సెక్షన్ 307 విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘన

– కుప్పం సహా పలు నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై డీజీపీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ

లేఖలో అంశాలు:-
పోలీసులే ఫిర్యాదుదారులుగా టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారు.సెక్షన్ 307 దుర్వినియోగం చేసి టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. సెక్షన్ 307 విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతోంది. కుప్పం, పుంగనూరు, మాచర్ల తదితర ప్రాంతాల్లో అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలి.పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 307 నమోదు చేయడం, ఆపై ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల జాబితాలో ‘ఇతరులు’ అని పేర్కొనడం ప్రతి కేసులో జరుగుతోంది.ఇలాంటి అనైతిక, చట్ట విరుద్ధమైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పోలీసులు టీడీపీ కార్యకర్తలను విచక్షణారహితంగా అరెస్టు చేసి వేధిస్తున్నారు.భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి అవసరమైన నిబంధనలను సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.ఘటనలో ఉపయోగించిన ఆయుధం, స్వభావం, గాయం, దాడికి ఎంచుకున్న శరీర భాగం, ఉద్దేశాన్ని నిర్ధారించుకుని మాత్రమే సెక్షన్ 307 పెట్టాల్సి ఉంది.

అయితే కుప్పంలో టీడీపీ మద్దతుదారులపై విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేసిన తర్వాత పోలీసులే సెక్షన్ 307 కింద టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు.నాడు డ్యూటీలో ఉన్న పోలీసులు పోలీసు యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్ ధరించలేదు.అదే తరహాలో మఫ్టీలో పోలీసులు నేడు బాధితులను అరెస్టు చేస్తున్నారు.సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అరెస్టుల సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండాలని, వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో తదితర వివరాలను లిఖిత పూర్వకంగా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.

ఈరోజు, కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈశ్వరప్ప, గణేష్‌లను యూనిఫాంలో లేని వ్యక్తులు వెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్టు గురించి కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వలేదు.ప్రకాష్, వాసు, జమీర్, శేషులను కుప్పం రూరల్ పోలీసులు FIR లో ‘ఇతరుల’ కింద చూపి అరెస్టు చేశారు.ఇదే ధోరణి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ, పుంగనూరు, మాచర్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో జరుగుతోంది.

పోలీసుల ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.పోలీసులు మా పార్టీ కార్యకర్తలను నేరస్థులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించకుండా అధికార వైఎస్సార్‌సీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారు.రాబోయే రోజుల్లో ఇలాంటి పోలీసులు శిక్షించబడుతారు. పోలీసు శాఖ అధిపతిగా మీరు అధికార దుర్వినియోగాన్ని నియంత్రించే ప్రయత్నం చెయ్యాలి.ఇలాంటి వేధింపులు, అరెస్టులను వెంటనే ఆపాలి. కుప్పం, పుంగనూరు, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్రమంగా అదుపులోకి తీసుకున్న మా కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలి.

Leave a Reply