Suryaa.co.in

National

సినిమాల్లో మాయలు

వందేమాతరం

ఒక చిన్న కథని క్లుప్తంగా చెబుతాను తర్వాత దాని గురించి చర్చిద్దాం ముందుగా కధ చదవండి.

అదొక చిక్కటి అడవీ ప్రదేశం. అక్కడ ఒక బోయ రాజు తన కుటుంబంతో, పరివారంతో సుఖసంతోషాలతో ఉంటున్నాడు. ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. అతను పుట్టుకతోనే శివ భక్తుడు. అతను పెరిగి పెద్దవాడై మంచి విలుకాడుగా పేరు తెచ్చుకుంటాడు. ఒకరోజు అతనికి కలలో శివుడు కనిపించి కొండపైన ఉన్న వాయు లింగాన్ని దర్శించి పూజించమని చెప్తాడు.

శివుని ఆదేశానుసారం అతను ఆ గుడికి చేరుకుంటాడు, పరవశించిపోతాడు. అక్కడ శివలింగంపై అప్పటికే ఎవరో పూజించిన బిల్వదళాలను, ఇతర పుష్పాలను తొలగించి తనదైన శైలిలో అడవి పంది మాంసం నైవేద్యముగా సమర్పించి కొన్ని అడవి పుష్పాలతో అర్చన చేస్తాడు. తిరిగి మరునాడు అదే తంతు, అప్పటికే అలంకరించి ఉన్న ఫల పుష్పాలను తొలగించి తన శైలిలో శివుడను పూజిస్తాడు. ఇలా కొన్ని రోజులు సాగుతుంది.

మరొక పక్క అదే గుడిలో నిత్యం తెల్లవారుజామున వైదిక శాస్త్రానుసారము అర్చించే పూజారి ప్రతిరోజు తాను వచ్చేసరికి తన ధర్మానికి విరుద్ధంగా అక్కడ మాంస సమర్పణలు ఉండడం చూసి దుఃఖిస్తాడు. వాటిని తొలిగించి గర్భగుడిని శుభ్రపరిచి వైదిక ధర్మానుసారము తిరిగి అర్చన చేస్తాడు. ప్రతి ఉదయం ఇదే తీరు.‌ ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు పూజారి, బోయవాడు ఇద్దరూ ఆ పరమేశ్వరుని తాము నమ్ముకున్న ధర్మానుసారం అర్పిస్తూ ఉంటారు.

ఒకనాడు ఆ బ్రాహ్మణుడు ధర్మ విరుద్ధంగా జరుగుతున్న ఈ చర్యలకు దుఃఖించి ఆ పరమేశ్వరునితో మొరపెట్టుకుంటాడు. అంత పరమేశ్వరుడు ప్రత్యక్షమై చిరునవ్వుతో బ్రాహ్మణోత్తమా, నీ ధర్మానుసారం నువ్వు నన్ను ఆరాధిస్తూన్నావు, అలాగే మరొక భక్తుడైన బోయవాడు తాను నమ్మిన ధర్మాన్ని అనుసరించి అర్చిస్తున్నాడు. నాకు నిర్మల మనస్కలైన భక్తులైన మీరిద్దరూ సమానమే. నిర్మలమైన అతని భక్తిని నీకు నిరూపిస్తాను, నీవు గర్భగుడినందే ఒక పక్కగా ఉండి తిలకించమని చెప్తాడు.‌

యధావిధిగా బోయవాడొస్తాడు, అక్కడ ఉన్నటువంటి బిల్వదళాలను తొలిగించి తన రీతిలో అర్చిస్తున్న సమయంలో శివుడు కొన్ని పరీక్షల ద్వారా అతని అచంచలమైన భక్తిని పరీక్షించి అర్చకునకు నిరూపిస్తాడు. అతని భక్తికి పరవశుడైన శివుడు ప్రత్యక్షమై ఆ బోయవానికి, అక్కడే ఉన్న నిత్యం తనని ఆరాధించే బ్రాహ్మణునికి ఇద్దరికీ ఒకేసారి మోక్షం కలగజేస్తాడు.‌

ఈ కథని ఎంతమంది గుర్తుపడతారు? అందులో పాత్రలు ఎవరు? నాకు తెలిసి చాలా కొద్ది మంది మాత్రమే తెలిసినవారు ఉంటారు.
అదే ఆ కథలో ఆ బోయవాడు పరమ నాస్తికుడు, తన ప్రియురాలితో తిరుగుతూ ఉంటాడు. ఆమె కోరికపై ఒక రోజు అడవిలో సంచరిస్తూ దారి తప్పి ఒక శివాలయాన్ని చేరుతాడు. అలాగే అర్చకుడు పరమ దుర్మార్గుడు, సంస్కారహీనుడు, ఈ బోయవాని భార్యపై కన్నేసి, అది సాధించుకోవడం కోసం బోయవాన్ని ఎన్నో విధాల హింసిస్తాడు,….‌

ఇలా అసలు చరిత్రలో లేని అపసృతులు జోడిచ్చి ప్రజలని మాయ చేసే సన్నివేశాలతో చిత్రీకరించి చివరికి ఆ బోయవాడు శివునికి తన కళ్ళు తీసి అమర్చాడు అని చెప్తే ఒహో అది భక్తకన్నప్ప సినిమా అని గుర్తు పడతారు.

