Suryaa.co.in

Political News

వెంకయ్య విషాద నిష్క్రమణ

– ఆశకు అంతు ఉండొద్దూ?

ఉత్కంఠతకు తెరపడింది. దేశ 14వ ఉపరాష్ట్రపతిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ధన్ ఖడ్ ను ఎంపిక చేసి, భారతీయ జనతా పార్టీ రాజకీయ సంచలనం సృష్టించింది. వ్యూహ ప్రతి వ్యూహాలతో సాగిన ఈ ఎంపిక కారణంగా గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, జాతీయ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు రాజకీయ జీవితానికి, ప్రధాని మోడీ శాశ్వతంగా తెరదించినట్టయింది.

వెంకయ్య నాయుడుకు గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఒక్క విషయంలో పెద్దపీట వేసిన భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం, ఈసారి ఇంత కటువుగా వ్యవహరించి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పక తప్పదు. ఈ మార్పుకు దారి తీసిన పరిస్థితులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. వెంకయ్య వ్యవహార శైలిని, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించినందునే ఆయనకు రాజకీయ సన్యాసం తప్పలేదని చెబుతున్నారు. కేంద్ర మంత్రి పదవి నుంచి చాకచక్యంగా తప్పించి, ఆయనను ఐదు సంవత్సరాల క్రితం ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసినప్పుడే, వెంకయ్య క్రియాశీలక రాజకీయ జీవితానికి తెరపడింది. ఇప్పుడు ఏ పదవి లేకుండా పోవడంతో వెంకయ్య నాయుడు రాజకీయ సన్యాసం స్వీకరించక తప్పదు.

మనవాడి వల్లే భారతీయ జనతా పార్టీ బలపడింది. మనవాడి వల్లే నరేంద్ర మోడీ ప్రధాని కాగలిగారు. మన వాడే లేకపోతే మోడీ ఎక్కడుండేవాడు? మన వాడికి రాష్ట్రపతి పదవి లభించకుండా మోడీ తీవ్ర అన్యాయం చేసి ఆంధ్రులను అవమానపరిచారని గొంతు చించుకున్న అస్మదీయులకు, అస్మదీయ మీడియాకు మోడీ తీసుకున్న తాజా నిర్ణయం మింగుడు పడదు. ఆశ కైనా హద్దుండాలంటారు. జాతీయస్థాయిలో తమకు కొండంత అండగా నిలిచిన వెంకయ్య నాయుడుకు ఇప్పుడు పట్టిన రాజకీయ గ్రహణం, అస్మదీయులకు గొడ్డలి పెట్టు లాంటిది. రెండే రెండు సార్లు విధాన సభకు గెలిచి, ఆ తర్వాత రెండు మూడు ఎన్నికలలో పరాజయం పాలైన వెంకయ్య నాయుడు నాలుగు సార్లు రాజ్యసభకు అధినాయకత్వం ఆశీస్సులతో ఎంపికయ్యారు.

naidu1పార్టీ జాతీయ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆయన అధ్యక్షునిగా ఉన్న కాలంలోనే, వాజ్ పేయి ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోయిన సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయికి ఎదగడంలో వెంకయ్య నాయుడు ఆచితూచి వ్యవహరించేవారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ నాయకులు ఎవరూ కూడా తన దారికి అడ్డం రాకుండా, విజయవంతంగా పక్కకు తొలగించ గలిగారు. పార్టీ పట్ల విధేయత, అచంచల విశ్వాసం ప్రకటించిన సీనియర్ నాయకుడు జూపూడి యజ్ఞ నారాయణ, వి రామారావు, పీవీ చలపతిరావు, బద్దం బాల్ రెడ్డి, టైగర్ నరేంద్ర, చెన్నమనేని విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ వంటి వారిని అడ్డుకోగలిగారు.

