢుగుతున్నారు. వీళ్లందరినీ కూడా మీ తరపున నేను ప్రశ్నిస్తున్నాను ?. మీరు కూడా ప్రశ్నించండి ? ఇటువంటి వాళ్లు నిజంగా మనుషులేనా ? అని అడగండి.
ఇటువంటి వాళ్లు రాజకీయ పార్టీలు నడపడానికి అర్హులేనా ? అని అడగండి.
ఇటువంటి వాళ్లు ప్రజా జీవితంలో ఉండటానికి అర్హులేనా ? అని చెప్పి మీరే అడగండి.

నేను ఒకే ఒక్క విషయం చెపుతాను….
చంద్రబాబు హయాంలో అయినా, మన హయాంలో అయినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అదే. చేస్తున్న అప్పులు అవే. మరి ఆయన హయాంలో ఆయనకొచ్చిన ఆదాయం అదే, చేస్తున్న అప్పులు అవే. మన హయాంలో మనకొచ్చిన ఆదాయమూ అంతే, చేస్తున్న అప్పులు కూడా కాస్తా కూస్తో ఆయన కంటే తక్కువే.
మరి అలాంటప్పుడు జగన్‌ ఎలా చేయగలుగుతున్నాడు, ఆ పెద్దమనిషి ప్రజలకు ఎందుకు మంచి చేయలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతున్నాను.

కారణం…
జగన్‌ బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా ప్రజల దగ్గరకు పోతుంది. చంద్రబాబు నాయుడు గారు బటన్‌ నొక్కడు, ఆయన పరిపాలన అంతా ఆయనకుమంచి చేసుకోవడం. ఆయన చుట్టూ ఉన్న రామోజీరావుకు, ఏబీయన్‌కు, టీవీ5కు, గ్రామాలలో జన్మభూమి కమిటీ సభ్యులకు మంచి చేసేందుకు ఆయన పరిపాలన సాగింది. అందుకే అదే బడ్జెట్, అదే వనరులు, అవే అప్పులు అయినా చంద్రబాబు పరిపాలన ఒక మాదిరిగా ఉంది. అంతకన్నా కాస్త తక్కువ అప్పులు చేసినా.. జగన్‌ పరిపాలన చంద్రబాబు కన్నా చాలా, చాలా గొప్పగా ఉంది.

రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు…
మీ అందరితో ఇన్ని విషయాలు పంచుకున్నాను. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. 70 శాతం మంత్రిపదవులు ఎస్సీలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకే వస్తున్నాయి అంటే సామాజిక న్యాయం అంటే మాటల్లో కాదు చేతల్లో కనిపిస్తున్న పరిస్థితులు గమనించమని కోరుతున్నాను.
మొదటి దఫా మంత్రివర్గంలో 56 శాతం ఇవ్వడమే చరిత్ర అయితే ఇప్పుడు 70 శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలకే ఇవ్వడమన్నది మహా చరిత్ర. 5 మంది ఉపముఖ్యమంత్రులు ఉంటే అందులో నలుగురు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలే అయితే మరలా అదే నాలుగు పదవుల్లో అవే వర్గాలను కొనసాగించడం మహా విప్లవం.

చేతల్లో సామాజిక న్యాయం
గత పాలనలో 42, 48 శాతం ఇస్తే గొప్ప అనుకునేవారు, ఈ రోజు 56 శాతం, 70 శాతం సంఖ్య కనిపిస్తోంది. మంత్రివర్గంలో 11 మందిని కొనసాగిస్తే.. 9 మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలే. ఇంతకంటే సామాజిక న్యాయం ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నాను. ఎక్కడో ఎందుకు ఈ ఎల్లో సభ్యులు నివాసముంటున్న విజయవాడనే ఒక్కసారి తీసుకుంటే… జనరల్‌ స్ధానంలో విజయవాడ మేయర్‌ ఒక బీసీ మహిళ.

ఎక్కడకో వెళ్లాల్సిన పనిలేదు. కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్‌గా జనరల్‌ స్ధానంలో బీసీ మహిళ జడ్పీ ఛైర్మన్‌గా ఉంది. అదే విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి ఆలయం ఉంది.. అందులో ఛైర్మన్‌గా ఉన్నది ఒక బీసీ. గతంలో ఎప్పుడైనా ఇలాంటది చూశారా ? అని అడుగుతున్నాను.
13 జిల్లాల జడ్పీ ఛైర్మన్‌ పదవుల్లో 9 ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలే ఉన్నారు. ఈ రోజు సామాజిక న్యాయం అనే మాటలు చెప్పి.. ప్రజలను ఉపయోగించుకుని చెత్తబుట్టలో పడేసే రోజులు పోయాయి. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపిస్తున్న ప్రభుత్వం మీ అన్నది, మీ తమ్ముడిది, మీ జగన్‌ది.

దేవుడు ఆశీర్వదించాలని, ప్రజలందరి దీవెనలతో ఇంకా గొప్పగా పరిపాలన సాగించాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ..ఈ రోజు నేను ఇక్కడ ప్రారంభించే కార్యక్రమంతో మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.
కార్యక్రమంలో చివరగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,02,16,410 అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన రూ.1,261 కోట్ల వడ్డీని వారి తరపున పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం వైయస్‌.జగన్‌ బటన్‌ నొక్కి జమ చేశారు.

LEAVE A RESPONSE