ఇలా వాస్తవికతకు దూరంగా, అసంబద్ధమైన, జుగుప్సాకరమైన సంభాషణలను, సన్నివేశాలను జొప్పించి అసలు చరిత్రనే మాయ చేసే ఇటువంటి పరిక్రియ చలనచిత్ర సీమలో ఎప్పటినుంచో సాగుతోంది. మన దురదృష్టం ఏమిటంటే ఇది తప్పు అని తెలిసిన వారు కూడా స్పందించకపోవడం.‌ ఇప్పుడు కొత్తగా వచ్చిన కన్నప్ప చిత్తమే కాదు, అంతకుముందు వచ్చిన భక్తకన్నప్ప సినిమాలో కూడా వాస్తవిక విరుద్ధ కథనమే ఉంది. బాపు గారి మీద నమ్మకంతో, ముళ్లపూడి వారిపై అభిమానంతో, ముఖ్యంగా అవగాహన లోపంతో ఆరోజుల్లో ఎవరూ అంతా శ్రద్ధ చూపించలేదు.

కానీ ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?. అత్యంత బలమైన సినీ మాధ్యమం ద్వారా కమ్యూనిస్టులు, దేశద్రోహులు, హిందూ వ్యతిరేకులు ఇలా మన పౌరాణిక పాత్రలు, చారిత్రక నేపథ్యమున కథలను వక్రీకరించి ప్రజలను మోసం చేస్తుంటే, సత్యానికి అసత్యానికి మధ్య సంధి కాలంలో ఉన్న నేటి మన తరం స్పందించకపోతే తర్వాత తరాల వారికి అసలు నిజాలు తెలిసే అవకాశమే లేకుండా పోతుంది.

అసలు కథలోని వాస్తవాలకు ఆధారాలు చూద్దాం.. స్వతహాగా తిన్నడు నామధేయుడైన ఆ బోయవాడు శివునికి కనులు సమర్పించడంతో కన్నప్ప అయ్యాడు. సినిమ్మాలో కన్నప్ప పరమ నాస్తికుడు అని చిత్రీకరించడం జరిగింది. ఆ విషయం చూస్తే భక్త కన్నప్ప గురించి మనకి ఆధారాలు ముఖ్యంగా పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం, నాయనార్ల చరిత్రను తెలిపే పెరిగె పురాణం (63 మంది నాయనార్ల లో భక్త కన్నప్ప నేత్రశ నారనార్ గా ప్రసిద్ధి), శంకరాచార్యుల వారి శివానందలహరి, ధూర్జటి గారి కాళహస్తి మహత్యంలలో కనిపిస్తుంది.

తిన్నడు తండ్రి కిరాతరాజు నాధనాథుడు, తల్లి తందె. ధూర్జటి ఒక దగ్గర వారి గురించి వర్ణిస్తూ

ఒక్కప్రొద్దుండి సెలయేట నుదకమాడి
నాథనాథుండు తందెయు నైజమైన
చతురలంకారములు దాల్చి సహజ భక్తు
నాత్మజునిజూచికై సేయు మన్ననతఁడు.

అంటూ నాథనాథుడు, ఆయన భార్య తందె ఉపవాసం ఉండి స్నానం ఆచరించి నాలుగు విధములైన అలంకారాలు ధరించి సహజ భక్తుడైన తమ కుమారుని చూసి అలంకరించుకోమని చెప్పారట. ఇక్కడ మనకి స్పష్టంగా కన్నప్ప చిన్నతనం నుంచి శివ భక్తుడు అని తెలుస్తుంది.
మరొక గొప్ప విషయం ఏమిటంటే కన్నప్ప గర్భమునందు ఉన్నప్పుడు అతని తల్లికి అడవి మృగములను సంహరించాలి. సెలయేటి ఇసుక తిన్న యందు ఉన్న శివుని దర్శించాలి. పుక్కిలించిన నీటితో శివుని అభిషేకించాలి అడవి పంది మాంసము శివునికి అర్పించాలి, నల్ల కలువలవంటి కన్నులతో శివుని పూజించాలి అనే కోరిక కలిగింది.
పంచాన ననేక పవ్యాఘ్రకోలది

చవియైన ఘోణి మాంసంబు దుప్పల బెట్టి యభవున కర్పింపనతివగోరె

ఇది కడుపులో ఉన్న శిశువు యొక్క గుణ గుణములను తెలిపే విధంగా ఉందికదా, అలాగే, జలకంబాడి విభూతిబెట్టుకునే రక్షామూలికా మాలికా
అంటూ తిన్నడు స్నానం చేసి విభూతి రాసుకొని రక్షాబంధముగా మూలికలతో కూడిన పూలదండను కట్టుకొని, అంటూ తిన్నడి బాల్యాన్ని వర్ణిస్తారు.