పార్టీ అగ్ర నాయకులు ఎల్కే అద్వానీని ఒక బూచిగా చూపించి, ఆయన ద్వారా తన ప్రత్యర్థులను అణగదొక్కారన్నది జగద్వితం. ప్రజలచే ఎన్నుకోబడిన విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ వంటి వారికి కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా లభించలేదు. వారికి వచ్చిన అవకాశాలు కూడా చివరి క్షణాల్లో జారిపోయాయి. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఒకసారి వేసిన మూడు కుర్చీలలో, చివరి క్షణంలో ఒక కుర్చీని తొలగించవలసి వచ్చింది. ఆ స్థానం దత్తాత్రేయకి దక్కవలసి ఉండగా, అద్వానీ శిబిరం పన్నిన కుట్ర వల్ల దత్తాత్రేయకు రిక్త హస్తం మిగిలింది. ఇటు విద్యాసాగర్ రావు అటు దత్తాత్రేయ సమర్థులే. వారు ప్రజాబలంతో పార్లమెంటుకి ఎన్నికయ్యారు. వీరికి లభించవలసిన క్యాబినెట్ హోదా దక్కకపోవడానికి అద్వానీని అడ్డం పెట్టుకొని వెంకయ్య నాయుడు ఆడిన రాజకీయాలు ఫలించాయి.

వెంకయ్య నాయుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేవారు. కానీ పదవుల పంపకం ఇతర అంశాలను ఖరారు చేసే విషయంలో, ఆయన ఆంధ్రాకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకునేవారు. ఆ తర్వాత ఒక దశలో తనకు ఆంధ్రప్రదేశ్ తో ఎట్టి సంబంధాలు లేవని, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని ప్రకటించారు. వెంకయ్య నాయుడు రాజకీయంగా శరవేగంగా ఎదిగారు. అత్యవసర పరిస్థితి తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆయన ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఆంధ్ర ఉద్యమం సందర్భంగా విద్యార్థి నాయకుడిగా ఉవ్వెత్తున ఎగిసిన వెంకయ్య నాయుడు 1978లో మొట్టమొదటిసారిగా ఉదయగిరి నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. 1978 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే వరకు ఆయన భారతీయ జనతా పార్టీలో నిప్పులాంటి మనిషిగా పేరుపొందారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన ఆలోచన ధోరణి, రాజకీయ వ్యూహం కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. భారతీయ జనతా పార్టీ తన ఉనికిని, మనుగడను కోల్పోయే స్థితికి చేరుకుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తెలుగుదేశం పార్టీలో విలీనం అయిపోయిందా అన్న అనుమానాలు బయలుదేరాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు? చంద్రబాబా, పర్వత ఉపేంద్రా, లేక వెంకయ్య నాయుడా అన్న మీమాంస బయలుదేరింది.

తెలుగుదేశం పార్టీని గుడ్డిగా బలపరచడం ద్వారా, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షోభంలో చిక్కుకుంది. తమ పార్టీ బ్రష్టు పట్టిపోవడానికి తెలుగుదేశంతో విలీనం అయిపోయామన్న సంకేతాలు ప్రజలలోకి వెళ్లడమే కారణమని సీనియర్ నాయకులు , అనేకమంది అప్పట్లో అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. అయితే పార్టీలో తిరుగులేని ఆదిపత్యాన్ని చలాయించిన అద్వానీ, ఈ ఫిర్యాదులపై ఎట్టి చర్య తీసుకోకపోగా వెంకయ్య నాయుడును వెనకేసుకొచ్చారు.

పార్టీ దిగజారి పోవడానికి ప్రధాన కారకులైన వారిపై చర్య తీసుకోకపోగా వెంకయ్య నాయుడును పూర్తిగా బలపరిచారు. భారతీయ జనతా పార్టీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో కోలుకునే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ప్రత్యక్ష ఎన్నికలలో పార్లమెంట్ కి ఎన్నిక కాలేకపోయిన వెంకయ్య నాయుడుకు పార్టీ అధినాయకత్వం పెద్దపీట వేసి, అత్యంత ప్రాధాన్యత కల్పించి మంత్రి పదవులు కట్టబెట్టింది. ఆయన వల్ల పార్టీకి ఆశించిన బలం చేకూరకపోగా, అసమ్మతి రాగాలు పెరిగాయి. చివరకు ఆయన సామాజిక వర్గం కూడా పార్టీని ఆదరించి బలపరిచిన దాఖలాలు లేవు.

