వినాయకచవితి అంటే వినాయకుని జయంతా లేక విఘ్నాధిపతి అయిన రోజా?

చవితి వినాయకుడు ఆవిర్భవించిన రోజు. ఒకొక్క తిథికి ఒకొక్క అధిదేవత ఉంటారు. చతుర్థీతిథికి గణపతి అధిదేవతగా చెప్పబడుతున్నాడు. ఇక్కడ పుట్టడం, ఆవిర్భవించడం – ఇవి మనకు అర్థం అయ్యే పదాలుగా పురాణం మనకు అందిస్తున్నది. గణపతి ఒకప్పుడు పుట్టి, మరెప్పుడో అంతరించేవాడు కాదు. ఎప్పుడూ ఉండే దైవం. అయితే శివపార్వతుల తపస్సుకు ఫలితంగా గణపతి భాద్రపద శుద్ధ చవితి నాడు ఆవిర్భవించాడు. దీనికి వరదా చవితి అని పేరు. భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి అని చేస్తున్నాం. ఇది మనకు పురాణములయందు, శాస్త్రములయందు కనిపిస్తున్న అంశం.

ఇదేకాకుండా చవితులు రెండూ ప్రధానంగా చెప్పబడుతూ ఉంటాయి. శుద్ధచవితిని వరదా చవితి అంటారు, కృష్ణ చవితిని సంకష్టహర చతుర్థి అంటారు. ఈ సంకష్టహర చతుర్థికి ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు విఘ్నములు కలిగితే వాటిని తొలగించడానికి ప్రణవ ధ్యానం చేస్తూండగా ఆ ఓంకార స్వరూపమే గణపతిగా సాక్షాత్కరించి విఘ్నాలు తొలగించింది. అది కృష్ణ చవితినాడు జరిగింది.

చతుర్థి రెండు రూపములు – శుక్ల, కృష్ణ అని. ఆ రెండు రూపములు చతుర్థీతిథికీ అధిదేవత గణపతియే. అందుకు ఆరోజున ఆరాధించడం కనబడుతున్నది. ఇష్టసిద్ధి కలగాలంటే శుక్లచవితి (వరదాచవితి), కష్టం తొలగాలంటే కృష్ణచవితి(సంకష్టచతుర్థి). ఇది చవితి తిథి యొక్క ప్రత్యేకత.

Leave a Reply