బాలక! యిచటశిలావట
మూలంబునఁగొండదండ మొగలేటి దరిన్
శైలసుతాపతి భక్తుల
పాలిటి పెన్నిధి వసించు భక్తింగొలుమా.
అంటూ పలానా చోట శివలింగం ఉంది దానిని భక్తితో సేవించమని శివుడు తిన్నడుకి ఉపదేశించాడు.

మనకు ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి?

ఇక ఆలయ పూజారి అయిన శివబ్రాహ్మణుడి ప్రస్తావనకు వస్తే

దేవా! యీ కసుమాలము
దేవెడు కేట్టోయి నీదు దేహంబంటం
గా వెఱపయ్యేడు నెంగిలి
కీ వెట్లోర్చితివి? పార్వతీశ్వర! చెపుమా?

అంటూ శివలింగంపై ఉన్న ఎంగిలి దొన్నెలను చూసి బాధతో తినగా మిగిలిన పదార్థం నీవు ఎట్ల సహించుతివి? అని శివునిని ప్రశ్నిస్తూ రోదిస్తాడు. (అవి శివుడే తిన్న పదార్థములని ఆయన గుర్తించలేడు కదా.)

…..యిది వేఁడెద సత్యంబుఁజెప్పవే! కరుణాబ్ధి! అంటూ ఈ పని ఎవరు చేశారు నాకు నిజం చెప్పు అని శివునిని అర్ధిస్తాడు.

చివరికి భక్తకన్నప్పని పరీక్షించిన తర్వాత శివుడు ఆ శివ బ్రాహ్మణునితో

శివగోచర! యీ భక్తుని
యవిరళతర భక్తి మహిమ యాద్యంతముఁగం
టివిగద! సద్భక్తుండితఁ
డవుఁగద! నీ మనసువచ్చునా? యిఁక ననుచున్.

ఈ భక్తుని దృడమైన భక్తిని చూసావు కదా? ఇతడు భక్తుడనుటకు నీకు సమ్మతమేనా అంటాడు.

దరహాసము నెఱపుచుఁదన పరిసరమున కాటవికుని బ్రాహ్మభక్తున్
గరుణం బిల్చుక మీకే
వరమింపన వారు కృత్తి వాసునితోడన్.
అంటూ శివుడు చిరునవ్వుతో కన్నప్పని, శివ బ్రాహ్మణుని పిలిచి మీకు ఏ వరం కావాలని అడుగుతాడు.
శివద్విజుడు, తిన్నడూ ఇరువురునూ మాకు నీ సాయుజ్యం ఇమ్మని ప్రార్థిస్తారు.

ఇందులో ఎక్కడైనా బ్రాహ్మణుడు గురించి చెడు ప్రస్తావన ఉందా?, లేదుకదా, మరి సినిమాలలో అటువంటి వికృతాలు ఎందుకు జరుగుతున్నాయి.

ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. సుమారు 1960 – 70 దశకం నుంచి మన సినీ, ప్రచార మాధ్యమాలు పూర్తిగా కమ్యూనిస్టు – మార్క్సిస్టుల ప్రభావంలో విలవిలలాడుతున్నాయి. వారి దృష్టిలో హిందువులు అంటే ఆధిపత్యులు అని. అందులోనూ హిందుత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉండే బ్రాహ్మణలు, సంస్కారవంతమైన వేషధారణ కల స్త్రీమూర్తులు. అందుకే వీరిరువురినీ కించపరిచే విధంగా వారి ప్రచారాలు ఉంటాయి.
అదృష్టం కొద్దీ గత పది సంవత్సరాలుగా జాగురుతమౌతున్న హిందూ జాతి కి చెందిన మనం ఇటువంటి విషయాలలో స్పష్టంగా మన అభిప్రాయాలను తెలియజేసి మన పౌరాణికఇతిహాస చరిత్రలను యథావిధిగా ముందు తరాలకు అందించే ప్రయత్నం చేద్దాం.

– మృశి
(దశిక ప్రభాకర శాస్త్రి)

LEAVE A RESPONSE