వెంకయ్య నాయుడు ద్వారా ప్రయోజనం పొందిన అస్మదీయులు, పార్టీకి ఏమాత్రం అండగా నిలవడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఆంధ్ర తెలంగాణాలలో భారతీయ జనతా పార్టీ నామమాత్రంగా మిగిలి పోవడానికి అనేక కారణాలు న్నాయి. వెంకయ్య నాయుడు వల్ల పార్టీకి ఆశించిన ఫలితాలు మాత్రం చేకూరలేదన్నది పచ్చి నిజం. తన రాజకీయ ఎదుగుదల కోసం ఆయన ప్రత్యర్ధులను అణిచివేయడంలో ఏ మాత్రం వెనకాడ లేదు. బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి పార్టీ అధ్యక్షులుగా అర్ధాంతరంగా దిగిపోయిన తర్వాత, వెంకయ్య నాయుడు పార్టీ పగ్గాలను చేపట్టారు. దేశమంతా విస్తారంగా పర్యటించినా ఎన్నికలలో మాత్రం ఎట్టి ప్రభావం చూపలేకపోయారు.

రాజకీయ వాతావరణం మారుతున్నట్లు గమనించగానే ఆయన అద్వానీని విడిచిపెట్టి, నరేంద్ర మోడీ పక్షాన చేరారు. మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇతర మంత్రుల కంటే కొంచెంnaiduదూకుడుగా వ్యవహరించి, మోడీ అసంతృప్తికి పాలయ్యారన్న ప్రచారం జరుగుతోంది. మోడీ దేశంలో లేని సమయంలో ఆయన స్వతంత్రంగా వ్యవహరించి, ఇతర మంత్రులపై పెత్తనం చెలాయించడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. వెంకయ్య నాయుడుకు ప్రజాక్షేత్రంలో తగినంత బలం లేదు. ఆయన దొడ్డిదారిన రాజ్యసభకు రావడం తప్పించి, రాజకీయంగా సాధించిన విజయాలు లేవు.

తన అస్మదీయులకు కొండంత అండగా నిలిచారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. వెంకయ్య నాయుడు గ్రాఫ్ పడిపోవటం వల్లే, ఆయనకు లభించవలసిన రాష్ట్రపతి పదవి దక్కలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపరాష్ట్రపతిగా తిరిగి కొనసాగించే అవకాశాలు న్నాయని, అస్మదీయ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ముందు.. పార్టీ అధ్యక్షుడు నడ్డా, సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంకయ్య నాయుడును ఆగమేఘాల మీద హైదరాబాదు నుంచి ఢిల్లీకి పిలిపించారు. ఆయనతో సమాలోచనలు జరిపినప్పుడు ఆయనే రాష్ట్రపతి అభ్యర్థి అనుకున్నారు. కానీ వెంకయ్య నాయుడుకు.. తాము ద్రౌపది మార్ము ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తున్న విషయాన్ని ఆయనకు మాటవరసకైనా చెప్పలేదని జాతీయ పత్రికలు ప్రకటించాయి.

వెంకయ్య నాయుడు రాజకీయ పరిస్థితి తారుమారయిందన్న విషయం తెలిసినప్పటికీ, అస్మదీయ మీడియా ఆయన పేరునే ప్రచారం చేసి అభాసు పాలయింది. ఢిల్లీలో తమకు రాజ్యాంగ పరమైన పదవులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకేసారి రంగం నుంచి నిష్క్రమించటం, అస్మదీయులను తీవ్రంగా కలవరపెడుతోంది. గతనుంచి వర్తమానాన్ని, వర్తమానం నుంచి భవిష్యత్తును రూపకల్పన చేసుకోవడం రాజకీయ నాయకులకు అలవాటు. రాజకీయ చదరంగంలో ఆరితేరిన వెంకయ్య నాయుడు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో వేచి చూడక తప్పదు.

– శ్రీధర్

LEAVE A RESPONSE