తన స్వార్ధం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తి ముఖ్యమంత్రి

  • జీసస్ వాక్యాలు పాటిస్తే రాష్ట్రాన్ని ఇబ్బందుల పాల్జేసేవాడు కాదు
  • మైనారిటీల హక్కుల పరిరక్షణకు జనసేన అండగా ఉంటుంది
  • తన మతాన్ని ప్రేమించి… ఇతర మతాలను గౌరవించేవాడే ప్రజలకు న్యాయం చేయగలడు
  • పాస్టర్లకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి బుట్టదాఖలు చేశారు
  • మైనారిటీల నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిస్తాం
  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మత పెద్దలతో సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్

‘ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తే తప్ప జీసస్ వాక్యాలు పాటించే వ్యక్తి కాదు. ఆయన నిజంగా జీసస్ వాక్యాలు పాటిస్తే రాష్ట్రాన్ని ఇలా ఇబ్బందుల పాల్జేసేవాడు  కాద’ని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ అన్నారు. మానవత్వంతో నిలబడే వ్యక్తికి మతం ఉండదని, ఎవడైతే తన మతాన్ని ప్రేమించి, ఇతర మతాలను గౌరవిస్తాడో అలాంటి వారే ప్రజలకు న్యాయం చేయగలరన్నారు. నేను అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తాను కాబటీ పార్టీ మూల సిద్ధాంతాల్లో మత ప్రస్తావన లేని రాజకీయం అనే సిద్ధాంతాన్ని చేర్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ మత పెద్దలతో సమావేశం అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పవన్ కళ్యాణ్ క్షేమాన్నీ, విజయాన్నీ కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “నేను మతాల గురించి మాట్లాడే సందర్భంలో కొంత మందికి ఇబ్బంది కలగవచ్చు. అందుకు కారణం ఒక విధమైన అభద్రతా భావం. ఈ రాజకీయ నాయకులు సెక్యులరిజం అనే పదాన్ని ఓటు బ్యాంకుగా మలిచేశారు. మైనార్టీలపై దాడి జరిగినప్పుడు మాత్రమే అందరూ మాట్లాడతారు. హిందువులపై దాడి జరిగితే ఎవరూ పట్టించుకోరన్న భావన సమాజంలో పెరిగిపోయింది. ఇలాంటి వ్యవహారాల్లో రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రవర్తించాలి.

జగన్ మాదిరిగా మాటలు చెప్పను
జగన్ హయాంలో 517 దేవాలయాలు అపవిత్రమయ్యాయి. అందుకు సంబంధించిన దోషులను పట్టుకోకపోతే- పాలకుడు అన్య మతస్తుల పక్షం వహిస్తున్నారనే భావన హిందువులకు కలుగుతుంది. ఇలాంటి ఘటనల్లో దోషుల్ని పట్టుకోకపోతే అతను ఎందుకు తప్పు చేశాడో తెలియదు. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక క్రైస్తవ సమాజం ఇలాంటి పనులకు పాల్పడుతోందన్న భావన అంతర్గతంగా పెరిగిపోతుంది. ఇది ప్రమాదకరం. నేను ఇలాంటి రుగ్మతలను పూర్తిగా తీసేయాలన్న లక్ష్యంతో మాట్లాడతాను. నేను ఈ అంశాన్ని కూడా జీసెస్ క్రైస్ట్ నుంచే నేర్చుకున్నాను.

క్రిస్టియన్ల మనోభావాలకు, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగితే జనసేన పార్టీ తరఫున క్రిస్టియన్ మైనారిటీల పక్షాన బయటకి వచ్చి వారికి అండగా నిలబడతా. జగన్ మాదిరి నేను మాటలు చెప్పను. మాట ఇచ్చే ముందే ఆలోచించి మాట్లాడుతాను. రాష్ట్రవ్యాప్తంగా 97 వేల మంది పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు 8500 మందికి మాత్రమే ఇచ్చారు. మాట ఇస్తే కచ్చితంగా నిలబడాలి. రాజకీయ నాయకుడి మాటకు చాలా విలువ ఉంటుంది. మద్యపాన నిషేధం అన్నారు.. సీపీఎస్ రద్దు చేస్తాను అన్నారు… గౌరవ వేతనం అన్నారు. ఏదీ నిలబెట్టుకోలేదు. మాట్లాడేసి మాట తప్పరాదు.

జనసేన పార్టీ క్రైస్తవులకి ఎప్పటికీ వ్యతిరేకం కాదు. నేను నిలబడి చూపిస్తా. మా ఇంట్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తాం. క్రైస్తవ ప్రార్థనలు చేస్తారు. క్రిస్టియన్లకు గౌరవం ఇవ్వడం అనే అంశాన్ని నేను ఇంటి నుంచే మొదలుపెడతాను. ఎన్నికల కోసం నటించను. నేను సత్యాన్ని చెప్పడానికే నిర్ణయించుకున్నాను. మైనారిటీలకు కేటాయించిన నిధులు క్రిస్టియన్ మైనారిటీలకు ఎందుకు రావడం లేదు అనే అంశం మీద విచారణ జరిపి వారికి అందాల్సిన నిధులు వారికి ఇప్పించే ప్రయత్నం చేస్తాం.

