శాసన మండలి చరిత్రలో ఇది చీకటిరోజు

– చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్దల సభను అగౌరవపరిచారు
– 10 నిమిషాలు చర్చకు అనుమతివ్వమని కోరితే సస్పెండ్ చేస్తారా?
– శాసనమండలి సభ్యులపై రూ. 5 వందలు విసరడం ఎక్కడి సాంప్రదాయం, ఎక్కడి సంస్కారం?
– టిడిపి శాసనమండలి సభ్యు డు బి. టి నాయుడు

కల్తీసారా వల్ల చనిపోయిన బడుగు, బలహీనవర్గాల పక్షాన పోరాడుతున్న మమ్మల్ని ఈ ముఖ్యమంత్రి శాసనమండలి ఛైర్మన్, మంత్రులు, సభ్యుల రూపంలో ఎన్నో అవమానాలకు గురిచేశారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మాకు శాసనమండలి చరిత్రలో ఇది చీకటిరోజు. శాసనమండలి ఛైర్మన్ ఏకపక్షంగా ప్రభుత్వానికి సహకరించారు. జంగారెడ్డిగూడెంలో సంభవించినవి సహజ మరణాలైతే దీనిమీద చర్చ జరపమని అడిగితే ఈ ప్రభుత్వం ఎందుకు చర్చించలేదు? చట్టబద్ధంగా లెజిస్లేచర్ ప్రకారం గత 8 రోజులుగా వాయిదా తీర్మానాలు ఇస్తున్నాం. ఈరోజు కూడా ఇచ్చాం. 10 నిమిషాలు చర్చకు అనుమతివ్వమని కోరాం. అయినా ఫలితంలేదు. మార్షల్స్ ను పెట్టి బయటికి తోయడమే వారు పనిగా పెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాల్లో 42 శాతం సహజ మరణాలుంటాయని సీఎం చెప్పారు. అయితే అందులో ఆడ పడుచులు లేరు, పిల్లలు లేరు, కేవలం మగవారు మాత్రమే చనిపోయారు. దీని మర్మమేంటి? ఉదయం పది గంటలకు శాసనమండలి మొదలుపెడితే అప్పటి నుంచి దాదాపు 3 గంటల వరకు మా గొంతులు నొప్పొచ్చేవిధంగా సభ్యులందరూ ఏకపక్షంగా చర్చ జరపమని కోరుతున్నా చర్చ పెట్టలేదు. మేమందరం కూడా చనిపోయిన బడుగు, బలహీనవర్గాల వారి పక్షాన కనీసం పది నిమిషాలు చర్చకు అనుమతించండని కోరితే ఎదురుదాడి చేశారు. వాయిదా తీర్మానం ఇవ్వంగానే శాసనమండలి ఛైర్మన్ మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు.

మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే దువ్వాడ శ్రీనివాసులు అనే సభ్యుడు 5 వందల రూపాయల నోటు ఛైర్మన్ పై, మాపై విసిరాడు. ఇది క్లబ్బు కాదు. మేం అంతా క్లబ్ డ్యాన్స్ చేస్తున్నవారంకాదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా42 మరణాలు. దువ్వాడ శ్రీనివాస్ కు ఎలా కనబడుతున్నాయి? మహాభారతంలో ధృతరాష్ట్రుడు కళ్లకు గంతలు కట్టుకొని నాడు జూదమాడుతుంటే ఎలా చూస్తున్నాడో ఈరోజు శాసనమండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారు. మంత్రులు, సభ్యులతో తిట్టిస్తున్నాడు. వైసీపీ వారి చర్చను ప్రోత్సహిస్తున్నాడు. మా పై డబ్బులు విసిరితే కనీసం మందలించకపోగా మమ్మల్ని సస్పెండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్నవారికి విలువలేదా? ఈ డ్రామా అంతా జగన్ రెడ్డే నడిపిస్తున్నాడు. జగన్ రెడ్డి వ్యవస్థలన్నింటిని నాశనం చేశారు. శాసనమండలి ఛైర్మన్ ను కూడా ప్రభావితం చేసుకున్నారు.. పెద్దతనాన్ని ప్రదర్శించాల్సిన ఛైర్మన్ ధృతరాష్ట్రుని పాత్ర పోషించాడు. మాకు అవమానం జరిగింది. మా భార్యా బిడ్డలను తిట్టినా, డబ్బులు విసిరినా ప్రోత్సహిస్తున్నాడు. బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్ బాబు, దీపక్ రెడ్డి, కేఈ ప్రభాకర్, బీఎన్ రాజనరసింహులు, మోహన్, దువ్వాడ రామ్మోహన్, రవీంద్రనాథ్ రెడ్డి, అంగర రామ్మోహన్ 8 మందిని సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యుడు వెంకట నారాయణరెడ్డి ని కూడా మా లీస్టులో చేర్చారు. ఆయన హౌస్ కే రాలేదు. సంతకమే చేయలేదు. కనపడలేదు, ధర్మా చేయలేదు. ఏమీ చేయలేదు. అయినా మా లిస్టులో చేర్చడం విచిత్రం. లోకేశ్ గారిని, చిక్కాల రామచంద్రరావు, మాజీ మంత్రి ఎన్ ఎం డి ఫరూఖ్ , యనమల రామకృష్ణుడు, మంతెన వెంకట సత్యనారాయణరాజు లను సస్పెండ్ చేయకపోవడం సంతోషం. సస్పెండ్ కానివారు హౌస్ లో ఉండి మా సీట్లల్లో ఉండి ప్రజల పక్షామ మా వాదనలు వినిపించాలి. అలా జరగనివ్వకుండా ఛైర్మన్ రెచ్చిపోయి వీరిని కూడా బయటికి తోసేయండని చెబుతున్నారు. మాపై డబ్బులు విసిరిన దువ్వాడ శ్రనివాస్ ను సస్పెండ్ చేయాలి. కనీసం మందలించాలి. మార్షల్స్ తో బలవంతంగా బయటికి తోసేశారు. లేదని తిరిగి హౌస్ లోకి వెళితే శాసనమండలి ద్వారాలకి ఇద్దరు మార్షల్స్ ని ఉంచి అనుమతించలేదు.

శాసనమండలి ఛైర్మర్ చెప్పారు మీరు లోపలికి వెళ్లడానికి వీలులేదు అని అంటున్నారు. మా గొంతు నొక్కారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. శాసనమండలిని లక్ష్యంగా చేసుకొని శాసనమండలి సభ్యులను సస్పెండ్ చేశారు. 8 రోజులు ఏమీ చేయలేకపోయారు. నిన్న 6 మందిని, నేడు 8 మందిని సస్పెండ్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ప్రజా క్షేత్రంలోకి వెళ్తాం. మీ భాగోతాన్ని బయటికి తీస్తాం. బడుగు, బలహీనవర్గాల సమస్యలు చాలా ఉన్నాయి. మాంగల్యాలను తెంచిన ఆడబిడ్డల ఉసురు తప్పక తగులుతుంది. 42 మంది మరణాల ఉసురు ఎక్కడికీ పోదు. ప్రజల పక్షాన మా గళాన్ని వినిపిస్తాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ శాసనమండలి ఛైర్మన్, మంత్రులకు ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ము ధైర్యం ఉంటే మాకు అవకాశం ఇవ్వండి. చర్చకు రెడీగా ఉన్నాం. భాగోతం బయట పెట్టడానికి ఆధారాలున్నాయి. సాక్షాధారాలతో రేపు వస్తాం. జగన్ అసెంబ్లీలో కాదు ప్రకటన చేయాల్సింది. మా శాసనమండలిలో కూడా మాట్లాడాలి. సహజ మరణాలని మాకు కూడా సమాధానం చెప్పాలి. రేపు కూడా సభ జరగనివ్వం. రేపు కూడా ప్రజల పక్షాన పోరాడుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కుల్ని వినియోగించుకోనీయడంలేదు. చర్చ జరిపించాలని చిడతలు వాయించడం తప్పా? ఈ ముఖ్యమంత్రికి బుద్ది చెబుతాం.

Leave a Reply