క్రిస్టియన్ల రాజ్యాంగపరమైన హక్కులు కాపాడుతాం
క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడతా. నేను సినిమాల్లో తప్ప బయట నటించను. ఏం చేసినా మీ మనసులకు దగ్గరయ్యే పనులే చేస్తాను. రామ జన్మభూమికి డబ్బు ఇచ్చాను కదా అని కొంత మంది మాట్లాడారు. మసీదులకీ రూ. 25 లక్షలు ఇచ్చాను. ఎక్కడా తేడా చూపలేదు. క్రిస్టియన్ సమాజానికి అవసరం అంటే నా వంతు వ్యక్తిగతంగా ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి సిద్ధం. నేను బీజేపీతో సన్నిహితంగా ఉండడం వల్ల నేను క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతానని ప్రచారం చేస్తారు.  జగన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ  దగ్గరకు వెళ్లిన ప్రతిసారీ వెంకటేశ్వర స్వామి ఫోటోలే తీసుకువెళ్తారు. ఆయన క్రిస్టియానిటీని వాడుకుంటున్నారు. అవసరాన్ని బట్టి హిందూయిజాన్ని వాడుకుంటున్నారు. నేను అలా చేయను. ఇష్టపూర్వకంగా మతం మారడానికి ఎవరికైనా సంపూర్ణమైన హక్కు ఉంది. ఈ వ్యవహారంలో రాజ్యాంగపరంగా మీ హక్కులకు భంగం కలగకుండా జనసేన మీకు అండగా నిలబడుతుంది. ద్వేషపూరిత వాతావరణం మంచిది కాదు.

అందరికీ న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మతాన్ని ఎన్నికల కోసం వాడుకోను. బైబిల్ సాక్షిగా ఎన్నికల రోజు మీరు జనసేన నిలబడుతుంది అని భావిస్తే నిలబడండి. క్రిస్టియన్ల సమస్యల పరిష్కారంపై ఒక కమిటీ వేస్తా.  నేను రాష్ట్రం కోసం సాధించాలి అనుకున్న వాటిలో కొన్నింటిని మాత్రమే సాధించాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా ఆపగలిగాం. డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ ఆపగలిగాం. క్రిస్టియన్ సోదరులు చెప్పిన సమస్యల్లో కేంద్ర పరిధిలో ఉన్న వాటిపై మీ తరఫున మాట్లాడుతా. మీరు ఈ సారికి నిజాయితీకి సత్యానికి నిలబడండి. కోనసీమ వచ్చినప్పుడు ప్రత్యేకంగా పది నిమిషాలు సమయం కేటాయించి క్రిస్టియన్ సమాజం కోసం మాట్లాడుతా. మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు.

పర్యటన శాంతి ప్రార్థనలతో మొదలవుతుంది
ధర్మం ఎక్కడుంటే భగవంతుడు అక్కడ ఉంటాడని మనస్ఫూర్తిగా విశ్వసిస్తాను. దేశం తాలూకు మూల లక్షణమే మన మతాన్ని ప్రేమించి, ఇతర మతాలను గౌరవించడం. మిమ్మల్ని మైనారిటీలు అనడం నాకు ఇష్టం లేదు. ఈ దేశం మనందరిది. దేవాలయాలపై దాడులు జరిగితే ఎలా స్పందిస్తానో… మసీదు, చర్చిల మీద దాడులు జరిగితే అదే విధంగా స్పందిస్తాను. మీకు ఎంత అండగా నిలబడతానో సమయం, సందర్భం వచ్చినప్పుడు మీకు అర్ధమవుతుంది. నేను నిలబడినట్లు సొంత మనిషిని అని చెప్పుకొనే ముఖ్యమంత్రి కూడా నిలబడడు.

ఈ ముఖ్యమంత్రి మతాన్ని తన స్వార్థం కోసం వాడుకునే వ్యక్తే తప్పే జీసస్ వాక్యాలు పాటించే వ్యక్తి కాదు. నిజంగా జీసస్ వాక్యాలు పాటిస్తే రాష్ట్రాన్ని ఇంతలా ఇబ్బందిపాలు చేసేవాడు కాదు. కోనసీమ పర్యటన శాంతి ప్రార్థనలతో మొదలవుతుంది. కోనసీమ కలహాల సీమ కాదు ప్రేమ సీమ అని నిరూపిద్దాం. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు ఎంత భక్తితో వెళ్లి కూర్చున్నానో…  అమలాపురంలో ఏర్పాటు చేయనున్న  ప్రార్థనలో కూడా అంతే భక్తితో వచ్చి కూర్చుంటాను. మంచి మనసుకు మంత్రం అవసరం లేదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తాను” అన్నారు.

Leave a Reply